కల నెరవేరడంలో కిక్‌ ఉంది...

బాల్యం నుంచి పర్వతశ్రేణులంటే ఆమెకు ప్రేమెక్కువ. అదే ఆమెను పర్వతారోహకురాలిని చేసింది. తాజాగా ఎవరెస్టు పర్వతాన్నెక్కిన ఈమె, ప్రస్తుతం కొత్త ఛాలెంజ్‌ను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యారు.

Updated : 02 Apr 2023 07:30 IST

బాల్యం నుంచి పర్వతశ్రేణులంటే ఆమెకు ప్రేమెక్కువ. అదే ఆమెను పర్వతారోహకురాలిని చేసింది. తాజాగా ఎవరెస్టు పర్వతాన్నెక్కిన ఈమె, ప్రస్తుతం కొత్త ఛాలెంజ్‌ను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యారు. కలలను నెరవేర్చుకోవడంలోనే కిక్‌ ఉందంటున్న ప్రకృతివర్షిణి స్ఫూర్తి కథనమిది.   

న ప్రతి కలనూ ఆశయంగా మలుచుకున్నారు ప్రకృతి. చిన్నప్పటి నుంచి శిఖరాలంటే ఆమెకిష్టం. స్కూల్‌లో చదివేటప్పుడే ఎప్పటికైనా ఎవరెస్టును అధిరోహించాలి అనుకునేవారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆ పర్వతాన్నెక్కడమే తన ధ్యేయంగా భావించేవారు. కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలనేది ఈమె సిద్ధాంతం. తన పేరుకు తగినట్లే ప్రకృతిలో విహరించాలని ఉండేది. డిగ్రీ పూర్తిచేసి, గ్రాఫిక్‌ డిజైనర్‌గా ఉద్యోగంలో చేరారు. వీలున్నప్పుడల్లా నచ్చిన ప్రాంతాలను చుట్టి వచ్చేవారు. 

విమర్శించారు..

‘ఓసారి టూర్‌కెళ్లినప్పుడు పర్వతారోహణ నేర్చుకోవాలనిపించింది. అప్పుడే కదా.. ఎవరెస్టునెక్కాలనే చిన్ననాటి కలను నెరవేర్చుకోగలనని అనుకున్నా. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటివరకు నేను పొదుపు చేసిన నగదుతో మనాలి బయలుదేరా. అక్కడ మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తిచేసి ఎవరెసు ్టనెక్కడానికి ప్రయత్నాలు ప్రారంభించా. దీనికి మొత్తం రూ.30 లక్షలు అవసరమవుతాయని తెలిసింది. అంత డబ్బు నావద్ద లేదు. ఓ ప్రయత్నం చేద్దామనిపించి ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించా. నా కలను వివరిస్తూ చేయూతనివ్వాలని కోరా. కొందరు నన్ను విమర్శించారు. ‘నీ కలల కోసం ఇతరుల నుంచి నగదు తీసుకుంటున్నావు, స్వార్థపరురాలివి’ అన్నారు. మరికొందరు దాతలు మాత్రం ముందుకొచ్చి రూ.11.5 లక్షలు సాయం చేశారు. మిగతాదాన్ని స్నేహితులు, బంధువుల నుంచి అప్పుగా తీసుకున్నా. అలా గతేడాది మార్చిలో బేస్‌ క్యాంపు చేరుకొని, 65 రోజుల్లో నేపాల్‌లోని అమా డబ్లమ్‌ శిఖరాగ్రాన్నెక్కగలిగా. అలా నా ఎవరెస్టు పర్వతారోహణ లక్ష్యాన్ని చేరుకున్నా. శిఖరంపై నిలబడి చుట్టూ చూసినప్పుడు నా చిన్నప్పటి కలను సాధించాననే ఆనందంతో గర్వంగా  అనిపించింది. అనుకున్నదాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని లక్ష్యాన్ని చేరుకోగలిగా’నంటారీమె.

మళ్లీ మొదలైంది..

ఎవరెస్టు పర్వతారోహణ తర్వాత ప్రకృతికి సాహసం చేయడంలో దొరికే ఆనందమేంటో తెలిసింది. దాంతో కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించారీమె. అదే ‘12 దేశాల్లో 12 పర్వతాలెక్కాల’నే ఆశయం. కెన్యా, టాంజానియా, యుగాండాలోని పర్వతారోహణ పూర్తయింది. ‘ఇప్పుడు ఇండియాలోనే అతి ఎత్తైన కాంచనజంగ నా లక్ష్యం. ఇప్పుడు నా చేతిలో పైసా లేదు. అయినా దీన్ని సాధిస్తాననే నమ్మకం మాత్రం ఉందం’టూ తన ఆశయంతో మళ్లీ అడుగేయడం మొదలుపెట్టిన ప్రకృతికి ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్