సేవలోనే ఆనందం...

హర్‌సంజమ్‌ కౌర్‌ కోల్‌కతాలో సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టింది. తెలిసిన వాళ్లంతా హ్యారీ అని పిలుస్తారు. ఇంగ్లండ్‌లో ఎంబీఏ చేసింది. కెరియర్‌లో ఎందుకో కుదురుకోలేదు. ఈలోపు పెళ్లయింది. భర్త ఉద్యోగరీత్యా చాలా ఏళ్లు ఎన్నో ఊళ్లలో గడిపారు. ఊరు మారిన ప్రతిసారీ ఇంటిని చక్కబెట్టుకోవడం ఆమెకి సరదాగా ఉండేది.

Published : 10 Dec 2022 00:47 IST

సంపన్న కుటుంబంలో పుట్టింది. కెరీర్‌లో విజయాలు సాధించింది. ఆపైన నిరుపేద పిల్లల కోసం మొదలుపెట్టిన సేవ కొవిడ్‌ బాధితుల దాకా విస్తరించింది...

ర్‌సంజమ్‌ కౌర్‌ కోల్‌కతాలో సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టింది. తెలిసిన వాళ్లంతా హ్యారీ అని పిలుస్తారు. ఇంగ్లండ్‌లో ఎంబీఏ చేసింది. కెరియర్‌లో ఎందుకో కుదురుకోలేదు. ఈలోపు పెళ్లయింది. భర్త ఉద్యోగరీత్యా చాలా ఏళ్లు ఎన్నో ఊళ్లలో గడిపారు. ఊరు మారిన ప్రతిసారీ ఇంటిని చక్కబెట్టుకోవడం ఆమెకి సరదాగా ఉండేది. ఇంటీరియర్‌ డిజైన్‌ నేర్చుకుంటే ఇంకెంత బాగుండో అనుకుని, ఆ కోర్సు చేసింది. తర్వాత అదే వృత్తి అయింది. అందులో విజయవంతమైంది. కానీ భర్త సంపాదన, తన కెరియర్‌తో పెద్దగా ఆనందం కలిగేది కాదు. తనకి మొదటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అవసరంలో ఉన్న వాళ్లని ఆదుకున్న రోజున పట్టలేని సంతోషాన్ని అనుభవించేది.

మలుపు తిరిగిన జీవితం

‘అమ్మూకేర్‌’ అనే సంస్థ ట్రెక్కింగ్‌, మెడిటేషన్‌ల కోసం మౌంట్‌ కైలాష్‌ యాత్ర నిర్వహించింది. కొంచెం మార్పు ఉంటుందని తనూ వెళ్లింది. దేశ విదేశాల నుంచి ఎందరో దానికి వచ్చారు. వాళ్లలో ఒక్కరికీ డబ్బు, హోదాల తాపత్రయం లేదు. అందరిలో సేవాతత్పరతే. ఆ యాత్ర ఆమె జీవన విధానాన్ని మార్చేసింది. తానూ సేవ చేయాలనుకుంది.

కుటుంబానికే రక్ష

2018లో ‘ఆంగన్‌’ ఆరంభించింది. తనని ప్రేరేపించిన ‘అమ్మూకేర్‌’ స్థాపకుని పేరుతో తన సంస్థకి ‘మోహన్‌జీ కా ఆంగన్‌’ అని పేరుపెట్టింది. భార్యల్ని హింసించే మగవారి వల్ల పిల్లలకీ నరకయాతనే. వాళ్లని ఆదరించాలనేది ఆమె తపన. కూలీలు తమ పిల్లల్ని ఆంగన్‌లో వదిలి పనికి వెళ్తారు. వాళ్లకి చదువుతోబాటు ఆహారం, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తుంది హ్యారీ. పేద కుటుంబాలకు నిత్యావసర సామగ్రితో మంత్లీ కిట్‌ ఇస్తుంది. పిల్లల్ని ఉత్సాహంగా ఉంచేందుకు ఆటపాటలూ, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తుంది. ‘ఆంగన్‌’ విజయవంతంగా నడుస్తుండగా కరోనా విపత్తు వచ్చింది. దానివల్ల ముఖ్యంగా వలస కూలీల జీవితాలు చితికి పోయాయి. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన చిన్నారులు బిక్కు బిక్కుమంటూ భయం గుప్పెట్లో ఉండటం హారీని కదిలించింది. లాక్‌డౌన్‌లో ఆంగన్‌ను మూసినప్పటికీ భోజన ఏర్పాటు ఆగలేదు. అధికారులు, పోలీసుల సాయంతో పదివేల మందికి భోజనాలు, మాస్కులు, శానిటైజర్లు అందించింది.

భీతిల్లే తల్లుల కోసం...

ఇదంతా అనుకున్నంత సులువేమీ కాదంటుందామె. సంచార జీవితానికి అలవాటు పడిన చిన్నారులు ఒకచోట కూర్చోడానికి ఇష్టపడక పారిపోవడానికి చూస్తారు. క్రమశిక్షణ ముఖ్యమని వారిని లాలనతోనే కట్టిపడేస్తుంది. తల్లిదండ్రులు కష్టనష్టాలు చెప్తుంటారు. ఆంగన్‌ వీలైనంత వరకూ వాటిని పరిష్కరిస్తుంది. ఒక ఐదేళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు లైంగికంగా వేధించాడు. ఇలాంటి అమానవీయ సంఘటనలతో తల్లులు భీతిల్లి ఉంటారు. తమ పిల్లల్ని భద్రంగా చూసుకుంటోన్న ఆంగన్‌ ఆ తల్లులకు భరోసానిస్తోంది. అక్కడ చిన్నారులకు కళలూ, యోగా కూడా నేర్పిస్తూ చక్కటి వాతావరణాన్ని కల్పిస్తోంది. వీళ్లకోసం వసతి గృహం ఏర్పాటుచేసి పూర్తి భద్రత కల్పించాలని, చురుగ్గా ఉన్న పిల్లల్ని పై చదువులు చదివించాలని ప్రయత్నిస్తోంది హ్యారీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్