Updated : 19/12/2022 03:22 IST

కష్టాలను దాటి... స్ఫూర్తి శిఖరంగా ఎదిగింది

పన్నెండేళ్లకే తండ్రి మరణం. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడి బాధ్యత తనపైనే ఉంది. చదువుకుంటూనే పాలు అమ్మింది. కష్టపడి పోలీసు కొలువు సాధించింది. అక్కడితో ఆగిపోతే అనితా కుండూ గురించి ప్రత్యేకంగా చెప్పుకొనేదేమీ ఉండకపోయేది. కానీ తనిప్పుడు వేల మంది యువతులకు ఆదర్శంగా ఎదిగింది. రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకునే స్థాయికి చేరింది...

హరియాణాకు చెందిన అనితది వ్యవసాయ కుటుంబం. 2001లో తండ్రిని కోల్పోయింది.  అప్పటికి తనకు 12 ఏళ్లు. అయినా చలించలేదు. ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి ఆలనాపాలనా చూసుకోవడంలో తల్లికి సాయపడేది. బడి నుంచి రాగానే ఇంటింటికీ వెళ్లి పాలు అమ్మేది. పొద్దున నాలుగు గంటలకు లేస్తే మళ్లీ అర్ధరాత్రే పడుకునే దాన్నని అనీతా గుర్తుచేసుకుంటుంది. హరియాణాలో ఎక్కువ మంది కల క్రీడల్లో గుర్తింపు తెచ్చుకోవడం. ఇన్ని సమస్యలతో ఉన్నా అనితకూ అదే ఆశయం. అదే సమయంలో కుటుంబ అవసరాల రీత్యా 2008లో పోలీసు ఉద్యోగంలో చేరింది.  

ఎవరెస్టు మార్గంలో...

ఇన్ని  కష్టాలల్లో ఉండి, ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత మరొకరైతే ఇక హాయిగా గడిపేద్దాం అనుకుంటారు. అనిత మాత్రం పర్వతారోహకురాలు కావాలనుకుంది. దాని కోసం అత్యంత ఎత్తైన పర్వతాలనూ అధిరోహించేందుకు వీలుగా కఠినమైన శిక్షణ తీసుకుంది. దుర్భర పరిస్థితుల్లో ఆహారం, మంచి నీరు లేకుండా రోజుల పాటు జీవించి ఉండేలా తనను తాను మలచుకుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లు పర్వతారోహణ చేయాలనుకునే వారందరి గమ్యమైన ఎవరెస్టునే ఎంచుకుంది. 2013లో తొలిసారి తన కలను సాకారం చేసుకుంది. 2017లో చైనా వైపు నుంచి రెండోసారి ఎవరెస్టు శిఖరాగ్రంపై కాలు మోపింది. ఈ అనుభవంతో 2019లో బృంద నాయకురాలిగా పదుల మందిని సురక్షితంగా ఎవరెస్టు అంచుపైకి చేర్చి వారి కలలను సాకారం చేసుకోవడంలో సాయపడింది. అది మొదలు ఇప్పటి వరకు వివిధ ఖండాలలోని పలు పర్వతాలనూ అవలీలగా అధిరోహించింది. రెండేళ్ల క్రితం టెన్సింగ్‌ నార్గే జాతీయ సాహసక్రీడల పురస్కారాన్ని అందుకున్న అనిత ప్రస్తుతం కర్నాల్‌లో పోలీసు ఇన్‌స్పెక్టర్‌.

వెలుగులు నింపుతూ..

హరియాణాలో బాలికల పరిస్థితి తెలిసిందే. క్రీడాకారిణి కావాలనుందని చెప్పినపుడు తనకు ఎదురైన సమాధానాలను అనిత మర్చిపోలేదు. ఆ పరిస్థితిలో ఇప్పుడు కాస్త మార్పు వచ్చినా.. దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మోటివేషనల్‌ స్పీకర్‌గా మారింది. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలతో పాటు విశ్వవిద్యాలయాలకూ వెళ్లి స్ఫూర్తి ప్రసంగాలు ఇస్తూ బాలికలను ప్రోత్సహిస్తోంది. గత నెలలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హరియాణా పర్యటనకు వచ్చినపుడు స్త్రీ సాధికారత అంశంపై చర్చించడానికి కొంత మందిని ఆహ్వానించారు. వారిలో అనిత కూడా ఒకరు. ఒకప్పుడు తనతో వెటకారంగా మాట్లాడిన వారే ఇప్పుడు తమ పిల్లలకు అనితలా ఉండాలని చెప్పడం సంతోషాన్నిస్తోందంటుందామె. తండ్రి మరణంతో కష్టాలు వచ్చినా.. ఆయన నింపిన స్ఫూర్తి, చివరిగా చెప్పిన మాటలే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చాయని అనిత విశ్వాసం. నీ చుట్టూ పరిస్థితులు ఎలా అయినా ఉండనీ.. వాటిని దీటుగా ఎదుర్కోవాలన్నదే తన తండ్రి ఆమెకిచ్చిన సలహా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి