క్యాలిపర్సే కళాకారిణిని చేశాయి!

‘వేటిని పోగొట్టుకున్నా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి చాలు... అనుకున్నవన్నీ చేయడానికి’.. ఈ మాటనే నమ్మారామె. అందుకే... వైకల్యం వెక్కిరించినా, భరించలేని నొప్పులు భయపెట్టినా, వెనక్కి తగ్గలేదు.

Updated : 03 Dec 2022 10:52 IST

‘వేటిని పోగొట్టుకున్నా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి చాలు... అనుకున్నవన్నీ చేయడానికి’.. ఈ మాటనే నమ్మారామె. అందుకే... వైకల్యం వెక్కిరించినా, భరించలేని నొప్పులు భయపెట్టినా, వెనక్కి తగ్గలేదు. కోయిలలా రాగాలు పలికిస్తూ, క్యాలిపర్సుతోనే... అభినయిస్తూ... మరెందరికో చేయూతనిస్తూ సాగిపోతున్నారు. డిసెంబరు 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకుంటోన్న డా.పొట్టబత్తిని పద్మావతి స్ఫూర్తి గాథ ఇది...

పద్మావతి వాళ్లది ఖమ్మం. అమ్మానాన్నలు సత్యం, కుసుమ. ఏడాది వయసుకే పోలియో బారిన పడింది తను. 90శాతం వైకల్యంతో... మంచానికే పరిమితమైపోయిన కూతుర్ని చూసి తల్లి కుమిలిపోయేది. పైగా పేదరికం... దాంతో పాప భవిష్యత్తుపై బెంగ పెట్టుకుందామె. ఆ విషయం తెలిసి ఆస్ట్రేలియాకు చెందిన ఫిజియోథెరపిస్టు క్లారా హీటన్‌ ఐదేళ్ల పద్మావతిని దత్తత తీసుకున్నారు. అప్పట్లో ఆమె సెయింట్‌ మేరిస్‌ పోలియో పునరావాస కేంద్ర పర్యవేక్షకురాలు.

ఎనిమిది సర్జరీలు... ఆ కేంద్రానికి చేరడమే పద్మావతి జీవితాన్ని మలుపు తిప్పింది. క్లారా ఆ చిన్నారి తన పనులు తాను చేసుకునేలా చేయాలనుకున్నారు. అందుకోసం ఎనిమిదేళ్ల వయసులో పద్మావతికి మొదటి సర్జరీ జరిగింది. ఆపై రెండు కాళ్లూ, నడుము, పాదాలు.. ఇలా 8 శస్త్రచికిత్సలు జరిగాయి. అందరిలా హాయిగా ఆడుకోవాల్సిన వయసులో... భరించలేని నొప్పితో గడిపిందా చిన్నారి. క్రమంగా క్యాలిపర్స్‌ సాయంతో అడుగులు మొదలుపెట్టింది. చదువన్నా తనకెంతో ఇష్టం. అందుకే క్లారా మంచం మీదే పద్మావతికి పాఠాలు చెప్పించారు. తనూ ఆమె నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంది. బడికెళ్లకపోయినా తరగతిలో ఎప్పుడూ తనే ఫస్టు. శాస్త్రవేత్త కావాలన్నది తన కల. కానీ దివ్యాంగురాలనే కారణంతో... బైపీసీలో సీటు నిరాకరించారు. దాంతో హెచ్‌ఈసీలోనే చేరింది. ఆపై డిగ్రీ చేసింది.

పాడదామని వస్తే... ఎన్ని బాధలున్నా... సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేది పద్మావతి. ముఖ్యంగా వివిధ పాత్రల్లో అభినయిస్తూ, శ్రావ్యంగా పాడుతూ ఆకట్టుకునేది. ఓ సారి డా.వంశీ రామరాజు నిర్వహిస్తోన్న సినీగీతాల పోటీ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆమె జీవితం ఓ మలుపు తిరిగింది. తన ప్రతిభను గుర్తించిన ఆయన సంగీతంలో శిక్షణ ఇప్పించి తమ వేగేశ్న ఫౌండేషన్‌ సంస్థలో సంగీత ఉపాధ్యాయురాలిగా ఉపాధి కల్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనల్లో పాల్గొందామె. క్యాలిపర్సుతోనే శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, పాండురంగ, సత్యభామ పాత్రలు అభినయిస్తూ వందల పురస్కారాలు సాధించారు.

సాయం చేయాలని... శారీరకంగా, మానసికంగా తాను అనుభవించిన వేదన మరెవరూ పడకూడదని ‘పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌(డిజ్‌)ఏబుల్డ్‌’ సంస్థని ఏర్పాటు చేశారావిడ. దీనిద్వారా సంగీతం, కంప్యూటర్స్‌, టైలరింగ్‌, నృత్యాల్లో దివ్యాంగులకు ఉచిత శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలూ చూపిస్తున్నారు. సెన్సార్‌ బోర్డు మెంబర్‌గానూ సేవలందించారు. వైకల్యాన్ని అధిగమించి నాటక రంగంలో అద్వితీయ ప్రతిభ చూపించినందుకు  2009లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. 2011లో స్త్రీశక్తి పురస్కారం, 2017లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా రోల్‌మోడల్‌ అవార్డును స్వీకరించారు. కళారంగంలో రాణిస్తున్నందుకు 2019లో గౌరవ డాక్టరేట్‌నూ అందుకున్నారు. తాజాగా మరోసారి రాష్ట్రపతి అవార్డుని తీసుకోనున్నారు.

- సూర్యకుమారి, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్