మహిళల వెతలకో.. పరిశోధనాశాల

నగరాల్లో ఆడవాళ్ల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇంటి గడప దాటినప్పట్నుంచీ ఏదో ఒక సమస్య వాళ్లని వెక్కిరిస్తూనే ఉంటుంది. రోడ్డుపై భద్రత కావచ్చు.. పని చేసేచోట వేధింపులు కావొచ్చు. ఇబ్బంది ఏదైనా వాటికి శాస్త్రీయంగా పరిష్కారం చూపి మహిళలకు భరోసాని అందించే ఓ అధ్యయన ప్రయోగశాలను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ తీసుకొచ్చింది.

Updated : 22 Feb 2023 07:11 IST

రాత్రిపూట ఆ బస్‌ స్టాప్‌లో ఒంటరిగా బస్‌కోసం ఎదురుచూడ్డం నావల్ల కాదు.. అబ్బాయిలు వెకిలి చేష్టలతో ఇబ్బందిపెడుతున్నారు! రద్దీ బస్సులో తాకరాని చోట తాకుతారు...  

ఎంత అత్యవసరం అయినా సరే ఇంటికి రావాల్సిందే!
అక్కడ టాయిలెట్లు వాడితే ఇన్‌ఫెక్షన్లతో చావడం పక్కా..

ఆ దారిలో వీధి దీపాలు ఉండవు. చంపేసినా దిక్కుండదు. అందుకే నైట్‌ డ్యూటీలు చేయలేక ఐటీ ఉద్యోగం వదులుకున్నా...

ఏడాది క్రితం జరిగిన సర్వేలో ఆడవాళ్లు చెప్పిన సమస్యలివి. పేర్లు, స్థలం మారుండొచ్చు కానీ దాదాపుగా అందరివీ ఇలాంటి సమస్యలే. వీటికి పరిష్కారం కోసం ప్రారంభమైందే జెండర్‌ అండ్‌ పాలసీ ల్యాబ్‌.. దేశంలోనే మొదటిసారిగా స్త్రీల సమస్యలపై స్పందించిన ఈ ల్యాబ్‌ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం రండి...  

గరాల్లో ఆడవాళ్ల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇంటి గడప దాటినప్పట్నుంచీ ఏదో ఒక సమస్య వాళ్లని వెక్కిరిస్తూనే ఉంటుంది. రోడ్డుపై భద్రత కావచ్చు.. పని చేసేచోట వేధింపులు కావొచ్చు. ఇబ్బంది ఏదైనా వాటికి శాస్త్రీయంగా పరిష్కారం చూపి మహిళలకు భరోసాని అందించే ఓ అధ్యయన ప్రయోగశాలను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ తీసుకొచ్చింది. దానిపేరు.. జెండర్‌ అండ్‌ పాలసీ ల్యాబ్‌. అసమానతల్ని దూరం చేస్తూ.. నగరంలో సమాన హక్కుని కల్పించే దిశగా ఈ వినూత్న ల్యాబ్‌ పనిచేస్తోంది.

రెండేళ్ల క్రితం చెన్నై నగరంలో... విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులపై ఒక సర్వే చేశారు. అందరివీ భిన్న అనుభవాలు. వీధుల్లో అబ్బాయిల వేధింపుల కారణంగా తల్లిదండ్రులు తన చదువును మాన్పించారని ఓ విద్యార్థిని ఏడ్చింది. బస్టాపులు సురక్షితంగా లేవని మరో ఉద్యోగిని తెలిపింది. ‘బస్సుల్లో ప్రయాణం కష్టంగా ఉంది. నుంచుని ప్రయాణం చేయలేం. ఎవరెక్కడ చేయి వేస్తారో తెలియదు’ అంటూ సర్వేచేసిన వాళ్లకు చెప్పారు. ఎంతోమంది ఆడవారికి చదువుకోవాలని ఉన్నా, ఉద్యోగం చేయాలని ఉన్నా... సమాజంలో ఎదురయ్యే ఇబ్బందికర సమస్యలు వాళ్లని వెనకడుగు వేయిస్తున్నాయని ఈ సర్వే తేల్చింది. ఒక్క చెన్నైలోనే కాదు ఇతర నగరాల్లోనూ 56శాతం మంది మహిళలు ప్రజా రవాణాలో లైంగిక వేధింపులకు గురవుతున్నామని వెల్లడించారు. దీనికి గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ యంత్రాంగం పరిష్కారం చూపించాలనుకుంది. ఈ క్రమంలో వచ్చిన ఆలోచనే ‘జెండర్‌ అండ్‌ పాలసీ ల్యాబ్‌’. 2021 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ల్యాబ్‌ను ప్రకటించి.. నిర్భయ ప్రాజెక్టులో భాగంగా 2022 ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకి తెచ్చారు.

అసౌకర్యాలపై ఆడిటింగ్‌...  

మహిళలకు అండగా నిలవాలనుకొనే ఈ ఆలోచనకు ప్రపంచబ్యాంకు సహకారం కూడా తోడయ్యింది. ‘నగరంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు అపెక్స్‌ కమిటీనే ఏర్పాటుచేశారు. ఇందులో గ్రేటర్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం, పోలీసు, రవాణా, ఆరోగ్య, మహిళా సాధికారత, విద్య.. ఇలా వివిధ శాఖల నుంచి ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. నగరంలోని అన్ని జోన్లలో పూర్తి స్థాయి పరిష్కారం చూపేలా ఈ ల్యాబ్‌కు 3ఏళ్ల గడువు అందించారు’ అంటున్నారు కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌, ఈ ల్యాబ్‌ బాధ్యతలు చూస్తున్న డి.స్నేహ. ఈ ల్యాబ్‌కోసం రూ.4కోట్లు కేటాయించారు. ఏడాదికాలంగా ఈ ల్యాబ్‌ చురుగ్గా పని చేస్తోంది. మహిళల వ్యక్తిగత, సామాజిక భద్రత మొదలుకొని ఆరోగ్యం, మహిళలపై వేధింపులు, నేరాలు ఇలా అన్ని కోణాల్లోనూ క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి యువతుల అభిప్రాయాలు సేకరిస్తుందీ ల్యాబ్‌. సర్వే నివేదికల ఆధారంగా ఆయా అంశాల్ని పాలకమండలి ముందుంచి పరిష్కారాల్ని రాబట్టేలా జెండర్‌ల్యాబ్‌ బాధ్యత తీసుకుంది. తొలివిడతగా నగరంలోని తండయార్‌పేటలో సర్వేచేశారు.

శిక్షణలతో చైతన్యం

అలాగే రైళ్లు, బస్టాపుల్లో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ల్యాబ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఒక్కో బ్యాచ్‌కు 10రోజుల పాటు మెలకువలు నేర్పుతున్నారు. ఎక్కువగా ఉద్యోగినులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆడపిల్లల్లో చైతన్యం కోసం వీధుల్లో నాటకాలు, పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ‘జెండర్‌ ల్యాబ్‌ సూచనల మేరకు శాఖలన్నీ సమష్టిగా పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుద్దీపాల్ని మెరుగుపరిచాం. సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నాం. ప్రజారవాణాని ఆడవారికి అనుకూలంగా ఉండేలా చూస్తున్నాం. రాత్రి సమయాల్లోనూ చెన్నై సురక్షితం అని చాటిచెప్పేలా సైక్లింగ్‌ కూడా చేపట్టాం. తరచూ సమీక్షలు చేస్తున్నాం’ అంటున్నారు చెన్నై మేయర్‌ ప్రియారాజన్‌.

-హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్