అయిదోతరం అమ్మాయిని..

సంప్రదాయ ఆహారానికి ఆధునికత అద్ది.. తరాల మధ్య అంతరాలను అనుసంధానం చేశారీమె. అయిదుతరాల వ్యాపారాన్ని దేశవిదేశాలకు విస్తరింపజేశారు. పోషకాలమయమైన గింజలను రుచికరమైన స్నాక్స్‌గా మార్చి ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. 39 ఏళ్ల దినికా భాటియా స్ఫూర్తి కథనమిది.

Published : 07 Jan 2023 01:28 IST

సంప్రదాయ ఆహారానికి ఆధునికత అద్ది.. తరాల మధ్య అంతరాలను అనుసంధానం చేశారీమె. అయిదుతరాల వ్యాపారాన్ని దేశవిదేశాలకు విస్తరింపజేశారు. పోషకాలమయమైన గింజలను రుచికరమైన స్నాక్స్‌గా మార్చి ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. 39 ఏళ్ల దినికా భాటియా స్ఫూర్తి కథనమిది.

లనాటి తరాల ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేటి తరానికి నచ్చేలా అందించాలనుకున్నారు దినికా. ఈ వ్యాపారానికి నువ్వు వారసురాలివి అవుతావా అని నానమ్మ అడిగితే.. తలూపిన దినికాకు అప్పటికి ఆరేళ్లే. ఆమె ముత్తాతలు ప్రారంభించిన డీఆర్బీ ఫుడ్స్‌కు 136 ఏళ్లు. డ్రైఫ్రూట్స్‌, గింజల గురించి తాతయ్య, నాన్న, మావయ్యలు ఇంట్లో చర్చించుకోవడం దినికా వింటూ ఉండేది. దిల్లీలో మొదలుపెట్టి, క్రమేపీ పంజాబ్‌, హరియాణాలకు వ్యాపారాన్ని విస్తరించారు.
కాలిఫోర్నియాలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుతున్నప్పుడు అక్కడ దాదాపు అందరూ పోషకాల కోసం బాదం, జీడిపప్పు స్నాక్స్‌ తినడం చూసేవారీమె. వాటిని తయారుచేసే ఫ్యాక్టరీలకు వెళ్లేవారు దినికా. తయారీ నుంచి ఆ ఉత్పత్తులను వారెలా మార్కెటింగ్‌ చేస్తున్నారో అధ్యయనం చేసేవారు. 2009లో చదువు పూర్తయి, ఇండియాకు తిరిగొచ్చి ఈ వ్యాపారాన్ని చేతిలోకి తీసుకొన్నారు దినికా.

‘ఇందులో అయిదోతరం అమ్మాయిని. ‘నట్టీ గ్రిట్టీస్‌’ పేరుతో నాన్న వద్ద పెట్టుబడికి రూ.50 లక్షలు తీసుకొన్నా. పోషకాహారంపై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో ఉద్యోగులు ఇంట్లోనే కాకుండా కార్యాలయాలకూ.. డ్రైఫ్రూట్స్‌, గింజధాన్యాలు, మొలకలు తెచ్చుకుంటున్నారు. అలా వారికి ఉపయోగపడేలాగానే కాకుండా రుచికరమైన స్నాక్స్‌గా ఈ పోషకాల గింజలను మార్చాలనుకున్నా. ఆకర్షణీయంగా గిఫ్ట్‌ ప్యాక్స్‌లా తయారుచేస్తే బాగుంటుంద నిపించింది. ప్రజలకు చేరువగా వెళ్లాలంటే వారి ఆలోచనలకు, అవసరానికి తగినట్లు అందించాలనే చిట్కాను అనుసరించా. ఈ స్నాక్స్‌లోని బాదం, పిస్తా, జీడిపప్పుల్లోని పోషకాలు దూరంకాకుండా ఉండటానికి నూనె కూడా వినియోగించం. గింజల ఎంపికలో నాణ్యతకే పెద్దపీట. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం’ అని వివరిస్తున్నారీమె.  

14 ఏళ్ల ప్రయాణం.. నట్టీ గ్రిట్టీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సవాళ్లెన్నో ఎదుర్కొన్నారు దినికా. తొలుత దిల్లీలోని స్టోర్‌లో ఈ ఉత్పత్తులను విక్రయించారీమె. ఆ తర్వాత కార్పొరేట్‌ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి వీటి రుచిని పరిచయం చేశారు. రిటైల్‌గా విక్రయాలు మొదలైన తర్వాత, వెబ్‌సైట్‌ ప్రారంభించి వినియోగదారుల సంఖ్య పెరిగేలా చేశారు. మార్కెట్‌లో పోటీని తట్టుకొని అయిదేళ్లకే వ్యాపారాన్ని లాభాలబాట పట్టించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రూ.20 కోట్లకుపైగా వార్షికాదాయాన్ని అందుకుంటున్నారు దినికా. ‘ఈ 14 ఏళ్ల ప్రయాణంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 1200 రిటైల్‌ స్టోర్స్‌ సహా ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయగలుగుతున్నాం. సాదా స్నాక్స్‌తోపాటు ప్రొటీన్‌ రిచ్‌, ట్రయల్‌ మిక్సెస్‌, వీగన్‌  ఫ్రెండ్లీ అంటూ మావద్ద 500 రకాలకు పైగా ఉత్పత్తులున్నాయి. ఈ ఉత్పత్తులను పెంచి వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలనేది నా కల. రోజూ అరగంట వ్యాయామం నన్ను ఒత్తిడి నుంచి దూరం చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది’ అని చెబుతోన్న దినికా ప్రస్థానం స్ఫూర్తిదాయకం కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్