Published : 12/02/2023 00:22 IST

లక్షలమందిని దాటి.. రాజధానిలో గెలిచి!

మారుమూల గిరిజన ప్రాంత అమ్మాయి. జాతీయస్థాయిలో సత్తా చాటింది. ఆరున్నర లక్షల మంది పాల్గొన్న పోటీలో నిలిచి, దేశభక్తిని చాటింది. పురస్కారాన్ని గెలుచుకుంది.

ల్లూరి సీతారామరాజు జిల్లాలోని కిలగాడ గ్రామం.. డాక్టర్‌ సీహెచ్‌ హరిచందనది. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో బీడీఎస్‌ పూర్తిచేసిన ఈమె సివిల్స్‌ లక్ష్యంగా సాధన చేస్తోంది. ఇటీవల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ‘యూనిటీ ఇన్‌ క్రియేటివిటీ’ పేరుతో పోటీలు నిర్వహించింది. దేశభక్తి గేయం విభాగంలో హరిచందన పోటీలో పాల్గొంది. ప్రకృతి సౌందర్యంతో అలరారే మన్యం.. అక్కడి పర్వతాలు, సెలయేళ్లను వర్ణిస్తూనే భవిష్యత్‌లో భారత్‌ ఆర్థికంగా ఎలా ముందుకు సాగుతుందో జోడిస్తూ ఓ గీతాన్ని రాసింది. దాన్ని ఈ పోటీలకు పంపింది. దేశవ్యాప్తంగా ఆరున్నర లక్షలమంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హరిచందన ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షీ లేఖీ చేతుల మీదుగా దేశరాజధాని దిల్లీలో ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ. లక్ష నగదు పురస్కారాన్ని అందుకుంది. నాన్న సూర్యనారాయణ పడాల్‌ అటవీశాఖ చింతపల్లి డీఎఫ్‌వో. అమ్మ పద్మకుమారి గురుకుల అధ్యాపకురాలు.

‘కళాశాలలో చదివేప్పుడు ఏ పోటీలు జరిగినా పాల్గొనేదాన్ని. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నారని ఎక్కడో చదివా. గీతాల విభాగంలో యువత ఆకాంక్షలు, కలలను ప్రతిబింబించేలా ఉండాలన్నది నన్ను బాగా ఆకట్టుకుంది. గెలవాలన్న ఆకాంక్షతో రాయలేదు. కేవలం ఆ థీమ్‌ నన్ను ఆకర్షించింది. గతంలో ఎప్పుడూ గీతాలు రాసిన అనుభవం లేకపోయినా ప్రయత్నించా. మూడు చరణాలతో రాశా. మొదటి దానిలో భారత భౌగోళిక స్వరూపం, ప్రకృతి సౌందర్యాన్నీ, రెండు మూడింట్లో యువత కలలు, దేశం అభివృద్ధి దిశగా సాగుతున్న విధానాలకు చోటిచ్చా. ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాషల్లోనూ రాయొచ్చు. నేను ఆంగ్లంలో.. రెండు రోజుల్లోనే పూర్తిచేశా. అయినా ఎలా సాధ్యమంటే నాకు పాటలు వినడం వ్యాపకం. అదే సాయపడింది. రాశాక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశా. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో వివిధ వడపోతల తర్వాత గెలిచిన వారిని ప్రకటించారట. ఏపీ నుంచి ప్రథమస్థానం ఊహించలేదు. గెలిచానని తెలిసినప్పుడు చాలా ఆనందమేసింది. దిల్లీలో నాన్న ఎదురుగా కేంద్ర మంత్రి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం మరపురాని జ్ఞాపకం. ఈ ఉత్సవాల తర్వాత సివిల్స్‌ సాధించాలన్న కోరిక మరింత బలపడింది’ అంటోంది హరిచందన.

- చుక్కల రాము, నర్సీపట్నం అర్బన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి