Updated : 11/12/2022 09:06 IST

నా శరీరాన్ని ద్వేషించా!

చిన్నప్పటి నుంచీ బొద్దుగా ఉండేదాన్ని. లావు.. లావు అన్నా నవ్వి ఊరుకునేదాన్ని కానీ.. ఇతరులతో పోల్చుకుంటూనే ఉండేదాన్ని. పైగా ముఖమంతా మొటిమలు. అప్పుడెవరో బాగా నీళ్లు తాగు, శరీరంలో మలినాలు పోతాయి, తగ్గుతావు అన్నారు. అలాగే చేశా.. కొద్దిగా తగ్గా. ఆ ఆనందంతో రోజుకు 10 లీటర్లు తాగే దాన్ని. మరుసటి రోజు కళ్లు తిరగడం, కడుపు ఉబ్బడం మొదలైంది. ఇలా కాదని క్రాష్‌ డైట్‌లు చేశా. జిమ్‌లో గంటలకొద్దీ కష్టపడే దాన్ని. ఏ స్థాయికి వచ్చానంటే.. ఇతరులు సన్నబడ్డావన్నా.. నాకు మాత్రం నేను లావు గానే కనిపించేదాన్ని. చివరికి అది హార్మోనుల్లో అసమతుల్యతకు దారి తీసింది. సినీ రంగంలోకి వచ్చా. ఇక్కడ ప్రతి ఒక్కరూ శరీరం గురించి మాట్లాడేవారే. ‘దురదృష్టం’ అన్న పేరూ పెట్టారు. ఎక్కడికెళ్లినా.. ‘బద్ధకం తగ్గించు.. వ్యాయామాలు మొదలు పెట్టు’ అన్న సలహాలే. వాళ్లందరికీ ‘మీకెవరు చెప్పారు నేను డైట్‌ చేయడం లేదని! జిమ్‌లో ఎంత కష్టపడతానో తెలుసా? కానీ నా శరీరం తీరే అంత.. లావు పెరుగుతూనే ఉంటుంది’ అని అరిచి చెప్పాలనిపించేది. ఒక దశలో నామీద నాకే అసహ్యం. నేను కోరుకున్నట్లుగా లేదని నా శరీరాన్ని ద్వేషించే దాన్ని. విపరీతమైన కోపం, తెలియని ఒత్తిడి. తర్వాత ఆలోచించడం మొదలుపెట్టా. నా శరీరానికేం తక్కువ? అన్ని అవయవాలూ బానే ఉన్నాయి. అవి సక్రమంగా పని చేయడం వల్లే బతికున్నా. ఇంకా ఏం కావాలి అనుకున్నాక వీటన్నింటినీ పట్టించు కోవడం మానేశా. లావు గురించి కాక ఆరోగ్యంగా ఉన్నానా లేదా అన్నదే చూసుకుంటున్నా. ఇప్పుడు ఆనందంగా ఉన్నా. మన చేతివేళ్లు అన్నీ ఒకలానే ఉండవు కదా! అలానే మనం కూడా. ఎవరో ఏదో అన్నారని మీకు మీరు తిట్టుకోవద్దు.. మారాలనుకోవద్దు. మిమ్మల్ని మీరు అంగీకరించండి చాలు.

- విద్యాబాలన్‌, నటి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి