Shalini Chouhan: జూనియర్‌లా నటించి... పట్టేసింది!

జీన్స్‌, టాప్‌, భుజానికి బ్యాగు.. కొత్తగా చేరిన విద్యార్థి అనుకున్నారు. కాలేజీలో, క్యాంటీన్‌లో తనని ర్యాగింగ్‌ కూడా చేసేవారు. క్లాసులు బంక్‌ కొడితే.. సాధారణమే అనుకున్నారు. తీరా ఒకరోజు తన అసలు రూపంలో వచ్చాక కానీ అర్థమవలేదు.. ఆమె పోలీస్‌ అని! ఇంతకీ ఆమె అలా వేషం ఎందుకు మార్చింది?...

Updated : 13 Dec 2022 11:02 IST

జీన్స్‌, టాప్‌, భుజానికి బ్యాగు.. కొత్తగా చేరిన విద్యార్థి అనుకున్నారు. కాలేజీలో, క్యాంటీన్‌లో తనని ర్యాగింగ్‌ కూడా చేసేవారు. క్లాసులు బంక్‌ కొడితే.. సాధారణమే అనుకున్నారు. తీరా ఒకరోజు తన అసలు రూపంలో వచ్చాక కానీ అర్థమవలేదు.. ఆమె పోలీస్‌ అని! ఇంతకీ ఆమె అలా వేషం ఎందుకు మార్చింది?

కాలేజ్‌లో అప్పుడే చేరిన విద్యార్థుల్లో కొత్త అన్న బెరుకును పోగొట్టడం ర్యాగింగ్‌ ఉద్దేశం. అది సరదా వరకే పరిమితమైతే ఫర్లేదు.. హద్దు దాటితేనే సమస్య! అది ఇందౌర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజ్‌! సీనియర్లు హద్దు మీరి విపరీత ధోరణులకు పోయారు. తట్టుకోలేకపోయిన జూనియర్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్యాంపస్‌కి వెళితే.. ఒక్కరూ నోరు విప్పరే. ఎంత బతిమాలినా, బుజ్జగించినా ధైర్యం చేయలేక పోయారు. మళ్లీ వెబ్‌సైట్‌లోనేమో పేరుల్లేకుండా ఫిర్యాదులు చేసేవారు. కొన్నాళ్లు పహరా తర్వాత పోలీసులు వెనుదిరిగారు.
ఆ కొద్దిరోజులూ ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌లో ర్యాగింగ్‌ మళ్లీ పెచ్చుమీరింది. అప్పుడే షాలినీ చౌహాన్‌ని రంగంలోకి దింపారు అధికారులు. తను శిక్షణ పూర్తి చేసుకొని కొత్తగా విధుల్లో చేరింది. ఆ 24 ఏళ్ల అమ్మాయి విద్యార్థినిలా రూపురేఖలు మార్చుకుని తరగతులకు హాజరయ్యేది. తన చలాకీ తనంతో త్వరలోనే స్నేహితులను చేసుకుంది. క్లాసులు ఎగ్గొట్టి స్నేహితులతో కారిడార్లలో, బయటా బాతాఖానీలు.. ఛాయ్‌ అంటూ క్యాంటీన్‌లో గడుపుతుండేది. తనకీ తరగతిలో, క్యాంటీన్‌లో ర్యాగింగ్‌ ఎదురయ్యేది. అందరిలాగే తనూ తలొగ్గేది. అయితే ఇదంతా సాధారణమే. ఫిర్యాదుల్లో ఉన్నంత తీవ్రత కనిపించ లేదు. కానీ మొదటి ఏడాది విద్యార్థులను సీనియర్లు తమ ఫ్లాట్‌లకు రప్పించి, దుస్తులు విప్పమనడం.. నగ్నంగా డ్యాన్స్‌ వంటి విపరీతమైన చర్యలకు పాల్పడేవారు. అమ్మాయిలు, అబ్బాయిలూ అనీ చూసే వారు కాదు. ఆ ఫొటోలు, వీడియోలు వాళ్ల చేతుల్లో ఉండటంతో ఎవరూ బహిరంగంగా ఫిర్యాదుకు ముందుకు రావడం లేదు. మొదట ఎవరూ నోరు విప్పలేదు. ర్యాగింగ్‌తో నేనిలా ఇబ్బంది పడుతున్నానంటూ షాలిని బయట పడగానే ఒక్కొక్కరూ బాధలను చెప్పడం మొదలు పెట్టారు. ఇలా మెల్లగా ఆ గ్యాంగ్‌లో ఉన్న 11 మంది పేర్లూ రాబట్టగలిగింది. అందరి వివరాలూ దొరికాయని నిర్ధరించుకున్నాక పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్ట్‌ ఇచ్చింది. పై అధికారులతో వెళ్లి బాధ్యులను అరెస్ట్‌ చేసింది. అలా కేసును ఛేదించింది.

‘ర్యాగింగ్‌ ఎవరు చేశారు, ఏం చేశారు అని అడిగితే విద్యార్థులు చెప్పడానికి భయపడే వారు. వివరాలు అడిగితే కొందరు అనుమానించే వారు. విద్యార్థిగా కనిపించడానికి రూపురేఖలు మార్చుకోవడమే కాదు.. విద్యా సంబంధ అంశాల్లోనూ కొంత సన్నద్ధమయ్యా. వివరాలన్నీ సేకరించడానికి మూడు నెలలు పట్టింది. అమ్మాయిలూ ధైర్యంగా నోరు విప్పండి... అప్పుడే వేధింపులను అడ్డుకోగలం’ అంటోంది షాలినీ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్