Updated : 25/12/2022 04:50 IST

మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి...

అనుభవ పాఠం

అందరిలానే చిన్నప్పటి నుంచీ జీవితం మీద, భవిష్యత్తు మీదా బోలెడు ఆశలు పెట్టుకున్నా. కానీ రోడ్డు ప్రమాదం వాటన్నింటినీ చెల్లా చెదురు చేసింది. ప్రాణమంటే పోలేదు కానీ కాలుని కోల్పోయా. శస్త్రచికిత్సల నొప్పుల్ని పంటి బిగువున భరించినా, మనసుకి తగిలిన గాయం మానడానికి మాత్రం చాలా కాలమే పట్టింది. కొన్ని రోజులు నాలుగు గోడలకే పరిమితం అయ్యా. ఎప్పటికీ ఇలానే ఉండిపోతే... నేనెప్పటికీ నేనుగా ఉండలేను అనిపించింది. అందుకే కఠిన పరిస్థితులతో పోరాడాలనుకున్నా. ప్రోస్థటిక్‌ కాలుని అమర్చుకున్నా. నడిస్తే సరిపోదు... నాకంటూ ఓ వ్యాపకాన్ని ఏర్పరుచుకుని మేటిగా నిలబడాలనుకున్నా. నాన్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కావడంతో దీనిపై నాకెంతో ఇష్టం ఉండేది. అందుకే  బ్యాడ్మింటన్‌లో రాణించాలని నిర్ణయించుకున్నా. మొదట్లో అంతా నవ్వుకున్నారు. అవేవీ మనసుకి తీసుకోకుండా నాన్నతో కలిసి సాధన మొదలుపెట్టా. ఆట నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. క్రమంగా నన్ను నేను మెరుగు పరుచుకుంటూ జాతీయ పోటీల స్థాయికి చేరుకున్నా. అక్కడితో నా లక్ష్యం పూర్తయిపోలేదు. మరో మెట్టు ఎక్కడానికి నిర్ణయించుకుని... హైదరాబాద్‌లో గోపీచంద్‌ అకాడమీకి చేరుకున్నా. ఇక్కడి శిక్షణ తర్వాత... పారాబ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ పతకాలూ అందుకోగలిగా. అయితే ఇవన్నీ ఏదో నేనే సాధించా అని చెప్పడం లేదు. తలుచుకుంటే మీరూ చేయగలరు. జీవితం ఎప్పుడూ మనకి పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. వాటిని మనమే అర్థం చేసుకోవాలి. మన జీవితానికి ఓ పరమార్థం ఉండేలా చూసుకోవాలి.

- మానసి జోషి, పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి