పెళ్లి.. పచ్చంగా!

పెళ్లి అనగానే ఇంట్లో బోలెడు సందడి. ఒక్కరోజు వేడుకకు స్థాయితో సంబంధం లేకుండా లక్షలు, కోట్లలో ఖర్చు పెట్టేస్తుంటారు. ‘మరి ఆ తర్వాత?’ ఈ ప్రశ్నే వేసుకున్నారీ అమ్మాయిలు. అలంకరణ, మిగిలిన ఆహారం, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులు.. ఇదంతా వృథానేగా! అందుకే తమ పెళ్లి సంబరాలు...

Published : 13 Dec 2022 00:47 IST

పెళ్లి అనగానే ఇంట్లో బోలెడు సందడి. ఒక్కరోజు వేడుకకు స్థాయితో సంబంధం లేకుండా లక్షలు, కోట్లలో ఖర్చు పెట్టేస్తుంటారు. ‘మరి ఆ తర్వాత?’ ఈ ప్రశ్నే వేసుకున్నారీ అమ్మాయిలు. అలంకరణ, మిగిలిన ఆహారం, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులు.. ఇదంతా వృథానేగా! అందుకే తమ పెళ్లి సంబరాలు పర్యావరణానికీ హితమవ్వా లనుకున్నారు. ‘ఎకో’ బాటపట్టిన ఈ నూతన వధువుల్లో కొందరిని కలుసుకుందాం.. రండి!


ఆ సంఘటనలు మార్చాయి..

భారీ ఖర్చు పెళ్లిళ్లకు స్ఫూర్తి కొలిపాక వ్యతిరేకం. తనది హైదరాబాద్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి సామాజిక సేవ వైపు వెళ్లింది. ముంబయిలో ఓచోట పేరుకున్న చెత్తను చూసింది. అప్పుడే వృథాని వీలైనంత అరికట్టాలని సస్టెయినబిలిటీ బాట పట్టింది. ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా ఎన్నో రాష్ట్రాలు తిరిగింది. కట్నానికి డబ్బులు కూడబెట్టాలని అమ్మాయికి పెద్ద చదువులు చదివించక పోవడం, ఒక పూట ఆహారం మానేయడం, పెళ్లిని సంబరంలా కంటే భారంగా భావించే కుటుంబాలని చూసింది. కట్నం తీసుకోని వాడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. తన అభిప్రాయాలు కలిసిన ప్రశాంత్‌తో ఈ ఏడాది ఏడడుగులు నడిచింది. అప్పుడూ పర్యావరణ హితాన్ని మరవలేదు. ‘ఈ’ శుభలేఖ, శామీర్‌పేటలోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఆరు బయటే పెళ్లి. తాజాపూలు, కొన్ని రకాల రంగుల వస్త్రాలతోనే అలంకరణ, అరటి ఆకుల్లో భోజనం.. అంతే! ‘నా పెళ్లిచీర నేతది.. ధర రూ.వెయ్యి. నగలూ కొన లేదు. లైట్లు, ఏసీ అవసరం లేకుండా పగటి పూటే పెళ్లి. పెళ్లికి మూడురోజుల ముందు స్టీలు గ్లాసులు దొరకలేదన్నారు క్యాటరింగ్‌ వాళ్లు. నేనే తెలిసిన వాళ్ల వద్ద సేకరించా. నావరకూ నేను నా తర్వాతి తరాలకు ఇలా కూడా చేయొచ్చు అని చూపించాలనుకున్నా. నన్ను మరికొందరు అనుసరిస్తే.. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అంటోన్న ఈ 32 ఏళ్ల అమ్మాయి ‘యూనిసెఫ్‌ - తెలంగాణ’కి కన్సల్టెంట్‌. ప్రస్తుతం యూకేలో పీహెచ్‌డీ చేస్తోంది.


అమ్మానాన్నలను చూసి..      

