Published : 29/01/2023 00:03 IST

లోకంలోనే.. ఒంటరిని అనిపించింది!

దీ అనుకున్నట్లుగా అవ్వట్లేదు.. ఏం చేసినా వైఫల్యమే ఎదురవుతోందని మీకెప్పుడైనా అనిపించిందా? జీవితాంతం తోడు ఉంటాడనుకున్న వ్యక్తి మధ్యలోనే వదిలేయడం.. కెరియర్‌లో వరుస వైఫల్యాలు.. పెట్టుబడి కోల్పోయి చేతిలో రూపాయి లేని స్థితి. ఎక్కడ సాయం అడుగుతారోనని ముఖాలు చాటేసే వ్యక్తులు.. కొన్నేళ్ల క్రితం నా పరిస్థితి ఇదే! లోకంలో ఒంటరిగా మిగిలిపోయా అనిపించింది. జీవితంలో ముందుకు సాగాలనిపించే ఒక్క కారణం కూడా కనిపించలేదు. అందుకే ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నా. ఆరు నెలలు ఇంట్లోంచి కాలు బయట పెట్టలేదు. ఇంట్లోనే తినడం, పడుకోవడం.. బాధను తట్టుకోలేక ఏడవడం. ఎంత ఏడ్చినా గుండెలోంచి బాధ బయటికి పోవట్లేదనిపించేది. ఇంట్లోవాళ్లనీ బాగా గుర్తొచ్చినప్పుడే పలకరించేదాన్ని. అలాంటి స్థితిలో మా అన్నయ్య, స్నేహితురాలు అండగా నిలిచారు. ఎలాగూ వచ్చేది వైఫల్యమేగా అని కొత్తది ప్రయత్నించడానికీ భయపడ్డా. చివరికి ఎన్నాళ్లిలా అని ఓ సినిమాను ఒప్పుకొన్నా. కానీ అప్పటికే విపరీతంగా లావయ్యా. చెమటోడ్చి కొద్దిగా తగ్గా. నాలో సానుకూలత నింపడానికా అన్నట్టు అది విజయం సాధించింది. తర్వాత ఇంత చిన్నదానికా నేనింతగా బాధపడింది అనిపించింది. అప్పట్నుంచి పరిస్థితి ఎలాంటిదైనా సిద్ధంగా ఉండటం నేర్చుకున్నా. వైఫల్యాలూ బాధించట్లేదు. పైగా ఏ విషయమైనా బాధించినా.. వెనక్కి తిరిగి ఆ పరిస్థితిని గుర్తు చేసుకుంటా. అదో పాఠంలా కనిపిస్తుందిప్పుడు. అందుకే దాన్ని దాటే శక్తినిచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలూ చెబుతుంటా. వైఫల్యం వచ్చినపుడు కుంగిపోవద్దు. ‘ఈ దశ దాటిపోతుంది’ అని నమ్మి, ఓపిక పట్టండి. భవిష్యత్తులో దాన్ని మించిన గొప్ప పాఠం దొరకదు మీకు.            

- పరిణీతి చోప్రా, నటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి