దేశం... మనసు దోచారు!

‘వీళ్లుంటే చాలు.. విజయం ఖాయం!’ ఆటైనా, సినిమా అయినా ఆ భరోసా కల్పించడం అంత సులువు కాదు. దాని వెనుక ఏళ్ల శ్రమ, కృషి దాగి ఉంటాయి.

Published : 12 Feb 2023 00:22 IST

‘వీళ్లుంటే చాలు.. విజయం ఖాయం!’ ఆటైనా, సినిమా అయినా ఆ భరోసా కల్పించడం అంత సులువు కాదు. దాని వెనుక ఏళ్ల శ్రమ, కృషి దాగి ఉంటాయి. అలాంటి టాప్‌ స్థానాన్ని దక్కించుకొని దేశవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నారు కొందరు నటీమణులు, క్రీడాకారిణులు. 2022లో తమ విజయాలతో ఆకట్టుకున్న వాళ్లని షోస్‌టాపర్స్‌ అంటూ పరిచయం చేసింది ఫోర్బ్స్‌! వాళ్లలో కొందరిని కలుసుకోండి!


డాక్టర్‌.. యాక్టర్‌

‘ఇలాగైతే భవిష్యత్తులో అవకాశాలు రావు. సంపాదించుకోలేవు’.. ప్రయోగాత్మక సినిమాలు, నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటున్న ఐశ్వర్య లక్ష్మికి ఈ సలహాలొస్తాయట. వాటికి ‘సినిమా నాకో హాబీ మాత్రమే. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రల్లో 3, 4 సినిమాల్లో నటించినా చాల’ని సమాధానమిస్తుందామె. కేరళ అమ్మాయి. చిన్నప్పట్నుంచీ అమ్మాయంటే టీచరో, డాక్టరో అవ్వాలన్న సలహాల మధ్య పెరిగింది. అమ్మాయికి నచ్చింది చేసే హక్కు లేదా అన్న ప్రశ్న ఎప్పుడూ మెదిలేదామెలో. అందుకే ఎంబీబీఎస్‌ చదువుతూనే మెచ్చిన మోడలింగ్‌లోకీ అడుగుపెట్టింది. ఆపై సినిమా అవకాశాలొచ్చాయి. హౌజ్‌ సర్జన్‌గా చేస్తూనే సినిమాల్లో నటిస్తోంది. ఎప్పటికైనా వైద్యురాలిగా స్థిరపడాలన్నదే ఆమె కోరిక. అందుకే గుర్తింపునిచ్చే పాత్రలకే ప్రాధాన్యమిస్తుంది. పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగేళ్లే! ప్రతిభతో మళయాలంతోపాటు తెలుగు, తమిళ సినిమా అవకాశాలు దక్కించుకుంది. దాదాపు ప్రతి సినిమాకీ పురస్కారాలొచ్చాయి. గతఏడాది అమ్ము, కుమారి, మట్టికుస్తీ, గార్గి, పొన్నియిన్‌ సెల్వన్‌తోపాటు ఓటీటీల్లోనూ నటించింది. గార్గికి సహనిర్మాత కూడా. తన నటనతో ప్రామిసింగ్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకొని షోస్‌టాపర్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది.


కెరియర్‌ని పక్కన పెట్టేసి..

దువుకోనివ్వాలన్న నిబంధనతో పెళ్లి చేసుకుందో అమ్మాయి. తర్వాత ఆ ఊసే లేదు. స్వేచ్ఛ సంగతి సరేసరి. భర్తకి కోపమొచ్చిందా చెంప చెళ్లుమనేది. ఎవరికి చెప్పినా ‘ఇదంతా సహజం.. సర్దుకోవాల’న్న సలహాలే. ఇలా కాదని మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొని భర్తకు బుద్ధి చెబుతుంది. ‘జయ జయ జయ జయహే’ సినిమాలో దర్శన రాజేంద్రన్‌ నటించిన పాత్ర ఇది. దానికోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడమే కాదు.. కాలికి గాయమై కొన్నిరోజులు మంచానికే పరిమితమైంది. పాత్ర కోసం అంత ప్రాణం పెడుతుందామె. పుట్టింది ఎర్నాకుళం. లండన్‌లో ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌లో పీజీ చేసింది. ఐఎఫ్‌ఎంఆర్‌లో ఉద్యోగం చేస్తూ సరదాగా థియేటర్‌ ఆర్ట్స్‌ ప్రయత్నించింది. అప్పుడే సినిమా అవకాశం వచ్చింది. అప్పటిదాకా ఆ ఆలోచనే లేదామెకు. సినిమా రంగం నచ్చాక కెరియర్‌నీ పక్కన పెట్టేసింది. 2014లో తొలి సినిమాతోనే తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. పాత్ర నచ్చితే భాషతో సంబంధమేముంది అంటుందీమె. 2022లో జయ జయ జయ జయహేతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ఇతర సినిమాల కోసం అభిమానులు నెట్టింట తెగ వెతికారట. ఇదేకాదు తను నటించిన హృదయం, డియర్‌ ఫ్రెండ్‌, నయా సఫర్‌ విజయవంతమయ్యాయి. అలా షోస్‌టాపర్స్‌ జాబితాకెక్కింది.


ఏడాదికే అంతర్జాతీయ గుర్తింపు..

రుస వైఫల్యాలు ఎవరినైనా కుంగదీస్తాయి. కానీ మనీష రామదాస్‌లో అవి గెలవాలన్న పట్టుదలను పెంచాయి. ప్రసవ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల పుట్టుకతోనే 17ఏళ్ల మనీషకు కుడి భుజంలో సమస్య. పూర్తిగా చేయి పైకి లేవదు. సర్జరీలు చేసినా ఫలితం లేదు. ఆటలంటే పిచ్చి. స్కూల్లో ప్రతి ఆటలోనూ ముందే. ఏడేళ్ల క్రితం సైనా నెహ్వాల్‌ని చూసి బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంది. స్కూలు, రాష్ట్ర టోర్నీల్లో నిరూపించుకుంది. కానీ జాతీయ స్థాయిలో వరుస ఓటములు వెక్కిరించాయి. అయినా కుంగిపోకుండా ప్రయత్నించేది. తన పరిస్థితిని, పట్టుదలనీ చూసి పారా బ్యాడ్మింటన్‌ ప్రయత్నించమని సలహా ఇచ్చారొకరు. అలా 2019 నుంచి ‘పారా అథ్లెట్‌’ విభాగంలో ఆడటం మొదలుపెట్టింది. తనది తమిళనాడు. గతఏడాది 34 మ్యాచ్‌ల్లో 32 విజయాలు నమోదు చేసింది. అంతర్జాతీయంగా అరంగ్రేటం చేసిందీ 2022 మార్చిలోనే! కానీ 11 స్వర్ణాలు, 5 కాంస్యాలు గెలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని నిశ్చయించుకున్నాక కఠోర సాధన చేసింది. మధ్యలో మోకాలికి గాయమై ఆట ఆపినా కోలుకున్నాక తిరిగి పతకాల వేటలో పడింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ నుంచి పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం అందుకొని ఫోర్బ్స్‌ జాబితాలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్