కీటకంపై పింకీ పోరాటం..

ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠా లు చెబుతున్న ఆ అమ్మాయిని చూసిన వారెవరైనా టీచర్‌ అనుకొంటారు. కానీ ఆమె చెప్పేది ఒక విష కీటకం గురించి... దోమకన్నా 60 రెట్లు చిన్నదైన ఆ కీటకం వల్లనే కాలాజార్‌ అని పిలిచే బ్లాక్‌ ఫీవర్‌ వస్తుంది.

Updated : 14 Dec 2022 04:21 IST

ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠా లు చెబుతున్న ఆ అమ్మాయిని చూసిన వారెవరైనా టీచర్‌ అనుకొంటారు. కానీ ఆమె చెప్పేది ఒక విష కీటకం గురించి... దోమకన్నా 60 రెట్లు చిన్నదైన ఆ కీటకం వల్లనే కాలాజార్‌ అని పిలిచే బ్లాక్‌ ఫీవర్‌ వస్తుంది. ఇంతకీ 19 ఏళ్ల పింకీ చౌహాన్‌ ఆ కీటకం గురించే ఎందుకింత ప్రచారం చేస్తోంది? వేల మంది పిల్లల్ని కలిసి ఎందుకు దాని గురించి చెబుతోంది?... చదవండి...

నిరుపేద కుటుంబానికి చెందిన పింకీ 2015లో బ్లాక్‌ఫీవర్‌ బాధితురాలు. అప్పటికి తనకి 12 ఏళ్లు. తీవ్ర అనారోగ్యానికి గురై తిరిగి కోలుకోవడానికి తనకు ఏడాది పట్టింది. ‘జ్వరం తగ్గినా అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. చర్మ సమస్యలతో ఇప్పటికీ బాధపడుతున్నా. ఈ జ్వరాన్ని అనుభవించడం అత్యంత బాధాకరం. ఆపై సైడ్‌ఎఫెక్ట్స్‌ మనల్ని పీడిస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోరియా జిల్లా మాది. బ్లాక్‌ఫీవర్‌ (కాలాజార్‌) వచ్చినప్పుడు అమ్మానాన్న నన్ను తీసుకొని ఆసుపత్రికి పరుగులు పెట్టారు. ప్రాణాలు పోతున్నాయా అన్నంత బాధను అనుభవించా. ఖర్చు కూడా భరించలేనిది. శాండ్‌ఫ్లైస్‌ అనే కీటకం కుట్టడం వల్ల ఈ జ్వరం వస్తుంది. దీన్ని సమూలంగా నాశనం చేయడం, దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోవడం.. ఈ రెండు మార్గాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌ సహా దేశంలో పశ్చిమ్‌బంగ, బిహార్‌, ఝార్ఖండ్‌ల్లో మొత్తం 54 జిల్లాల్లో 16.5 కోట్ల మంది ఈ బ్లాక్‌ఫీవర్‌ బారినపడే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే నాలా మరెవరూ బాధపడకూడదంటే దీని గురించి అందరికీ తెలియాలి. అందుకే ఇంటర్‌ తర్వాత నా ప్రయత్నాలు మొదలుపెట్టా. ప్రతి ఒక్కరికీ ఈ కీటకం గురించి అవగాహన కలిగించాలనుకున్నా. అమ్మా నాన్నల ప్రోత్సాహంతో గత నవంబరులో ప్రభుత్వం నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొన్నా’ అని వివరించింది 19 ఏళ్ల పింకీ.

10వేల మందికి..

ఆ అనుభవం పింకీకి కొత్త ఆలోచననిచ్చింది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తనే ఈ కీటకంపై అవగాహన కలిగించడం ప్రారంభించింది. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలకు వెళ్లి విద్యార్థులతో తన అనుభవాలను పంచుకొంటోంది. ఆ కీటకమెలా ఉంటుందో బొమ్మలతో సహా చూపిస్తుంది. అవి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తుంది. ‘నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీటి నిల్వ లేకుండా జాగ్రత్తపడటం మంచిది. కూలిన తడి గోడలు, తెరచి ఉన్న మ్యాన్‌హోల్స్‌, గోశాలలు వంటి చోట్ల అవి ఎక్కువగా పెరుగుతాయి. అందుకే ఇలాంటి చోట్ల మరింత ఎక్కువ శుభ్రత పాటించాలి. అప్పుడే ఈ కీటక జాతిని నిరోధించొచ్చు. సెలవు దినాల్లోనూ రోజుకి కనీసం 20 మందినైనా కలిసి, మాట్లాడి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నా. ముందస్తు జాగ్రత్తలతోపాటు, బ్లాక్‌ఫీవర్‌ వచ్చే ముందరి లక్షణాలు, వస్తే ఏం చేయాలి వంటివీ చెబుతున్నా. దీని కాటుకు గురైన వారి సందేహాలను తీరుస్తున్నా. ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది పిల్లలకు అవగాహన కలిగించగలిగా. మా చుట్టుపక్కల 1,200 ఇళ్లకూ వెళ్లి దీని గురించి చెప్పా. ఈ కీటకం పూర్తిగా నశించే వరకూ ప్రయత్నాన్ని విరమించను’ అని అంటోంది పింకీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్