అమ్మాయిని కాబట్టి... సీఈఓనైనా గుర్తించరు!

చదువే ఆడపిల్ల తలరాతను మారుస్తుందన్న అమ్మ మాటే స్ఫూర్తిగా అడుగులేశారు. భిన్నమైన కెరియర్‌ని ఎంచుకున్నారు... మహిళలు అరుదుగా పనిచేసే యంత్ర పరికరాల ఉత్పత్తిలోకి అడుగుపెట్టారు. అడ్డంకులు, వివక్షా అడుగడుగునా సవాళ్లు విసురుతున్నా... విజయపథాన సాగుతున్నారు ‘ఆటోక్రసీ మెషినరీ’ సహ వ్యవస్థాపకురాలు సంతోషి బుద్ధిరాజు.

Updated : 05 Dec 2022 07:15 IST

చదువే ఆడపిల్ల తలరాతను మారుస్తుందన్న అమ్మ మాటే స్ఫూర్తిగా అడుగులేశారు. భిన్నమైన కెరియర్‌ని ఎంచుకున్నారు... మహిళలు అరుదుగా పనిచేసే యంత్ర పరికరాల ఉత్పత్తిలోకి అడుగుపెట్టారు. అడ్డంకులు, వివక్షా అడుగడుగునా సవాళ్లు విసురుతున్నా... విజయపథాన సాగుతున్నారు ‘ఆటోక్రసీ మెషినరీ’ సహ వ్యవస్థాపకురాలు సంతోషి బుద్ధిరాజు. హైదరాబాద్‌కు చెందిన  ఆమె తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

యంత్ర పరికరాల తయారీ పూర్తిగా పురుషాధిక్య రంగం. ఇక్కడ ఏడాదిన్నరలోనే పట్టు తెచ్చుకోవడం తేలిక కాదు. అయితే ఇష్టంగా ఏ పని చేసినా... అది సులువుగానే అవుతుందని నమ్ముతాను. నాన్న కృష్ణారావు, అమ్మ వల్లి. మా తాతగారు వ్యవసాయంలో నష్టాలు భరించలేక హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. చదివితేనే భవిష్యత్తు, అదే నీ తలరాతను మారుస్తుందని అమ్మ తరచూ చెప్పేది. నేనూ రోజూ సుమారు 60 కిలోమీటర్లకు పైగా బస్సుల్లో వెళ్లి చదువుకునే దాన్ని. ఐఐటీ వారణాసిలో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ చేశా. అప్పుడే నిర్ణయించుకున్నా పారిశ్రామికవేత్తగా స్థిరపడాలని.

చదువుకునేప్పుడే స్టార్టప్‌...

సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లే స్థైర్యం చదువుకునే సమయంలోనే ఏర్పడింది. తరచూ హైదరాబాద్‌ నుంచి వారణాసికి రైలు ప్రయాణం చేసేదాన్ని. దారిలో సరైన ఆహారం దొరికేది కాదు. అప్పటికీ ఫుడ్‌ డెలివరీ యాప్‌లూ లేవు. ‘డెలివరీ అంకుల్‌’ పేరుతో నేనే యాప్‌ని తీసుకొచ్చా. దాని సాయంతో ఇంటి ఆహారాన్ని రైలు ప్రయాణికులకు అందించే వాళ్లం. కొద్ది కాలంలోనే సుమారు 95 నగరాలకు విస్తరించాం. కొన్నేళ్లు బాగానే సాగింది. ఐఆర్‌సీటీసీ వ్యతిరేకించడంతో చిక్కులొచ్చాయి. తర్వాత ఆ సంస్థే ఫుడ్‌ డెలివరీని ప్రారంభించింది.

మన వాతావరణానికి తగ్గట్లు...

