జీవితాలకు రంగులద్దారు!

హోలీ పండుగలో మనం వాడే రసాయన రంగులు ఏ మేరకు సురక్షితం... ఎవరైనా చెప్పగలమా? ఇదే ఆలోచన వీళ్ల స్టార్టప్స్‌కు పునాదైంది.

Updated : 07 Mar 2023 00:26 IST

హోలీ పండుగలో మనం వాడే రసాయన రంగులు ఏ మేరకు సురక్షితం... ఎవరైనా చెప్పగలమా? ఇదే ఆలోచన వీళ్ల స్టార్టప్స్‌కు పునాదైంది. వ్యాపారమే కాదు... పర్యావరణ సంరక్షణా వీళ్ల బాధ్యత అనుకున్నారు. రెండింటిని జోడిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరి ఈ రంగుల తయారీ వెనుక ఉన్న ఆ కథ ఏంటో తెలుసుకుందామా...?


పూల రంగులు..

లండన్‌లోని కోవెంటో విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్‌లో పట్టా పొందిన కావేరీ దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలను ఒక వేదికపైకి తీసుకురావాలని మై పూజా బాక్స్‌ను ప్రారంభించింది. పర్యావరణ హితానికి ప్రాముఖ్యమిచ్చే ఈ సంస్థ హోలీ వస్తే పూలతో చేసిన సేంద్రియ రంగులను తయారు చేసి దేశవ్యాప్తంగా విక్రయిస్తుంది. వేడుక ఏదైనా పర్యావరణహితంగా జరిగేలా ఉత్పత్తుల్ని రూపొందిస్తోంది. ప్రముఖ సంస్థల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌ హెడ్‌గా పనిచేసిన కావేరికి అవి సంతృప్తి నివ్వలేదు. అంతరించిపోతున్న గ్రామీణ కళలను కాపాడాలనుకుంది. 2018లో ఈ సంస్థను నెలకొల్పి.. గ్రామీణ మహిళలకు ఉపాధినిస్తోంది. దేశంలోని భిన్న సంప్రదాయలకు తగ్గట్టుగా 4 వేల ఉత్పత్తులు అందిస్తోంది. అవసరాలకు తగిన విధంగా పూజ బాక్స్‌ను అలంకరించడం ఈ సంస్థ ప్రత్యేకత.


అలియా మెచ్చిన ఆలోచన

ఫూల్‌... సేంద్రియ రంగులను తయారు చేస్తుందీ సంస్థ. గుళ్లు, నదుల నుంచి ఏడాదంతా సేకరించిన పూల వ్యర్థాలతో ఇక్కడ వేడుకల్లో ఉపయోగించేందుకు కావాల్సిన రంగులు తయారు చేస్తున్నారు.  జంతురక్షణ  దృష్టిలో పెట్టుకుని బయో లెదర్‌ను తయారు చేయాలనే ఈ సంస్థ ఆలోచనలకు ఫిదా అయిపోయి, పెట్టుబడిదారుగా మారింది నటి అలియాభట్‌. ఇవే కాకుండా పూజా సుగంధ ద్రవ్యాలు, దూప్‌స్టిక్స్‌, అగరొత్తులు వంటి మూడు వేల ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్పత్తులన్నింటినీ మహిళలే తయారుచేయడం విశేషం.


పర్యావరణంపై ప్రేమతో...

మీనాక్షి కిషోర్‌ మధ్యతరగతి అమ్మాయి. కష్టపడి చదివి ముంబయిలో మంచి ఉద్యోగం సాధించింది. కానీ  పట్టణ వాతావరణంలో ఉండలేకపోయింది. తనున్న ప్రాంతంలో కాలుష్యంతో రోగాల బారిన పడిన వారిని చూసి.. తిరిగి తన ఊరికి వచ్చేసింది. వ్యవసాయం చేయాలనుకుంది. లక్షలు వచ్చే ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తావా? నీవల్లేం అవుతుందంటూ నిరుత్సాహ పరిచారు. బ్యాంకులూ రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. రెండేళ్ల తరువాత తన అక్క సహాయంతో మధుర - ఆగ్రా సరిహద్దులోని 40 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టింది. తోటి రైతులకూ ఈ విధానం పరిచయం చేసి ఫ్లోరీ కల్చర్‌ను ప్రోత్సహించి, రైతుల నుంచి పువ్వులు సేకరిస్తోంది. వినియోగించిన పూలతోనూ రంగులను తయారు చేస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా ఈమె అందించే హోలీ ఉత్పత్తులకు విశేషమైన ప్రజాదరణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్