చెత్తతో.. రూ.వెయ్యి కోట్ల వ్యాపారం!

ఉద్యోగం చేయాలి.. సొంతంగా సంపాదించుకోవాలి.. ఇదీ పూనమ్‌ గుప్తా కోరిక! ఆర్థిక కష్టాల్లేవు! కానీ చదువు కొనసాగించడానికే ఎన్నో కష్టాలు పడ్డారు. ‘అమ్మాయి.. సంపాదించాల్సిన అవసరమేంట’న్న తీరు ఆ ఇంట్లోవాళ్లది!

Updated : 17 Mar 2023 07:31 IST

ఉద్యోగం చేయాలి.. సొంతంగా సంపాదించుకోవాలి.. ఇదీ పూనమ్‌ గుప్తా కోరిక! ఆర్థిక కష్టాల్లేవు! కానీ చదువు కొనసాగించడానికే ఎన్నో కష్టాలు పడ్డారు. ‘అమ్మాయి.. సంపాదించాల్సిన అవసరమేంట’న్న తీరు ఆ ఇంట్లోవాళ్లది! పెళ్లయ్యాకైనా కోరిక నెరవేర్చు కుందామంటే అనుభవం లేదని సంస్థలు తిరస్కరించాయి. అసలు ఉద్యోగం ఎందుకు? నేనే నలుగురికీ ఉద్యోగావకాశం కల్పిస్తే.. అన్న ఆలోచనతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.

‘కలిగిన కుటుంబంలో పుట్టినమ్మాయివి.. పెళ్లి చేసుకొని ఇంకో పెద్ద కుటుంబంలోకి వెళితే జీవితాంతం కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చు!’ చిన్నప్పట్నుంచీ ఈ సలహాల మధ్యే పెరిగారు పూనమ్‌! ఈమెది దిల్లీ. నాన్న వ్యాపారవేత్త. నలుగురు తోబుట్టువుల్లో ఒక్కతే అమ్మాయి. దీంతో గారాబం ఎక్కువే. అమ్మ, బంధుగణంలో స్త్రీలెవరైనా ఇంటికే పరిమితమవడం గమనించారామె. వాళ్లలా కాకుండా సొంత కాళ్లపై నిలబడాలన్నది ఆమె కల. కానీ ఇంటర్‌ నుంచే పెళ్లి ప్రస్తావనలు మొదలయ్యాయి. మొదట్నుంచీ ర్యాంకర్‌! దీంతో అమ్మానాన్నల్ని తేలిగ్గానే ఒప్పించగలిగారు. అలా ఎకనామిక్స్‌లో బీఏ, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అండ్‌ మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. చదువయ్యాక ఎంఎన్‌సీలో చేరదామనుకునేలోగా ఇంట్లో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఈసారి తల వంచక తప్పలేదు. భర్త పునీత్‌ గుప్తా మేనేజర్‌. వీళ్ల కుటుంబం స్కాట్లాండ్‌లో స్థిరపడింది. భర్తతో ఉద్యోగం చేయాలన్న కోరికను చెబితే ఆయన సరేనన్నారు. ఎంత ప్రయత్నించినా అనుభవం లేదని తిరస్కరించేవారు. దానికోసమే ఓ ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ సంస్థలో కొన్నాళ్లు జీతం లేకుండా పనిచేశారు. అప్పుడే వ్యాపారం చేస్తే నిరూపించుకోవడమే కాదు.. నలుగురికీ ఉపాధి ఇచ్చినట్లూ అవుతుంది అనిపించి  పరిశోధన మొదలుపెట్టారు.

పెట్టుబడీ సొంతంగానే!

‘భారతీయ సంప్రదాయంలో పనికి రాదని పడేయడం ఉండదు. తిరిగి ఎలా ఉపయోగించాలా అనే ఆలోచిస్తాం. అదే నా వ్యాపార మార్గమైంది. మేముండే దగ్గర ఓ సంస్థ ఉంది. వాళ్లు ‘స్క్రాప్‌ (చెత్త)’ పేరుతో పక్కన పెట్టిన పేపర్‌ నాణ్యత చాలా బాగుంది. కొంచెం రీసైకిల్‌ చేస్తే వార్తాపత్రికలు, మేగజీన్లు, ప్యాకేజింగ్‌ ఇలా ఎన్నింటికో ఉపయోగించొచ్చు. ఈ ఆలోచన తట్టాక 2003లో ‘పీజీ పేపర్‌ కంపెనీ’ ప్రారంభించా. ఇలాంటి సంస్థలను సంప్రదించి వాళ్లు పక్కనపెట్టిన పేపర్‌ నాకిమ్మన్నా. సమస్యల్లా మెషినరీతోనే’ అంటారు పూనమ్‌. ఇంట్లో వాళ్ల నుంచి తీసుకోవడం ఇష్టం లేక అక్కడి ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష వచ్చాయి. దాంతో మెషినరీ కొని ఇటలీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. మొదటి ఆర్డరు విలువే రూ.40లక్షలు. ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు సంస్థ విలువ రూ.1000 కోట్ల లోపు! ఈ ఉత్సాహంతో మరిన్ని సంస్థలనూ నెలకొల్పారామె.

సాయంలోనూ ముందే

‘పెళ్లైన కొత్తలో అమ్మ చనిపోయింది. నేనూ ప్రెగ్నెన్సీలో బోన్‌ ట్యుబర్కిలోసిస్‌తో ఇబ్బంది పడ్డా. 18 నెలలు చక్రాల కుర్చీకే పరిమితమయ్యా. ఇంట్లో అందరి గురించీ పట్టించుకునే ఆడాళ్లు వాళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే గుప్తా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించి భారత్‌, యూకేల్లోని అనాథలకు విద్య, మహిళలు, చిన్నారుల అనారోగ్య సమస్యలపై పనిచేస్తున్నా’ననే పూనమ్‌ మహిళల స్టారప్‌లకు పెట్టుబడులూ అందిస్తున్నారు. ఎన్నో దేశ, విదేశీ పురస్కారాలు అందుకున్నారు. 2016లో ఇంగ్లాండ్‌ రాణి నుంచి ప్రశంసలందుకున్న ఆవిడ.. కొవిడ్‌ సమయంలో మందులు, కాన్సన్‌ట్రేటర్లు అందించి ప్రధానినీ మెప్పించారు.


భారత్‌, చైనా, అమెరికా, దుబాయ్‌, ఈజిప్ట్‌, స్వీడన్‌ సహా 60 దేశాలకు పేపర్‌ ఎగుమతి చేస్తున్నారు. పది దేశాల్లో ఆమె ఆఫీసులున్నాయి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్