దాని ముందు...భయం చిన్నదనిపించింది!

‘మంచి ఉద్యోగం సాధిస్తే నా ఒక్కదానికే లాభం.. సేవామార్గంలోకి వెళితే పదిమందికీ సాయపడొచ్చు’.. అని నమ్మింది ఊహా మహంతి. దానికోసం తన భవిష్యత్‌ పక్కన పెట్టి, తాత, నాన్నలకు సేవా వారసురాలైంది.

Published : 21 Feb 2023 05:06 IST

‘మంచి ఉద్యోగం సాధిస్తే నా ఒక్కదానికే లాభం.. సేవామార్గంలోకి వెళితే పదిమందికీ సాయపడొచ్చు’.. అని నమ్మింది ఊహా మహంతి. దానికోసం తన భవిష్యత్‌ పక్కన పెట్టి, తాత, నాన్నలకు సేవా వారసురాలైంది. గిరిజనులు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పాతికేళ్ల అమ్మాయిని వసుంధర పలకరించగా తన గురించి పంచుకుందిలా..

తాతగారు మహంతి గణపతిరావు సర్పంచిగా చేశారు. రాజకీయాలు మాని నేరుగా ప్రజలకి సాయపడొచ్చని 1991లో ‘రూరల్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ ప్రారంభించారు. దాని ద్వారా అప్పట్లోనే మాఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో మద్య నిషేధాన్ని సాధించారు. ఆదివాసీల అభివృద్ధికీ కృషి చేశారు. ఆయన తదనంతరం బాధ్యతలను నాన్న సురేష్‌ మహంతి తీసుకున్నారు. మాది విజయనగరం జిల్లా గరుగుబిల్లి. అమ్మ సుధ, నాకో తమ్ముడు. లా పూర్తిచేశా. చిన్నప్పట్నుంచీ నాన్న, తాతలను చూసి నేనూ వాళ్ల బాటలోనే నడవాలనుకున్నా. అయిదేళ్లుగా మా సంస్థ ద్వారానే సేవలందిస్తున్నా.

గిరిజన గ్రామాల్లో కనీస వసతులూ కరవే! అక్కడ పర్యటిస్తున్నప్పుడు చిన్నపిల్లలు, ఆడవాళ్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అవసరం అనిపించింది. బ్యాగు, పుస్తకాలు కొనుక్కొనే స్థోమత లేక పిల్లలు చదువు మానేసేవారు. వారికోసం పుస్తకాలు, కలర్‌ పెన్సిళ్లే కాదు లంచ్‌బాక్స్‌, నీళ్ల సీసా వంటి 13 అత్యవసర వస్తువులతో ఏటా 1500 వరకు స్కూల్‌ బ్యాగులు అందిస్తున్నాం. గ్రామాల్లో సర్వే చేసి, ఆ వస్తువులను నిర్ణయించాం. నెలసరి శుభ్రతపై అవగాహన లేకపోవడం, ఆ సమయంలో ఎంతోమంది అమ్మాయిలు స్కూలు మానేయడం గమనించా. దీంతో అనారోగ్య సమస్యలే కాదు.. చదువులోనూ వెనకబడేవారు. వీటిపై అవగాహనతోపాటు శానిటరీ న్యాప్కిన్లనీ అందిస్తున్నాం. దీంతో విద్యార్థుల హాజరే కాదు.. ఉత్తీర్ణులవుతున్న వారి శాతమూ పెరిగింది. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ నిత్యావసర సరకులు, మందులు వంటివి అందించాం. వలసదారులకు వాహనాలూ, బస ఏర్పాటు చేశాం.

నేర్పించడమే కాదు..

చిన్న సమస్యలకీ ఎవరిని సంప్రదించాలో తెలియదిక్కడి గిరిజనులకు. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అక్రమ రవాణా, ఆడపిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మేయడం లాంటివీ ఎక్కువే! వీటిపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఉపాధి లేకపోవడమే అసలు సమస్య కాబట్టి, టైలరింగ్‌, బ్యూటీ, ఎలక్ట్రీషియన్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ల్లో శిక్షణిప్పిస్తున్నాం. ఉద్యోగ అవకాశాల్నీ చూపిస్తున్నాం. గ్రామాల్లో తిరిగి వారికి అవసరమైన వస్తువులు, మందులు వంటివీ పంపిణీ చేస్తుంటాం. వీటన్నింటికీ విదేశాల నుంచి వచ్చే నిధులే ఆసరా. బాల్య వివాహాలు ఇక్కడ సర్వసాధారణం. అధికారుల సాయంతో ఎన్నింటిని ఆపి ఉంటానో. కానీ.. చెప్పినంత సులువు కాదది. అవతలి వాళ్ల కోపాన్ని తట్టుకుంటూనే నచ్చజెప్పాలి. మొదట్లో భయమేసినా.. ఒకమ్మాయి భవిష్యత్తు ముందు భయం చిన్నదనిపించేది. వాళ్లలో ఒకరిలా కలిసిపోయి చిన్నవయసులో పెళ్లి, గర్భం కారణంగా వచ్చే అనారోగ్యాలను వివరిస్తుంటా. దీంతో వాళ్లూ అర్థం చేసుకుంటారు.

అలా అన్నవారే..

మొదట్నుంచీ టాపర్‌నే. చదువయ్యాక సేవ చేస్తానంటే ‘ప్రాక్టీస్‌ పెట్టుకోక ఎందుకివన్నీ? ఇంత చదువూ చదివి ఊళ్లు పట్టుకొని తిరుగుతావా’ అంటూ చాలామంది ప్రశ్నించారు. కానీ ఇంతమందికి సాయపడుతున్నానన్న ఊహే నాకు సంతృప్తినిస్తుంది. మొదటిసారి గిరిజన పిల్లలకు బ్యాగులిచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హత్తుకున్నారు. బాల్యవివాహాన్ని తప్పించుకున్న అమ్మాయిలు చూపే కృతజ్ఞత, వాళ్ల అమ్మానాన్నలు ‘మీ వల్లే మా అమ్మాయి బాగా చదువుకుంటోంది, ఉద్యోగం చేసుకుంటోంది’ అంటోంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఒకప్పుడు నన్ను వారించిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.  కలిసి పని చేస్తున్నారు కూడా. అదీ విజయమేగా! సివిల్స్‌ సాధించి.. సేవలను విస్తృతం చేయాలనుంది. గిరిజన ప్రాంతాలవాళ్లు.. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్లకాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయాలన్నది నా కోరిక.

- కె.మునీందర్‌, విజయనగరం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్