            

కప్పుడు పెళ్లి పనులన్నీ బంధువులే పంచుకునేవారు. ఒత్తిడి తెలియకుండా సరదా సరదాగా సాగేది. పెళ్లితో భిన్న వృత్తుల వారికీ పని దొరికేది. తన పెళ్లీ అలానే అవ్వాలనుకుంది మాధురి. తనను వరించిన ఆదిత్య కూడా అందుకు సరేనన్నాడు. స్థానిక నేతన్నలు నేసిన చీర, మట్టిగాజులు, అమ్మ నగలు.. ఇవే వధువు అలంకరణ వస్తువులు. తులసి దండలే వరమాల. ఆరు బయటే పెళ్లి. వీళ్లది ఉత్తరాఖండ్‌. వందల మందితో బారాత్‌ ధూమ్‌ధామ్‌గా వస్తుంది. సంప్రదాయానికి విలువిస్తూనే ఇక్కడా పర్యావరణం గురించి ఆలోచించారు. ఎలక్ట్రిక్‌ బండ్లపై ఊరేగింపుగా వచ్చారు. ‘గుర్తుండిపోయే రోజని భారీగా ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. వృథాకి అమ్మా నాన్న దూరం. వస్తువు పాడైనా తిరిగి బాగు చేసుకొని వాడటం వాళ్ల నుంచే నేర్చుకున్నా. స్థానిక కొబ్బరి బోండాల వాళ్లు, టీ స్టాల్‌ వాళ్లకి అవకాశమిచ్చాం. అరిటాకులు, మట్టి గ్లాసులే వాడాం. మా దండలే కాదు.. అలంకరణకు వాడిన పూలనీ ఎండబెట్టి టీ, అరోమా ఆయిల్స్‌గా చేశాం. మొక్కలే రిటర్న్‌ గిఫ్ట్స్‌. పెళ్లంటే స్నేహితులు, బంధువులూ కలసి ఆనందించే వేడుక. దానికే మేం ప్రాధాన్యమిచ్చాం. మా పెళ్లి ఖర్చెంతో తెలుసా? రూ.లక్షన్నర’ అంటోంది మాధురి.


మూడింటికి ప్రాధాన్యం..

ర్యటన, పెళ్లి.. ఎక్కడికెళ్లినా ఖాళీ నీళ్లసీసాలు కనిపిస్తూ ఉంటాయి. తన పెళ్లిలో ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంది లిపికా దుగార్‌. రిషబ్‌తో తన పెళ్లికి చిన్న తోటని ఎంచుకుంది. ఆర్కిటెక్ట్‌ కదా తక్కువ స్థలాన్ని ఎలా ఉపయోగించొచ్చన్నది ముందే ప్లాన్‌ చేసుకుంది. మొదట్నుంచీ పర్యావరణ స్పృహ ఎక్కువే. కాబట్టి, తక్కువ వృథా, తిరిగి ఉపయోగించడం, త్వరగా భూమిలో కలిసిపోయే వాటికే ప్రాధాన్య మివ్వాలనుకుంది. రిటర్న్‌ గిఫ్ట్‌లుగా సేంద్రియ ఆహార పదార్థాలను తిరిగి వాడుకోగల సీసాల్లో, బుట్టల్లో ఇచ్చింది. అలంకరణకు పూలు, వస్త్రాలు, ఆహారానికి స్టీలు, పింగాణీ, మట్టి పాత్రలు వంటివి ఉపయోగించింది. ‘బయట ఆహ్వానానికి చాక్‌ బోర్డునే వాడాం. మిగిలిన ఆహారాన్ని పంచొచ్చు. కానీ వదిలేసిన దాని సంగతేంటని ఆలోచించా. దాన్నీ ఎరువుగా మార్పించే ఏర్పాటు చేశా. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు వెతకడానికి చాలా కష్టపడ్డాం. పెళ్లంటే బాధ్యత. దాన్ని సరిగా నిర్వర్తించాలంటే.. తరాలుగా అందుతోన్న ప్రకృతి సంరక్షణనీ బాధ్యతగా పూర్తిచేయాలిగా’ అంటుంది లిపిక.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్