ముగ్గురమ్మాయిలు... మేటి ప్రయోగాలు...

ఎంతటి వ్యాధైనా... చిన్న మాత్ర వేసుకుంటే పరారైపోతుంది. కానీ ఆ ఔషధం మార్కెట్‌లోకి రావాలంటే ముందు జంతువులూ, మనుషులపై ఎన్నో పరీక్షల్లో నెగ్గాలి. ఈ ప్రయోగాల్లో హాని కలిగే ప్రమాదం ఉంది. దాన్ని నివారించేందుకే టైప్‌2 మధుమేహం ఔషధ ప్రయోగాల కోసం 3డీ బయో ప్రింటింగ్‌ పద్ధతిలో మానవ కణజాలాన్ని తయారు చేశారు శరణ్య, అర్పితరెడ్డి, సంజన.

Updated : 17 Dec 2022 01:09 IST

ఎంతటి వ్యాధైనా... చిన్న మాత్ర వేసుకుంటే పరారైపోతుంది. కానీ ఆ ఔషధం మార్కెట్‌లోకి రావాలంటే ముందు జంతువులూ, మనుషులపై ఎన్నో పరీక్షల్లో నెగ్గాలి. ఈ ప్రయోగాల్లో హాని కలిగే ప్రమాదం ఉంది. దాన్ని నివారించేందుకే టైప్‌2 మధుమేహం ఔషధ ప్రయోగాల కోసం 3డీ బయో ప్రింటింగ్‌ పద్ధతిలో మానవ కణజాలాన్ని తయారు చేశారు శరణ్య, అర్పితరెడ్డి, సంజన. ఈ యువశాస్త్రవేత్తల ఆవిష్కరణకు జాతీయ స్థాయి సదస్సులో ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా వారితో ‘వసుంధర’ ముచ్చటించింది.

శరణ్యది కేరళలోని కన్నూర్‌. మంగళూరు యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పూర్తి చేశాక ప్రొటియోమిక్స్‌ అండ్‌ జీనోమిక్స్‌లో పీజీ డిప్లొమా చదివింది. చిన్నప్పట్నుంచి ప్రయోగాలంటే ఆసక్తి. అర్పిత రెడ్డిది కర్ణాటకలోని కోలార్‌ జిల్లా. విద్యాభ్యాసం బెంగళూరు, మైసూరుల్లో సాగింది. మైసూరు విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో పీజీ, తర్వాత బెంగళూరులో సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లొమా చదివింది. బత్తుల సంజనది హైదరాబాద్‌. విద్యాభ్యాసమంతా బెంగళూరులో, తర్వాత అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ (న్యూరోబయాలజీ, ఫిజియాలజీ, బిహేవియర్‌) చేసింది. బయోటెక్‌ పరిశోధనలపై ఆసక్తితో హైదరాబాదులోని రియాజీన్‌ ఇన్నొవేషన్స్‌ స్టార్టప్‌లో చేరింది. ఈ సంస్థను నాలుగేళ్ల కిందట ఉదయ్‌ సక్సేనా, వంగాల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఇది 3డీ బయోప్రింటెడ్‌ మోడల్స్‌పై పని చేస్తోంది. ఇక్కడే కె.శరణ్య, ఆర్‌.ఎన్‌.అర్పితరెడ్డి, బత్తుల సంజన రీసెర్చ్‌ అసోసియేట్స్‌.

హాని నివారించాలని...

కొత్త ఔషధాలను ఆవిష్కరించాక ముందుగా జంతువులపై ప్రయోగాలు చేస్తారు. వాటిపై విజయవంతమయ్యాక మనుషులపై పరీక్షించి చూస్తారు. ఇక్కడా సఫలమయ్యాకే మార్కెట్లోకి వస్తాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులకు హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మనిషి కణజాలాన్ని పరిశోధనశాలల్లో కృత్రిమంగా అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని టైప్‌-2 మధుమేహం కోసం 3డీ బయోప్రింటింగ్‌ పద్ధతిలో మానవ కండర కణజాలాన్ని రియాజీన్‌ సంస్థ పునఃసృష్టించింది. ఇందుకు మూడు రకాల పొరలతో కణాలను అనుసంధానించారు. దీని రూపకల్పన నుంచి నిరంతర ప్రయోగాలు, సిద్ధాంత పత్రాల సమర్పణ వరకూ శరణ్య, అర్పిత రెడ్డి, సంజన కీలకపాత్ర పోషించారు. ఈ కణజాలంపై వేర్వేరు మందులను పరీక్షించగా.. ఇది మనిషి కండరాల తరహాలోనే పని చేస్తున్నట్లు తేలింది. ఈ ఆవిష్కరణకే ‘జంతువులపై ప్రయోగాలకు ప్రత్యామ్నాయాల సొసైటీ’ వార్షిక ప్రథమ బహుమతిని ఇచ్చింది. ‘‘మన శరీరంలో 70శాతం గ్లూకోజ్‌ ను కండరాలే స్వీకరిస్తాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మేం కండరాలకు సంబంధించి 3డీ బయోప్రింటెడ్‌ మోడల్‌ను తయారు చేశాం. దీని ఆధారంగా కండరాలలో గ్లూకోజ్‌ స్వీకరణపై అధ్యయనానికి వీలు చిక్కుతోంది. దీని వల్ల ఔషధ ప్రయోగాల్లో జంతువులు, మనుషుల అవసరం లేకుండానే కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చు’’ అని వివరించారు అర్పిత రెడ్డి.

మధుమేహ నియంత్రణకు ‘దివిటిజ్‌’ పేరిట ఓ న్యూట్రిషనల్‌ సప్లిమెంట్‌ను తయారు చేసిందీ సంస్థ. ఇది నేరుగా కండరాలలో గ్లూకోజ్‌ స్వీకరణపై పని చేస్తుంది. ఈ సప్లిమెంట్ను కూడా 3డీ పద్ధతిలో రూపొందించిన కణజాలంపై ప్రయోగించి చూశారు. కొవిడ్‌ ఔషధాల పరీక్షల కోసం మానవ ఊపిరితిత్తుల 3డీ మోడల్‌ను తయారు చేసిన బృందంలోనూ శరణ్య సభ్యురాలు.

‘‘పరిశోధనల్లో అమ్మాయిల భాగస్వామ్యం పెరుగుతోంది. డాక్టరేట్‌, పోస్టు డాక్టొరల్‌ చేసి బోధనవైపు వెళ్లవచ్చు. పరిశ్రమలలో పరిశోధనల వైపు వెళ్లచ్చు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇండస్ట్రియల్‌ పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. పీజీ చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్టుగా స్టార్టప్‌లలో ఇంటర్న్‌షిప్‌లు చేస్తే అదనపు పరిజ్ఞానం సంపాదించొచ్చు. మేం ఇంటర్న్‌గా చేరాకే రీసెర్చ్‌ అసోసియేట్స్‌గా వచ్చాం. స్టార్టప్స్‌లో వివిధ విభాగాలపై పట్టు సాధించొచ్చు. పరిశోధన, డేటా విశ్లేషణ, డాక్యుమెంటేషన్‌, ప్రజంటేషన్‌.. ఇలా అన్ని అంశాలపైనా పట్టు సాధించవచ్చు. వ్యాపారవేత్తగా మారాలనుకుంటే.. అన్ని విభాగాలపై పరిజ్ఞానం ఉంటుంది కనుక విజయం సాధించే అవకాశాలెక్కువ’’ అని చెబుతున్నారు అర్పితరెడ్డి, సంజన.

- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్