ఒంటి కాలితోనే.. కల సాధించుకుంది

మోడల్‌ కావాలన్నది ఆమె కల. అనుకోకుండా ఒక కాలు తొలగించాల్సి వచ్చింది. అలాగని ఆగిపోలేదు. కృత్రిమ కాలితో మోడలయ్యారు. ట్రస్టు నిర్వహిస్తూ తనలాంటి వారికి చేయూత నిస్తున్నారు.

Updated : 29 Jan 2023 09:49 IST

మోడల్‌ కావాలన్నది ఆమె కల. అనుకోకుండా ఒక కాలు తొలగించాల్సి వచ్చింది. అలాగని ఆగిపోలేదు. కృత్రిమ కాలితో మోడలయ్యారు. ట్రస్టు నిర్వహిస్తూ తనలాంటి వారికి చేయూత నిస్తున్నారు. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీలో స్థానాన్ని సంపాదించి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.. సియాన్‌ గ్రీన్‌ లార్డ్‌. ఆమె కథ ఇది.

దేళ్ల క్రితం.. న్యూయార్క్‌లో రోడ్డుపై నడిచి వెళుతోన్న సియాన్‌ని టాక్సీ ఢీకొంది. రక్తపు మడుగులో ఉన్నామెను ఎవరో గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఎడమకాలు దెబ్బతినడంతో వైద్యులు మోకాలి కింది భాగాన్ని తొలగించారు. ఆ తర్వాతా మరెన్నో శస్త్రచికిత్సలు. ఆరు వారాలు మంచంపైన కదల్లేని స్థితి. తన జీవితమేంటన్న ప్రశ్న ఎదురైందావిడకి.

‘చిన్నప్పటి నుంచీ మోడలవ్వాలి, ఫ్యాషన్‌ రంగంలో అడుగు పెట్టాలన్నది నా కల. ఈ ప్రమాదంతో ఇక ఆ కల.. కలలాగే మిగిలి పోతుందనుకున్నా. కుంగిపోయా.. జీవితం శూన్యంగా అనిపించేది. అప్పుడే వైద్యుల సూచనతో కృత్రిమ కాలు పెట్టించుకున్నా. అప్పుడు చిన్నగా నాలో ఆశ మొదలైంది. దాంతో నడక ప్రారంభించా. కిందపడ్డా.. పట్టుదలగా తిరిగి లేవడానికి ప్రయత్నించేదాన్ని. క్రమేపీ నాపై నాకు నమ్మకం వచ్చింది. తిరిగి నా ‘మోడలింగ్‌ కల’పై దృష్టిపెట్టా. నా ఆత్మవిశ్వాసం, పట్టుదల చూసి చిన్న చిన్న వేదికలు అవకాశాలిచ్చాయి. ఆపై నెమ్మదిగా ఈ రంగంలో నిలదొక్కుకున్నా. పెద్దపెద్ద మోడల్స్‌తో వేదిక పంచుకొనే స్థాయికి ఎదిగా’ అంటారు సియాన్‌.

ఆరేళ్లు పోరాడి..

రోడ్డు ప్రమాదం తర్వాత ఆసుపత్రి నుంచి తన స్వస్థలం లండన్‌కు చేరుకున్నారు సియాన్‌. ఆసుపత్రి ఖర్చు తడిసి మోపెడైంది. దానికి కారణమైన వారిపై చట్టపరంగా పోరాడాలనుకున్నారీమె. ‘దీన్ని అనుకోని ప్రమాదంగా డ్రైవరు తరఫు న్యాయవాది వాదించారు. మరి నాకు జరిగిన నష్టం సంగతేంటి? దీనిపైనే పోరాడా. ఆరేళ్లకు పరిహారంగా రూ.1.20 కోట్లు అందాయి. నాలాంటి వాళ్లకి మార్గదర్శకంగా నిలవాలనుకున్నా. జిమ్‌ ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టా. ప్రమాదాల్లో అవయవాలను పోగొట్టుకున్న వారికి చేయూతనివ్వాలనుకున్నా. 2015లో ‘సియాన్‌ గ్రీన్‌ ఫౌండేషన్‌’ని ప్రారంభించి కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తున్నా. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుంటా. నా కథనే వారికి ఉదాహరణగా వివరిస్తుంటా. ధైర్యంగా ఒక్క అడుగు వేస్తే చాలు.. అది వేల అడుగులకు నాంది అవుతుంది’ అంటోన్న 32ఏళ్ల సియాన్‌ కథ అందరికీ స్ఫూర్తిదాయకమే కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్