Updated : 16/12/2022 01:13 IST

పరిష్కారం.. కోట్ల వ్యాపారమైంది!

అందానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే అమ్మాయిలు చిన్న చర్మసమస్యనీ తట్టుకోలేరు. జీలమ్‌ కూడా అంతే! తనకి సొరియాసిస్‌. పోగొట్టుకోవడానికని మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులెన్నో వాడింది. తగ్గక పోగా కొత్త సమస్యలొచ్చాయి. అప్పుడు సహజ ఉత్పత్తుల మీద దృష్టిపెట్టి విజయం సాధించింది. తర్వాత దాన్నే తన వ్యాపార మార్గంగా మలచుకొని విజయపథంలో సాగుతోంది.

చర్మ సౌందర్యానికి ఇంట్లో దొరికే సహజ పదార్థాలే ఎక్కువ మేలు చేస్తాయన్నది ‘జీలమ్‌ అనికిందీ’ నమ్మకం. కానీ ఎప్పుడూ ఉద్యోగంతో తీరిక లేకుండా గడిపే తనకు ఆ చిట్కాలను పాటించే సమయం ఉండేది కాదు. దీంతో మార్కెట్‌లో దొరికే ఉత్పత్తుల వైపే మొగ్గు చూపింది. తనకి సోరియాసిస్‌ సోకి చర్మమంతా పాడయ్యేది. ఎన్ని ఉత్పత్తులు వాడినా ప్రయోజనం లేదు. అసలు వాటిలో ఏమేం ఉపయోగిస్తున్నారో పరిశీలించింది. ఆ ప్రొడక్టుల్లో ఉపయోగించే నిల్వకారకాలు, రసాయనాలు అన్నీ చర్మానికి హాని కలిగించేవే! దీంతో వాటిని వాడకం ఆపేసింది. కొబ్బరి నూనె, కలబందతోపాటు కొన్ని వంటింటి వస్తువులను ఉపయోగించి తన సమస్యను పోగొట్టుకోగలిగింది. అదిచ్చిన విశ్వాసంతో ‘స్వీయ రక్షణ’ అని అర్థమొచ్చేలా 2011లో సొంత సంస్థ ‘సుయ్‌-కురా’ను ప్రారంభించింది.

‘ప్రతిదాన్నీ తరచి చూసి కొనడం అలవాటు నాకు. మెరుగైన ఉత్పత్తి అందుబాటు ధరలో తయారు చేయాలనుకున్నా. నాది సున్నితమైన చర్మం. ప్రతి ఉత్పత్తినీ స్వయంగా తయారు చేస్తా. మొదట నా చర్మంపైనే పరీక్షిస్తా. ఫలితం బాగున్నాకే మార్కెట్‌లోకి తీసుకొస్తా’ననే జీలమ్‌ ఓ స్పోర్ట్స్‌ మీడియా సంస్థలో మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌గా చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా ఉద్యోగాన్ని వదిలేసింది. కోలుకున్నాక అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టింది.  చర్మానికి ఏవేవి, ఎలా మేలు చేస్తాయన్నది బామ్మ నుంచి, స్వీయ పరిశోధన ద్వారా నేర్చుకుంది. వాటిని తను ఉపయోగించడమే కాక బంధువులు, స్నేహితులకీ చేసిచ్చింది. అవి నచ్చడమే కాదు మళ్లీ మళ్లీ చేసివ్వమనే వారు. అలా వ్యాపకం కాస్తా వ్యాపారమైంది. చర్మ, కేశ ఉత్పత్తులతోపాటు శుభ్రత, మానసిక ఆరోగ్యానికి సంబంధించినవీ తయారు చేస్తోంది. ఇవన్నీ చర్మ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించలేని వారికి అనుకూలంగా ఉంటాయి. వీటిని దేశమంతా విక్రయిస్తూ కోట్ల వ్యాపారం చేస్తోంది.

సొంత వ్యాపార కల నెరవేరడం ఎంత కష్టమో జీలమ్‌కి తెలుసు. అందుకే ఆంత్రప్రెన్యూర్‌ కనెక్ట్‌ పేరుతో స్టార్టప్‌లకు చేయూతనిస్తోంది. 75 మంది నిపుణులతో బృందాన్ని ఏర్పరచి కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి నైపుణ్యాలు, వనరులు, నిపుణుల సాయం వంటి అంశాల్లో సాయపడుతోంది. తన కల నెరవేర్చుకొని ఇతరులకూ ఆ అవకాశం దక్కేలా చేస్తోన్న ఆమె కృషి అభినందనీయమే కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి