చిన్నారి పెళ్లికూతురు... సరిహద్దుల్లో సత్తా చూపనుంది

తెలిసీ తెలియని వయసులో పెళ్లి... చదువుకుంటానంటే వేధింపులు.. అవహేళనలు. అన్నింటినీ తట్టుకుంది... పోలీస్‌ అవ్వాలనే ఏకైక లక్ష్యంతో చదివింది... తొలి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది.

Updated : 17 Dec 2022 09:19 IST

తెలిసీ తెలియని వయసులో పెళ్లి... చదువుకుంటానంటే వేధింపులు.. అవహేళనలు. అన్నింటినీ తట్టుకుంది... పోలీస్‌ అవ్వాలనే ఏకైక లక్ష్యంతో చదివింది... తొలి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. కలల సాకారం కోసం తన పోరాటాన్ని నక్కా ఆదిలక్ష్మి ‘వసుంధర’తో పంచుకుందిలా...

12 ఏళ్లకే మేనత్త కొడుకు (24)తో వివాహం. పెళ్లంటే ఏంటి అని అమ్మానాన్నల్ని అడిగే దాన్ని. వాళ్లు చెప్పేది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. మాది విజయనగరం జిల్లా బంటు మిల్లి. నాన్న సూరప్పడు, అమ్మ అప్పాయమ్మ. వ్యవసాయం చేసేవారు. అన్నయ్యకు జబ్బు చేయడంతో ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించాం. దాంతో ఊళ్లో ఉపాధిలేక మేనమామ ప్రోత్సాహంతో కాకినాడకు వచ్చాం. అమ్మ, నాన్న కూలి చేసేవారు. పెళ్లితో 8వ తరగతిలోనే చదువాపేశా. అత్తను బతిమాలితే పది వరకూ చదువుకోమంది. చదువుతో పాటు, భోజనం పెడతారని తెలిసి 2014లో ప్రజా విద్యాలయంలో చేర్చారు. పదిలో 8.3 గ్రేడు సాధించా. ఇక చాలు కాపురం చేసుకోమని విశాఖపట్నం పంపేశారు. రోజూ నాన్నని అడిగే దాన్ని... ఇంటర్‌ చదువుతా అని. నా పోరు భరించలేక అత్తా వాళ్లని ఒప్పించి ఇంటర్‌లో చేర్చారు. మా ఆయనకది ఇష్టం లేదు. నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసుకుని ఉద్యోగానికి వెళ్లేవాడు. సాయంత్రం వచ్చి కావాలని గొడవ పెట్టుకుని కొట్టేవాడు. ఏడాది పాటు చిత్రహింసలు... భరించలేక పారిపోయి వచ్చేశా. నేనేమైపోతానో అని ఇంట్లో భయం. మనసు మళ్లించడానికి ఇంటర్‌ రెండో సంవత్సరంలో చేర్చారు. మంచి మార్కులు సాధించా. పెద్దవాళ్లు వచ్చి ఆయన మారాడు, కాపురానికి పంపమన్నారు. నిజమేననుకుని వెళ్లా. కానీ అవే ఛీదరింపులు, అదే హింస. తట్టుకోలేక మళ్లీ వచ్చేశా.

భారం కాకూడదని...

అమ్మానాన్నలకు భారం కాకూడదని ఉదయం, సాయంత్రం ఇళ్లల్లో పనికెళ్లేదాన్ని. మిగతా టైంలో బట్టలు కుట్టేదాన్ని. ఎంత కష్టమైనా చదువును వదల్లేదు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌లో చేరా. ఇంగ్లిషులో పాఠాలు అర్థమయ్యేవి కావు. రెండు నెలలు చాలా ఇబ్బంది పడ్డా. గురువులు, స్నేహితుల  సాయంతో దాన్ని అధిగమించా. 80.3 శాతం మార్కులు సాధించా.

కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం...

ఆ వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం మొదలుపెట్టా. 8 మార్కుల తేడాతో కానిస్టేబుల్‌ ఉద్యోగం పోయింది. నాలో పట్టుదల పెరిగింది. స్నేహితులతో కలసి అన్ని పోటీ పరీక్షలకూ చదివేదాన్ని. 2021లో ఎస్‌ఎస్‌సీ - జనరల్‌ డ్యూటీ ఉద్యోగాలు పడ్డాయి. తొలి ప్రయత్నంలోనే సాధించా. ఇప్పుడు ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌కు ఎంపికయ్యా. ఈనెల 17న హరియాణ వెళ్లి ఉద్యోగంలో చేరనున్నా. అమ్మానాన్నలు పెద్దవాళ్లయ్యారు. ఇక వారిని బాగా చూసుకోవాలనేది నా కోరిక. ఎప్పటికైనా ఎస్సై ఉద్యోగం సాధించి ఆడపిల్లలకు అండగా నిలవాలనేది నా జీవితాశయం.

- కొరిపెల్ల శ్రీనివాసు, కాకినాడ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్