ప్రచారంతోనే...వ్యాపారం చేసేస్తున్నారు!

గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. ప్రతిరోజునీ మనమే గొప్పగా మార్చుకోవాలంటున్నారు నవతరం తారలు. ఇందుకోసం గ్లామర్‌ సూత్రాలనే కాదు... పొదుపు, మదుపు మంత్రాలనూ పఠిస్తున్నారు. 

Updated : 26 Feb 2023 07:31 IST

గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. ప్రతిరోజునీ మనమే గొప్పగా మార్చుకోవాలంటున్నారు నవతరం తారలు. ఇందుకోసం గ్లామర్‌ సూత్రాలనే కాదు... పొదుపు, మదుపు మంత్రాలనూ పఠిస్తున్నారు.  తమ ఇమేజ్‌ని బ్రాండ్‌గా మార్చుకుని ప్రకటనల ఆదాయాన్ని పెట్టుబడులుగా మార్చుకునేవారు కొందరైతే, తాము అందుకుంటోన్న పారితోషికాన్నే మదుపు చేసేవారు మరికొందరు. అలా... చాయ్‌ వ్యాపారం నుంచి సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థల వరకూ... అన్నింటా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు.


వీగన్‌ ఉత్పత్తులకు...

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను రష్మిక చక్కగా అనుసరిస్తోంది. తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక మందన్న గీతగోవిందంతో గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించుకుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ కన్నడ సుందరి...సంపాదించిన డబ్బుని మదుపు చేయడంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తోంది. ‘వీగన్‌ బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులకు ఇన్వెస్టర్‌గా మారింది. ‘ప్యాకేజింగ్‌ నుంచి ఫలితం వరకూ ఆకట్టుకోవడం వల్లే ఈ బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టా. వ్యక్తిగతంగా నచ్చితేనే కదా...దాని ఫలితం అర్థమయ్యేది’ అంటోంది రష్మిక.


లాక్‌డౌన్‌లో ప్లానింగ్‌..

బాక్సాఫీస్‌, సోషల్‌ మీడియా... ఫ్లాట్‌ఫాం ఏదైనా సరే కృతిసనన్‌ అభిమానులను ఎప్పటికప్పుడు కొత్తగా అలరిస్తూనే ఉంటుంది. నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి...ప్రభాస్‌కి జోడీగా ఆదిపురుష్‌లో నటిస్తోంది. మిమి, దిల్‌వాలే, హీరోపంతి2...వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తన సత్తా చాటిన ఈ సుందరికి ఫ్యాషన్లన్నా, ఫిట్‌నెస్‌ అన్నా మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే ఇందులో ఒకదాన్ని వ్యాపారంగా ఎంచుకుంది. అదే తన కలల ప్రాజెక్టు ‘ది ట్రైబ్‌’. తన స్నేహితులు అనుష్క నందాని, కరణ్‌ సాహ్ని, రాబిన్‌ బెహ్ల్‌లతో కలిసి ఈ ఫిట్‌నెస్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. ‘మిమి సినిమాకోసం పదిహేను కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. అప్పుడే నా మనసులో ఫిట్‌నెస్‌ వ్యాపారంలోకి రావాలన్న ఆలోచన వచ్చింది. దీనిపై దృష్టి పెట్టడానికి లాక్‌డౌన్‌ కాలం కలిసి రావడంతో గతేడాది దీన్ని ప్రారంభించా’ అంటోంది కృతి. ఇన్‌స్టూడియో, పర్సనల్‌, గ్రూప్‌, వర్చువల్‌ విధానంలో ఈ సంస్థ వ్యాయామ పాఠాలు చెబుతోంది.


బయోలెదర్‌ నుంచి... మెటర్నిటీ వేర్‌ వరకూ...

ర్‌ఆర్‌ఆర్‌ ద్వారా తెలుగు ప్రజలకు చేరువైన సీత (అలియాభట్‌)కు పెట్టుబడులపై మంచి పట్టుంది. బ్రాండెడ్‌ వస్తువుల్ని లక్షలు పోసి కొనడమే కాదు.. బ్రాండ్‌ ఇమేజ్‌తో లాభాల్నీ ఆర్జించొచ్చని నిరూపించినవారిలో అలియా ఒకరు. వ్యాపారమే కాదు...సామాజిక ప్రయోజనాలనూ పట్టించుకునే అలియా... కాన్పూర్‌ ఐఐటీ మద్దతుతో నడుస్తోన్న స్టార్టప్‌ ‘పూల్‌’లో పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థ వినియోగించిన పూలతో బయోలెదర్‌, అగర్‌ బత్తీలు తయారు చేస్తోంది. అలానే ఓమ్నీ ఛానెల్‌, నైకా, స్టైల్‌క్రాకర్‌ వంట లైఫ్‌స్టైల్‌ విభాగాల్లోనూ ఇన్వెస్ట్‌ చేసింది. ఇప్పటికే...‘ఎడ్‌-ఎ- మామ్మా’ పేరుతో చిన్నపిల్లల దుస్తుల ప్లాట్‌ఫాంనీ నిర్వహిస్తోన్న అలియా... త్వరలో మెటర్నిటీ వేర్‌నీ అందుబాటులోకి తీసుకురానుంది. ‘మహిళలు వ్యాపార రంగంలోకి రావడం అరుదు. అందుకే, నా తోటి నటీమణులైనా, ఇతర స్త్రీలెవరైనా సరే.. కొత్తగా ఏదైనా చేస్తుంటే నా వంతు మద్దతిస్తా. ప్రచారమూ చేస్తా’ అంటోంది అలియా.


టీ వ్యాపారంలోనూ...

బ్బు సంపాదించడమే కాదు...దాన్ని సమర్థంగా నిర్వహించినప్పుడే...భవిష్యత్తు బాగుంటుందని నమ్మే తారల్లో నయనతార ముందుంటుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే... మరోవైపు వివిధ వ్యాపారాల నిర్వహణ చూసుకుంటూ మల్టీ టాస్కింగ్‌ చేసేస్తోంది. స్కిన్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ అయిన తన స్నేహితురాలు రేణితా రాణితో కలిసి ‘ది లిప్‌ బామ్‌ కంపెనీ’ స్థాపించి సౌందర్య ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టింది. ఇంతకుముందే చెన్నైకి చెందిన ‘ఛాయ్‌వాలె’లో విఘ్నేశ్‌తో కలిసి పెట్టుబడులు పెట్టిన నయన్‌.... భర్తతో కలిసి ‘రౌడీ పిక్చర్స్‌’ పేరుతో సొంత ప్రొడక్షన్‌ కంపెనీ ఏర్పాటు చేసింది. దీనిద్వారా వెబ్‌సిరీస్‌, ఫీచర్‌, యాడ్‌ ఫిల్మ్స్‌ని నిర్మిస్తూ తన కలల్నీ, అభిరుచుల్నీ సాకారం చేసుకుంటూ ఆదాయం పెంచుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్