చెమటలు చిందిస్తూ...విజయం సాధించారు!

‘స్కూల్లో ఎన్ని ఆటలు ఆడే వాళ్లమో’ ఈ మాట చాలా మంది మహిళల నోట వింటాం. పోటీల్లో గెలిచిన వారూ చాలా మందే ఉంటారు! కానీ ఒక వయసుకొచ్చాక అవన్నీ పక్కన పెట్టేస్తారు.

Updated : 20 Dec 2022 03:31 IST

‘స్కూల్లో ఎన్ని ఆటలు ఆడే వాళ్లమో’ ఈ మాట చాలా మంది మహిళల నోట వింటాం. పోటీల్లో గెలిచిన వారూ చాలా మందే ఉంటారు! కానీ ఒక వయసుకొచ్చాక అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఆటలకు వయసుతో పనేముంది.. కొనసాగించాలన్న కోరికుండాలంతే అంటూ ప్రోత్సహిస్తున్నారు తన్వి, శ్వేత. అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టిన వీళ్లు వేల మందిని ఫిట్‌నెస్‌, ఆటల దిశగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ల కథేంటో.. చదివేయండి.

న్వి హాన్స్‌ది దిల్లీ.. తను ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి. భవిష్యత్‌ బాగుంటుందని బెంగళూరుకు మకాం మార్చింది. ఇక్కడే తనకు శ్వేత సుబ్బయ్య పరిచయమైంది. తను పర్సనల్‌ ట్రైనర్‌. నైక్‌ సర్టిఫైడ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కూడా. వీళ్లిద్దరూ ఓ కార్యక్రమంలో కలిసి, స్నేహితులయ్యారు. ఓసారి శ్వేత తన స్నేహితుల దగ్గరికి తన్విని తీసుకెళ్లింది. తన్వి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అని తెలియగానే తమకూ నేర్పించమని అడిగారు వాళ్లు. సరేనని ఒక ఆదివారం క్రీడా మైదానాన్ని బుక్‌ చేసింది. శ్వేత వాళ్లకి వార్మప్‌ చేయిస్తే.. తన్వి ఆడటం నేర్పించింది. వాటికి సంగీతాన్నీ జోడించడంతో అందరూ ఆనందించారు.

‘ఏ నలుగురైదుగురో వస్తారనుకున్నాం. తీరా 20 మంది దాకా వచ్చారు. అంతమందిని చూసేసరికి చాలా ఉత్సాహమేసింది. చురుగ్గా నేర్పించాం. వాళ్లూ చాలా ఆనందించారు. రెండ్రోజులకే మరొక సెషన్‌ అన్నారు. అలా మొదలైందిది. వచ్చే వాళ్ల సంఖ్యా పెరిగింది. దీంతో 2017లో ‘సిస్టర్స్‌ ఇన్‌ స్వెట్‌’ సంస్థని మొదలుపెట్టాం. సెషన్లవారీగా తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాం. మొదట్లో 30 ఏళ్ల వాళ్లే వచ్చేవారు. ఇప్పుడు టీనేజర్ల నుంచి 65 ఏళ్ల వారి వరకూ వస్తున్నారు. విద్యార్థులు, మేనేజర్లు, సీఈఓలు కూడా మా కస్టమర్లే. అయితే ఇది ఆడవాళ్లకు మాత్రమే’ అని వివరించారీ మిత్రద్వయం.

గంటంపావు సెషన్‌లో యోగా, పైలాక్సింగ్‌ (పైలేట్స్‌+ బాక్సింగ్‌), డ్యాన్స్‌.. ఉంటాయి. ఈ సందర్భంలో చాలామంది మహిళలు ఆటలపై ఆసక్తి కనబరచడాన్ని గమనించారు. కొందరిది క్రీడానేపథ్యం, నేషనల్స్‌ వరకూ ఆడి ఆపిన వారు.. ఇంకొందరేమో ఆసక్తి ఉన్నా రకరకాల కారణాలతో స్కూలు స్థాయిలోనే ఆగిపోయిన వారు. వీళ్లని తిరిగి ఆటల వైపు ప్రోత్సహించా లనుకున్నారు. ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, రగ్బీ, ఈత, సైక్లింగ్‌... ఇలా పలురకాల ఆటలు నేర్పించడమూ మొదలుపెట్టారు. ఓ అకాడమీతో ఒప్పందం చేసుకున్నారు. కోచ్‌లనూ నియమించుకున్నారు. వారం, మూడు నెలలకోసారి పోటీలూ నిర్వహిస్తున్నారు. ఈవెంట్‌, సెషన్‌ని బట్టి కొంత రుసుము తీసుకుంటారు. క్రమంగా బెంగళూరులో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు నాలుగు వేలకుపైగా మహిళలు వీరి బృందంలో సభ్యులు. ‘కెలోరీలు తగ్గడంతోపాటు ఆహ్లాదాన్నీ పంచాలన్నది మా ఉద్దేశం. దానికి తగ్గట్టుగా సెషన్‌ డిజైన్‌ చేస్తుంటాం. ప్రతి సెషన్‌ తర్వాత అందరితో కలిసి అల్పాహారం తీసుకోవడం, కబుర్లు చెప్పడమే కాదు.. వాళ్లు ఏం ఆశిస్తున్నారన్నదీ తెలుసుకుంటాం. అదే మా విజయానికి కారణమైంది. నైక్‌, ప్యూమా వంటి క్రీడా సంబంధ సంస్థలూ మమ్మల్ని సంప్రదిస్తున్నాయి’ అని చెబుతారీ మిత్రులు. ఇక్కడి విజయోత్సాహంతో ఇటీవలే ముంబయిలో మరో శాఖను ప్రారంభించారు. త్వరలో వాటిని దేశవ్యాప్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్