సైకిల్‌ తొక్కారు... సందేశం ఇచ్చారు!

మహిళలు కుటుంబం అంటే ప్రాణం పెడతారు. భర్త, పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారే కానీ తమ ఫిట్‌నెస్‌ గురించి ఎందుకు పట్టించుకోరు?

Published : 20 Feb 2023 00:09 IST

మహిళలు కుటుంబం అంటే ప్రాణం పెడతారు. భర్త, పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారే కానీ తమ ఫిట్‌నెస్‌ గురించి ఎందుకు పట్టించుకోరు?

ఆడపిల్లలు చదువుకోవాలి. ధైర్యంగా ముందుకొచ్చి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అందుకోసం వారికి సురక్షిత సమాజం కావాలి.. ఈ రెండు సందేశాలను సమాజంలోకి తీసుకెళ్లడానికి సైక్లింగ్‌ని మాధ్యమంగా ఎంచుకుని రాష్ట్రాలు దాటుతున్నారు.. కోనేరు అనిత.. ముస్కాన్‌ రఘువన్షీ..


మహిళల ఆరోగ్యం కోసం..

మోకాళ్ల నొప్పి.. దీన్నో సమస్యగానే భావించరు స్త్రీలు. కానీ ఆ ఆరోగ్య సమస్యే 44 ఏళ్ల కోనేరు అనిత జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రత్యేక గుర్తింపు దక్కేలా చేసింది. 73 గంటల్లో వెయ్యి కిలోమీటర్ల సైకిల్‌ రైడ్‌ను పూర్తిచేసి రికార్డు సృష్టించారామె. కృష్ణా జిల్లా కౌతారం గ్రామానికి చెందిన రైతు కుటుంబం ఆమెది. భర్త శ్రీనివాస్‌ వ్యాపారి. వివాహం అయ్యాక కాకినాడలో స్థిరపడ్డారు. డిగ్రీ పూర్తి చేశారు. ‘స్కూల్‌ రోజుల్లో అథ్లెటిక్స్‌లో పాల్గొనేదాన్ని. ఆటలపై ఇష్టంతో మా పెద్దమ్మాయి నిఖితను జాతీయస్థాయి స్కేటింగ్‌ క్రీడాకారిణిగా తీర్చిదిద్దా. తను వైద్య విద్యలో పీజీ చేస్తోంది. రెండో అమ్మాయి నిషిత ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఇంటి పనుల్లో పడి వ్యాయామానికి దూరమయ్యా. కొన్నిరోజులకి మోకాళ్ల నొప్పులు. డాక్టర్లు.. సైక్లింగ్‌, స్విమ్మింగ్‌లో ఒకదాన్ని ఎంచుకోమన్నారు. అలా 2020లో సైక్లింగ్‌ ప్రారంభించా. ఈ వయసులో సైకిలా? అన్నారు చాలామంది. ఆ మాటల్ని పట్టించుకోకుండా వారాంతాల్లో రోజుకు 12 కి.మీ. రైడింగ్‌ చేసేదాన్ని. స్థానికంగా జరిగిన సైక్లింగ్‌ పోటీల్లో ద్వితీయ బహుమతి గెల్చుకున్నా. దాంతో ఆసక్తి పెరిగింది. ప్యారిస్‌ కేంద్రంగా నడుస్తున్న ఆడాక్స్‌ ఇండియా ఏటా సైక్లింగ్‌ రైడ్‌లను నిర్వహిస్తుంది. వీళ్లు ఒక ఏడాది సమయంలో నిర్ణీత గమ్యాన్ని సైక్లింగ్‌ ద్వారా పూర్తిచేస్తే ర్యాండోనియర్‌, సూపర్‌ ర్యాండోనియర్లుగా గుర్తిస్తారు. గతేడాది నవంబరు 6న మొదలుపెట్టి గుంటూరు, ఏలూరు, నల్గొండ, విశాఖపట్నం, టెక్కలి మార్గాల్లో ప్రయాణించి 38 గంటల్లో 600 కి.మీ రైడ్‌ పూర్తి చేశా. 42 రోజుల వ్యవధిలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసి సూపర్‌ ర్యాండోనియర్‌గా గుర్తింపు పొందా. అలాగే ఈ ఏడాది జనవరిలోనూ అమరావతి ర్యాండోనియర్‌ క్లబ్‌ తరపున 73 గంటల్లో 1000 కి.మీ దూరాన్ని రైడ్‌ చేసే పోటీలో పాల్గొన్నా. ప్రమాదాలు జరిగే జాతీయ రహదారులపై రాత్రులు సైకిల్‌ రైడ్‌ భయం అనిపించినా తోటి రైడర్లు ఉంటారు కదా అని ధైర్యంగా పూర్తిచేశా. ఇలాంటి రైడ్‌లకు బయలుదేరే వారం రోజుల ముందు నుంచే ఆహార అలవాట్లను మార్చుకోవడం, వర్కవుట్స్‌ చేయడంతోపాటు పక్కాగా ఉంటాను. సాధారణ గృహిణులు రోజూ అరగంటపాటు సైక్లింగ్‌ చేస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయి’ అంటారు అనిత.

