ఆమె సమస్యలకు.. సోషల్‌ సాయం

‘అలా చెప్పకూడదు’.. చిన్న మాటే! దాని కారణంగా.. నెలసరి, లైంగిక సమస్యలు, వేధింపులు, లింగభేదం.. బాధ ఏదైనా పంటి బిగువున భరించేస్తుంటాం.

Updated : 29 Jan 2023 07:34 IST

‘అలా చెప్పకూడదు’.. చిన్న మాటే! దాని కారణంగా.. నెలసరి, లైంగిక సమస్యలు, వేధింపులు, లింగభేదం.. బాధ ఏదైనా పంటి బిగువున భరించేస్తుంటాం. ఇలా ఎంతకాలం? మార్పు రావాలిగా! ఆ ప్రయత్నమే చేస్తున్నారు వీళ్లు. సామాజిక మాధ్యమాన్ని ఆసరాగా చేసుకొని.. ‘మహిళా’ సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు.


ఆ ఇబ్బంది మరొకరికొద్దని

మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఎన్నో అనుమానాలు. చాలా ఇబ్బందీ పడింది అనుపమ కుమార్‌. అది ఆమెను గర్భధారణ, ప్రసవం, పిల్లల సంరక్షణ వంటి ఎన్నో అంశాలపై దృష్టిపెట్టేలా చేసింది. ‘నేనో కంప్యూటర్‌ ఇంజినీర్‌. పెద్దవాళ్లు అనుభవం పేరుతో ఇచ్చే సలహాలతో మొదటి ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బందిపడ్డా. అందుకే రిసెర్చ్‌ జర్నల్స్‌ వగైరా చదివి చాలా విషయాలు తెలుసుకున్నా. నాలా మరొకరు ఆ ఇబ్బంది పడకూడదని తెలిసిన వాళ్లతోనూ పంచుకునేదాన్ని. తర్వాత చైల్డ్‌బర్త్‌ ఎడ్యుకేషన్‌, ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్‌, లాక్టేషన్‌ మొదలైన వాటిల్లో సర్టిఫికేషన్‌ కోర్సులు చేశా. ప్రెగ్నెన్సీలో దాంపత్యం, సి సెక్షన్‌, పాలు పట్టేవిధానం, పిల్లల సంరక్షణ విషయాల్లో ‘వృక్షమ్‌’ పేరుతో శిక్షణిస్తున్నా. 2017 నుంచి ఇన్‌స్టాలోనూ వీడియోలుంచుతున్నా. విదేశాల్లో ఉంటున్నవాళ్లకీ ఆన్‌లైన్‌లో తరగతులుతీసుకుంటున్నా’ అంటారు 38 ఏళ్ల అనుపమ. ‘ప్రెగ్నెన్సీని ఆడవాళ్ల సమస్యగా మాత్రమే చూసే మగవాళ్లే ఎక్కువ. ప్రసవానికి ముందూ తర్వాతా కలయిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాలుపట్టడం వంటి విషయాలను పట్టించుకోరు. నా తరగతుల్లో మగవారినీ పాలుపంచుకునేలా చూస్తా. పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలపైనా అవగాహన కల్పిస్తుంటా’ అనే ఈవిడది తమిళనాడులోని తిరుపూర్‌. అనుపమ. వృక్షమ్‌ను ఇన్‌స్టాలో 8.8 లక్షలమంది అనుసరిస్తున్నారు.