చదువయ్యాక కూడా వ్యాపార ఆలోచనలే. స్టార్టప్‌ ప్రారంభించడానికి ముందే ఆర్థిక వ్యవహారాల్లో పట్టు కోసం ఆర్థిక సంస్థల్లో కొన్నాళ్లు పని చేశా. వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడు చాలా ఆలోచనలొచ్చాయి. అయితే, ఉన్నత చదువుకోసం కోసం అమెరికా వెళ్లినప్పుడు ఓ విషయాన్ని గమనించా. అక్కడ ప్రతి పనికీ ఓ యంత్రాన్ని వాడుతున్నారు. పనిని సులభతరం చేస్తోన్న అక్కడి ఆవిష్కరణలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. వాటిల్లో ట్రెంచర్‌ మెషిన్స్‌ ఒకటి. ఆ విషయాన్నే నా చిన్ననాటి స్నేహితుడు వల్లకాటి లక్ష్మణ్‌తో చెబితే...అసలు వీటి అవసరం మన దగ్గర ఎంతుందో ఓ చిన్నపాటి అధ్యయనం చేద్దాం అన్నారు. ఇద్దరం కలిసి చేసిన ఈ సర్వేలో... ఈ యంత్రాల అవసరం ఎక్కువే అనీ, మన దేశీయ అవసరాలకు తగ్గవి దొరకడం లేదనీ తెలుసుకున్నాం. ఉన్నవి కూడా... వేర్వేరు దేశాల నుంచి విడిభాగాలు తెప్పించుకుని బిగించినవే. తప్ప...ఇక్కడ తయారైనవి కాదని అర్థం చేసుకున్నాం.  

పేటెంట్‌ టెక్నాలజీతో...

డిజిటలైజేషన్‌ తర్వాత దిల్లీ నుంచి గల్లీ వరకూ ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకు తగ్గట్లుగా.. మన వాతావరణం, అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2020లో లక్ష్మణ్‌తో కలిసి పేటెంట్‌ టెక్నాలజీతో ‘అటోక్రసీ మెషినరీ’ సంస్థని స్థాపించా. ఇందుకోసం 12 రకాల ట్రెంచర్‌ మెషిన్స్‌ని మార్కెట్‌లోకి తెచ్చాం. ఇవి నీటి ప్రాజెక్టులు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ నిక్షేపాల వెలికితీత, కేబుళ్లు వేయడం, సొరంగాలు తవ్వడం వంటి పనుల్లో బాగా ఉపయోగపడతాయి. వీటిని కొనుక్కోలేని వారు మా నుంచి అద్దెకూ తీసుకోవచ్చు. స్టెరిలైట్‌ టెక్‌,  ఎమ్‌ఈఐఎల్‌, మేఘ ఇంజినీరింగ్‌, కేంద్ర జల్‌ జీవన్‌ ప్రాజెక్టు వంటి వాటికి యంత్రాలను అందించాం. ప్రస్తుతం ప్రత్యక్షంగా ఇరవై ఐదుమందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఏటేటా సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూ రూ.ఐదుకోట్ల టర్నోవర్‌కి చేరుకోగలిగాం.

అమ్మాయిలు తక్కువే...

మా సంస్థ ఉండేది పారిశ్రామికవాడలో. పురుషాధ్యికత ఉన్న హెవీ మెషినరీ రంగం కదా... ఇక్కడ మహిళల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సీఈవోనైనా, వినియోగదారులు నన్ను గుర్తించడానికి పెద్దగా ఇష్టపడరు. లావాదేవీలు మా భాగస్వామితో మాట్లాడతామంటారు. సమావేశాల్లోనూ అయిష్టంగా కూర్చుంటారు. లేదా ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటారు. అయినా నేనెప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోను. అమ్మాయిలకు సమప్రాధాన్యం ఇచ్చే రంగం ఏదైనా అభివృద్ధి సాధిస్తుందని నమ్ముతా. అదృష్టవశాత్తు నా కుటుంబం, సన్నిహితులూ, నా భాగస్వామి ఇచ్చే ప్రోత్సాహమే....కఠిన సవాళ్లను అధిగమించే స్ఫూర్తినిస్తోంది.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్