Published : 23/01/2023 00:24 IST

విమర్శలనూ స్వీకరించాలి...

చిన్నప్పుడు మా బంధువులబ్బాయి శిక్షణ కోసం టాటా ఆర్చరీ అకాడెమీలో చేరాడు. అక్కడి విశేషాలన్నీ కథలుగా చెబుతుంటే నాకూ విలు విద్యపై ఇష్టం, అక్కడ చేరాలన్న ఆసక్తి మొదలయ్యాయి. ఇంట్లో చెబితే చదువుకుని స్థిరపడు, మనకివన్నీ వద్దన్నారు. కానీ, నేను వదిలితేగా!. ఏదోలా ఒప్పించా. మామిడికాయలే లక్ష్యంగా ఇంట్లోనే వెదురుతో చేసిన విల్లూ, బాణాలతోనే నా ఆట మొదలుపెట్టా. అమ్మానాన్నలిద్దరూ రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడిచేది కాదు. నాకు నాణ్యమైన విల్లు కొనివ్వడం అప్పటికి అసాధ్యమైన విషయమే. అయితే, నా పట్టుదల చూసి కాదనలేకపోయారు. ఇక, శారీరకంగా బలహీనంగా ఉండటం, సరైన అవగాహన కూడా లేకుండా ప్రయత్నించడం వల్ల టాటా ఆర్చరీ అకాడమీలో స్థానం దక్కించుకోలేకపోయా. కానీ, నాకు ఆటపై ఉన్న ఇష్టాన్ని గమనించిన వారు అర్జున అకాడెమీలో స్థానం కల్పించారు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నా ప్రతిభను నిరూపించుకున్నా. దాంతో ఏడాది తిరక్కుండానే టాటా కేంద్రంలోకి అడుగుపెట్టా. అలా పదిహేనవ ఏట అమెరికాలో జరిగిన 11 వ యూత్‌ వరల్డ్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకోవడంతో విలువిద్య క్రీడలో నా ప్రయాణం మొదలైంది. మన ఆలోచన స్థిరంగా ఉంటే ఎంత కష్టమైనా భరించొచ్చు. ఆటైనా, జీవితమైనా ఏదీ సులువుగా పట్టు చిక్కవు. ఓటమి ఎదురైనప్పుడల్లా విమర్శలు బాణాల్లా తగులుతుంటాయి. మనసుకి గాయాల్ని చేస్తాయి. అవి మన ఆలోచనలూ,  నైపుణ్యాల మీదా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఆ విషయం అర్థంచేసుకున్నాక ఆడేది ప్రపంచకప్‌ అయినా, ఒలింపిక్స్‌ అయినా గెలుపే లక్ష్యంగా అన్నింటినీ ఒకేలా చూడటం మొదలుపెట్టా.  నేనే కాదు ఎవరైనా సరే, ఎదుటివారు విమర్శించారని బాధపడటం కంటే వారు చెబుతోన్న లోపాలు నిజమైనవో, కావో గమనించుకుని సరిదిద్దుకుని సాగిపోగలగాలి. అప్పుడే విజయం మీదవుతుంది.

- దీపికా కుమారి, ఆర్చరీ క్రీడాకారిణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి