చిరంజీవి ప్రశంస మరవలేను..

నటీనటులకు దుస్తులు డిజైన్‌ చేయాలంటే.. ఫ్యాషన్‌ ధోరణులు తెలియాలి. వాళ్ల ఇమేజ్‌కు సరిపోవాలి... అందంగా కనిపించేలా చేస్తూనే.. పాత్రకీ అద్దం పట్టేలా ఉండాలి.

Updated : 04 Dec 2022 07:26 IST

నటీనటులకు దుస్తులు డిజైన్‌ చేయాలంటే.. ఫ్యాషన్‌ ధోరణులు తెలియాలి. వాళ్ల ఇమేజ్‌కు సరిపోవాలి... అందంగా కనిపించేలా చేస్తూనే.. పాత్రకీ అద్దం పట్టేలా ఉండాలి. వాళ్ల అభిమానులను కట్టిపడేయాలి. అప్పుడే ఆ డిజైనర్‌ ‘హిట్టు’ కొట్టినట్టు. చిన్న వయసులోనే అలాంటి విజయాలెన్నో తన ఖాతాలో వేసుకున్నారు గౌరీ నాయుడు. ఇంజినీరైన ఆవిడ కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌లో ఎలా రాణిస్తున్నారో వసుంధరతో పంచుకున్నారు!

వైజాగ్‌ అమ్మాయిని. ముగ్గురు అక్కాచెల్లెళ్లం. నా రెండేళ్లప్పుడు నాన్న చనిపోతే అమ్మే మమ్మల్ని పెంచింది. ఇంజినీరింగ్‌ అవ్వగానే ఉద్యోగం వచ్చింది. అయినా ఏదో అసంతృప్తి. చిన్నప్పట్నుంచీ డిజైనింగ్‌పై ఆసక్తి. ప్రయత్నిద్దామని కొలువుకు రాజీనామా చేసి, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో చేరా. కోర్సు చేస్తున్నప్పుడే అనుకోకుండా నిహారిక కొణిదెల తొలిచిత్రం ‘ఒక మనసు’కు అసిస్టెంట్‌ డిజైనర్‌గా అవకాశమొచ్చింది. వాళ్లమ్మ పద్మజ ఆ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌. తర్వాత చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత ఆఫీసు నుంచి ఫోన్‌! ఆవిడప్పుడు ఖైదీ నెం.150లో చిరంజీవికి దుస్తులు డిజైన్‌ చేస్తున్నారు. మూడ్రోజులు కలిసి పని చేద్దాం.. ఆలోచనలు కలిస్తే కొనసాగి ద్దామన్నారు. నా పని నచ్చి మొదటిరోజు సాయంత్రానికే అసిస్టెంట్‌గా చేరమన్నారు. అప్పుడే మొదటిసారి చిరంజీవిని కలిశా. ఆ ఆనందంలో నేనేం మాట్లాడానో ఆయనకొక్క ముక్కా అర్థం కాలేదు.. నేనాయనకి పెద్ద ఫ్యాన్‌ అన్నదొక్కటీ అర్థమైంది. కచ్చితత్వానికి ప్రాధాన్యమిస్తారాయన. ఒక డిజైన్‌ కుదరకపోతే మరోటి ప్రయత్నిద్దామని ఓర్పుగా ప్రోత్సహిస్తారు. ఆ సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. సినిమా విడుదలయ్యాక ‘థాంక్యూ. బాగా పనిచేశావు. ఇలాగే కష్టపడితే మంచి పేరు తెచ్చుకుంటావ’న్న చిరంజీవి ప్రశంసని మర్చిపోలేను. తర్వాతా ఓ షో కోసమూ ఆయనకు డిజైన్‌ చేశా.

సవాలైనా..

సుస్మితతో పనిచేసేప్పుడే రామ్‌చరణ్‌నీ కలిశా. రంగస్థలం సినిమాకీ సుస్మితతో కలిసి పని చేయొచ్చుగా అనడిగారు. అప్పటికే నాకు డిజైనర్‌గా అవకాశాలొస్తున్నాయి. చరణ్‌, దర్శకుడు సుకుమార్‌.. పెద్ద టీమ్‌ కాబట్టి, సరేనన్నా. సుకుమార్‌తో పనిచేయడం సవాలే. చరణ్‌ పాత్రకు ఆ కాలానికి తగ్గట్లు దుస్తులు అందించడానికి చాలా కష్టపడ్డాం. మరుసటి రోజు ఏం సిద్ధం చేయాలన్నది ఆ రాత్రి చెప్పేవారు. అప్పటికప్పుడు 10 డిజైన్లు ఫొటోషాప్‌లో రూపొందించి, చూపించే వాళ్లం. ఆయన సరే అన్నాకే తయారీ మొదలయ్యేది. పైగా దుస్తులు పాతవాటిలా కనిపించాలి. వాటిని మట్టిలో దొర్లించి ఉతికి ఆరబెట్టి, ఉదయానికల్లా అందించే వాళ్లం. ఈ క్రమంలో నిద్రలేని రాత్రులెన్నో! తర్వాత బాగున్నాయని వచ్చే ప్రశంసలతో ఆ కష్టమంతా మర్చిపోయేవాళ్లం.

15 సినిమాలు..

గద్దలకొండ గణేష్‌లో వరుణ్‌తేజ, అధర్వ, పూజాహెగ్దే సహా అందరికీ కాస్ట్యూమ్‌లు డిజైన్‌ చేయాలి. దీన్నో ఛాలెంజ్‌గా తీసుకొని.. రాత్రి, పగలు తేడా లేకుండా ఏడాది కష్టపడ్డా. పూజాహెగ్దే కోసం.. కనీసం మూడ్రోజులు పట్టే గౌనును ఒక్క రాత్రిలో చేసిస్తే.. దర్శకుడు మెచ్చుకున్నారు. సూర్యకాంతం, అక్షర, ఈ మాయ పేరేమిటో, తెల్లవారితే గురువారం, ఆరి.. ఇలా 15 సినిమాలకు డిజైన్‌ చేశా. యాంకర్‌ అనసూయ మంచి స్నేహితురాలు. తనకు ఫ్లాష్‌బ్యాక్‌, సింబా సినిమాలతోపాటు షోలకూ దాదాపు 500కుపైగా దుస్తులు రూపొందించా. నందితాశ్వేత, అనుపమ, ప్రియాంకా జువాల్కర్‌, లావణ్య త్రిపాఠి, మృణాలిని ఠాకూర్‌లకు వ్యక్తిగత స్టైలిస్ట్‌నయ్యా. నేను పనిచేసిన వెబ్‌సిరీస్‌ విడుదల కానుంది. ప్రస్తుతం మా వారు అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ‘శశివదనే’ చిత్రానికి చేస్తున్నా. నా బృందంలో ఏడెనిమిది మంది, వర్క్‌షాపులో ముగ్గురు పని చేస్తారు. పౌరాణిక చిత్రాలు, మణిరత్నం, శేఖర్‌కమ్ముల వంటి వారితో పని చేయాలనుంది. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలకు దుస్తులు డిజైన్‌ చేయడం నా కల.


అమ్మాయిలు నచ్చిన రంగంలో అడుగుపెట్టడానికి, లక్ష్యాలను సాధించడానికి కృషి చేయడం పెరుగుతోంది. పోటీ ప్రపంచంలో గెలవాలంటే అబ్బాయిల కన్నా ఎక్కువ స్థిరత్వం, సహనం, ధైర్యం ఉంటేనే సాధించగలం. రక్షణ విషయానికొస్తే మనం అప్రమత్తంగా ఉండటం కూడా చాలా అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్