ఫ్రొఫెసర్‌ నుంచి సీఈఓ

‘స్త్రీవాదం అనగానే పురుషులకు వ్యతిరేకంగా మాట్లాడటం అనుకుంటారు చాలామంది. నిజానికి మహిళలకు మార్గనిర్దేశం చేయడం, వారి గురించి పట్టించుకోడం, అండగా నిలవడం’ అంటుంది జప్లీన్‌ పస్రిచా. ‘ఫెమినిజమ్‌ ఇన్‌ ఇండియా (ఎఫ్‌ఐఐ)’ అనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కి సీఈఓ తను. నెలసరి నుంచి హక్కుల వరకు మహిళలకు సంబంధించిన సమస్యలు, పరిష్కారాలు, అవకాశాలు అన్నింటికీ దీనిలో చోటు ఉంటుంది. ‘ఇంట్లో నాకు స్వేచ్ఛ ఉండేది. చాలామంది ఆడవాళ్లు సమస్యను చెప్పుకొనే వీల్లేక మానసిక సంఘర్షణకు గురవటం గమనించా. వాళ్లకో వేదిక ఉండాలని 2014లో ఫేస్‌బుక్‌లో ‘ఎఫ్‌ఐఐ’ ప్రారంభించా. తర్వాత వెబ్‌సైట్‌గా తీసుకొచ్చా. నిజానికి నేను చదివింది జర్మన్‌ లాంగ్వేజ్‌. పీజీ అయ్యాక దిల్లీ జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గానూ చేశా’ అనే ఈ దిల్లీ అమ్మాయి టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. మహిళా హక్కుల కోసం పనిచేస్తోన్న ఎన్నో స్వదేశీ, విదేశీ ఎన్‌జీఓల్లో సభ్యురాలు. ఎఫ్‌ఐఐ తొలిరోజుల్లో జప్లీన్‌ కొందరు అమ్మాయిల కథల్ని పేరు లేకుండా ప్రచురించేది. నిపుణుల సలహాలనీ జోడించేది. తర్వాత్తర్వాత బాధితులే ముందుకొచ్చి పంచుకునేవారు. నిపుణులూ తోడయ్యారు. అలా పరిధి పెరుగుతూ వచ్చింది. కేంద్రప్రభుత్వం నుంచే కాదు.. విదేశీ పురస్కారాలనూ గెలుచుకుందీ 33 ఏళ్ల జప్లీన్‌. వెబ్‌సైట్‌ ద్వారా లక్షలమందికి చేరువైన ఈమె ఎఫ్‌ఐఐ ఇన్‌స్టా ఖాతాని దాదాపు 2 లక్షలమంది అనుసరిస్తున్నారు.


హాస్యం జోడించి!

‘ఆఫీసు, రోడ్డు, ఇల్లు.. ప్రదేశమేదైనా చిన్న నిర్లక్ష్యం, జోక్‌, కామెంట్‌ పేరుతో జారే మాట కూడా ఓ అమ్మాయి జీవితాన్ని తలకిందులు చేయగలదు. కానీ వీటిని తెలుసుకోవాలనుకునే, వివరించే ఓపిక చాలా మందికి ఉండదు. ఆ అంశాలకు తేలిక భాషలో హాస్యాన్ని జోడించాలనుకున్నా’ అంటుంది నికితా దీక్షిత్‌. నిఫ్ట్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిందామె. మూడేళ్లయ్యాక ఉద్యోగం నుంచి బయటకొచ్చింది. తన అనుభవాలను జోడిస్తూ 2018లో ‘బీబ్యాడ్‌యాస్‌’ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. ‘పదేళ్లు చదువు, ఉద్యోగం పేరుతో ఇంటి నుంచి దూరంగా ఉన్నా. ఇన్నేళ్లలో ఎన్నో అనుభవాలు. అమ్మాయి వేసుకునే దుస్తుల నుంచి ప్రవర్తన వరకు అందరూ సలహాలిచ్చేవారే. మరి ఆమెకు కావాల్సిందేంటి? తను ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఎలాంటి సాయం కావాలనే అంశాల గురించి మాత్రం తెలుసుకునే వారు అరుదు. బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడే అంశాలను అందరి ముందూ ఉంచాలనుకున్నా. కార్టూన్‌, వీడియో, ఫొటోల రూపంలో వ్యంగ్యాన్ని జోడించి  అందిస్తున్నా’నంటుంది 30 ఏళ్ల నికిత. వాటిని ఇన్‌స్టా ఖాతాలోనూ ఉంచుతుంది. దాన్ని రెండు లక్షలకుపైగా అనుసరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్