అమ్మాయిలటెక్‌ సత్తా

అమ్మాయిలు ఇన్‌ఫ్లుయెన్సర్లు అనగానే ఫ్యాషన్‌, బ్యూటీ విశేషాలే అనుకునే రోజులు కావివి. తక్కువమంది ఉంటారనుకునే సాంకేతిక విభాగంలోనూ మన హవా పెరుగుతోంది.

Updated : 05 Mar 2023 08:33 IST

అమ్మాయిలు ఇన్‌ఫ్లుయెన్సర్లు అనగానే ఫ్యాషన్‌, బ్యూటీ విశేషాలే అనుకునే రోజులు కావివి. తక్కువమంది ఉంటారనుకునే సాంకేతిక విభాగంలోనూ మన హవా పెరుగుతోంది. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి గ్యాడ్జెట్లు.. వాటి పనితీరు.. ఏమేం గమనించుకోవాలో సలహాలిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. లక్షలమంది అభిమానుల్నీ సంపాదించుకుంటున్నారు.


పల్లెటూరి అమ్మాయి..

2017.. కిరణ్‌ నాగర్‌ ‘టెక్‌’ ఛానెల్‌ ప్రారంభించినప్పుడు చాలామంది ‘నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు. అందంగా ఉన్నావ్‌. హాయిగా ఏ బ్యూటీ చిట్కాలో చెప్పుకోవచ్చుగా’ అని సలహాలిచ్చేవారు. కానీ తనమీద తనకున్న నమ్మకం ఆమెను దాదాపు 7 లక్షలమందికి చేరువ చేసింది. పుట్టుకతోనే కిరణ్‌కి చేతివేళ్లు సరిగా ఉండేవికాదు. నాన్న రైతు. కూతురి భవిష్యత్తు బాగుండాలంటే మంచి విద్య అందించడమే మార్గమని నమ్మారు. వీళ్లది రాజస్థాన్‌లోని చిన్న పల్లె. తనకు మూడేళ్లున్నప్పుడు కోటాలో ఉంచి చదివించారు. అందరూ తన వైకల్యాన్ని చూసి జాలిపడటం కిరణ్‌కి నచ్చేది కాదు. అందుకే నిరూపించుకోవాలని తపన పడేది. ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించింది. అయినా ఏదో లోటు. అప్పుడే యూట్యూబ్‌ పరిచయం అయ్యింది. తనకు పట్టున్న మొబైల్‌, కంప్యూటర్‌ అంశాలపైనే చిట్కాలు, రివ్యూలు చెప్పేది. మొదట్లో అవమానాలు ఎదురైనా తర్వాత అనుసరించేవారు పెరిగారు. ఇయర్‌ బడ్స్‌ నుంచి స్మార్ట్‌వాచ్‌లు, ఫోన్లు, టీవీలు అన్నింటిపై రివ్యూలు.. వాడే విధానం, లాభనష్టాలన్నింటినీ వివరంగా చెబుతుంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్‌నీ నిర్వహిస్తూ వచ్చిన కిరణ్‌ తాజాగా రాజీనామా చేసి, సొంత స్టూడియోనూ ఏర్పాటు చేసుకుంది.


ఎనిమిదేళ్లకే సంపాదన..

సాధారణ వ్యక్తి ఫోన్‌ కొనేప్పుడు ఏమేం చూస్తాడు? ధర, దానికి తగ్గ విలువ. వీటిపైనే దృష్టిపెడుతుంది నితిషా సింగ్‌! దిల్లీలో స్థిరపడిన పంజాబీ అమ్మాయి! చదివింది న్యూట్రిషన్‌ విద్య. క్లినికల్‌ న్యూట్రిషనిస్టుగా ఉద్యోగం చేస్తున్న తనకు గ్యాడ్జెట్లు, గేమింగ్‌ అన్నా ఆసక్తి. తన ఎనిమిదో ఏట నుంచే ట్యూషన్లు, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల ద్వారా సంపాదించడం మొదలుపెట్టింది. ఆ ఆదాయాన్ని దాచి కొంత మొత్తమయ్యాక నచ్చిన మొబైళ్లు కొని.. 2016 చివర్లో యూట్యూబ్‌ ఛానెల్‌ ‘ద న్యూట్రి గర్ల్‌’ ప్రారంభించింది. ఫోన్‌లోని ప్రధాన ఫీచర్ల దగ్గర్నుంచి వాటర్‌ ప్రూఫ్‌, త్వరగా వేడెక్కడం వంటి వాటన్నింటినీ వివరిస్తుంది. అంతేకాదు.. ఇతర మొబైళ్లనూ పోలుస్తుంది. దీంతో వినియోగదారులకు నిర్ణయం తీసుకోవడం సులువు. దీనికోసం ఒక్కోఫోన్‌ను 8-10 గంటలు పరీక్షిస్తుందట. అంత శ్రద్ధ చూపుతుంది కనుకే ఆమెను అనుసరించేవారి సంఖ్య 15 లక్షలకు పైమాటే! వీడియోగేమ్‌లు, తన పర్యటనలు, ఆహార పోషక విలువలపై చిట్కాలకూ ప్రత్యేక ఛానళ్లున్నాయీమెకు. వాటిని అనుసరించేవారూ లక్షల్లోనే!


తెలుగుకి దగ్గరవ్వాలనీ..

వేంకటేశ్వరస్వామి సుప్రభాతంతో హర్షిబర్‌ ఉదయం మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ఇది సాధారణమేగా అనిపిస్తుంది కదూ! కానీ హర్షిబర్‌ అమెరికాలో పెరిగిన తెలుగమ్మాయి. తన చిన్నతనంలోనే వాళ్ల కుటుంబం అమెరికాలో స్థిరపడింది. చిన్నప్పుడు తనలాంటి వాళ్లు చుట్టూ ఉండకపోవడం, తన శరీరఛాయను వింతగా చూసే అమెరికన్‌ పిల్లలతో కలవలేకపోయేదట. తర్వాత వాళ్ల కుటుంబం షికాగోకి మారాక తెలుగు ప్రజలు, స్నేహితుల మధ్య తన జీవితం ఆనందంగా గడిచిందంటుందీ అమ్మాయి. తెలుగు భోజనం, సినిమాలు అంటే ఇష్టపడే తనకు భాషపై పట్టు మాత్రం అంతంతమాత్రమే! ఎప్పుడు భారత్‌కి వస్తున్నా హర్షిబర్‌ చాలా ఆనందించేదట. కానీ ఇక్కడివాళ్లేమో అమెరికా అమ్మాయిలా చూస్తోంటే మాత్రం బాధనిపించేది. తను ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌. తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు.. భాష నేర్చుకుంటూనే టెక్‌ వివరాలను పంచుకోవచ్చని ‘హర్షిబర్‌’ పేరుతోనే 2019లో యూట్యూబ్‌లోకి వచ్చింది. కోడింగ్‌, టెక్‌ ప్రత్యామ్నాయాలు, గ్యాడ్జెట్లపై సలహాలు, సూచనలిస్తుంది. తన సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో అక్కడక్కడా వచ్చీరాని తెలుగు జోడిస్తూ సులువుగా నేర్పిస్తోంది. ఫాలోయర్లను పెంచుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్