- షేక్‌ మహమ్మద్‌ ఖాసిం, సత్తెనపల్లి


ధైర్యమే ఆయుధమవ్వాలి..!

నో సాధారణ విద్యార్థినే అయినా సమాజాన్ని తనవంతుగా మార్చాలనుకుంది. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. తమ కాళ్లపై తాము నిలబడాలి. ఇందుకోసం మనోధైర్యమే ఆయుధమవ్వాలనే’ సందేశంతో ముస్కాన్‌ రఘువన్షీ భారతదేశ సైకిల్‌ యాత్ర చేపట్టి తెలుగు ప్రాంతాల్లో పర్యటించింది.

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌ జిల్లా ఆమెది. అమ్మానాన్నలు రామకృష్ణ, మమత. డిగ్రీ చదివే ముస్కాన్‌ సామాజిక అంశాలపట్ల ఆసక్తిగా ఉండేది. తనవంతుగా బాలికలు, యువతుల్లో స్ఫూర్తిని నింపే కార్యక్రమం చేపట్టాలనుకుంది. అందుకు ఒంటరిగా సైకిల్‌పై దేశమంతా పర్యటించాలనుకుంది. అమ్మానాన్నలని ఒప్పించింది. ఫిబ్రవరి 1న కశ్మీర్‌ నుంచి యాత్రను మొదలుపెట్టింది. రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకొని రోజూ 100 కి.మీ. చొప్పున కన్యాకుమారి వరకు 3,800 కి.మీ. ప్రయాణిస్తోంది. ఈనెల 25కి తన గమ్యస్థానం చేరుకోనుంది. ‘చాలామందికి శారీరక శ్రమ ఉండటం లేదు. ప్రతిఒక్కరూ నిత్య జీవితంలో ఏదో ఒక వ్యాయామం అలవాటు చేసుకోవాలి’ అనే ముస్కాన్‌ ‘ధైర్యంగా కలలు కనే అమ్మాయిల కోసమే నా ఈ ప్రయాణం’ అంటూ దేశంలోని అనేక ప్రాంతాలు పర్యటించింది ఈ విజయాన్ని అమ్మాయిలకు అంకితం చేస్తోంది. రాత్రివేళల్లో అనువైన ప్రాంతాల్లో బసచేస్తూ, స్థానికులతో మాట్లాడుతూ, తన ప్రయత్నాన్ని- ఉద్దేశాన్ని వివరిస్తూ ముందుకు సాగుతోంది. ‘మనల్ని మనం తక్కువగా భావించొద్దు. కాలానుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఎంచుకున్న రంగంలో ధైర్యంగా అడుగేయాలి. అందుకు అనువైన సురక్షిత సమాజం కోసమే ఈ యాత్ర చేపట్టా’ అంటూ దారిపొడవునా అమ్మాయిలను చైతన్యపరుస్తోంది. 

- పెంటు రమేష్‌, నిర్మల్‌ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్