ఒక్క పాట.. అందరి నోటా!
సినిమాల్లో పాటలూ భాగం అనే రోజులు కావివి! ఒక్క పాటతో సినిమాకి ప్రచారం కల్పిస్తూనే అంచనాలు పెంచేస్తున్నారు. అంతేనా.. బోలెడు మంది అభిమాన గణాన్నీ పెంచేసుకుంటున్నారు కొందరు గాయనీమణులు.
సినిమాల్లో పాటలూ భాగం అనే రోజులు కావివి! ఒక్క పాటతో సినిమాకి ప్రచారం కల్పిస్తూనే అంచనాలు పెంచేస్తున్నారు. అంతేనా.. బోలెడు మంది అభిమాన గణాన్నీ పెంచేసుకుంటున్నారు కొందరు గాయనీమణులు. ఒక్కపాటతో.. అలా ట్రెండ్‌గా మారిన కొందరిని మీరూ పరిచయం చేసుకోండి.
స్టార్లూ ఫాలో అవుతున్నారు!
బేబి సినిమాలో ‘దేవరాజ’ అంటూ సాగే పాట నాలుగు రోజుల్లోనే 21 లక్షలమందిని ఆకర్షించింది. శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఆ పాట పాడిందెవరా అని ఆన్‌లైన్‌లో తెగ వెదికారు. ఆర్యా దయాళ్.. స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసి ఎంఎన్‌సీ కొలువులో స్థిరపడాలనుకుంది. ఇంతలో వచ్చిన లాక్‌డౌన్ ఈ కేరళ అమ్మాయి కెరియర్‌నే మార్చింది. ఆరేళ్ల వయసు నుంచే కర్ణాటక సంగీతం నేర్చుకుంది తను. కవితలు రాయడం, పాటలు రూపకల్పన నచ్చిన వ్యాపకాలు. స్కూలు, కళాశాల స్థాయుల్లోనే కాదు.. యూత్ ఫెస్ట్‌ల్లోనూ ఎన్నో బహుమతులు గెలుచుకుంది. కానీ ఈ రంగంలో స్థిరపడాలనుకోలేదు ఆర్య. కరోనాలో ఖాళీ సమయం దొరకడంతో సంగీత సాధన చేసేది. కర్ణాటిక్ సంగీతానికి పాశ్చాత్య హంగులద్దడం ఈమె ప్రత్యేకత. అలా మలయాళ, తమిళ పాటల కవర్ సాంగ్‌లతోపాటు తను రాసి, కంపోజ్ చేసిన వాటినీ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేసేది. ఓ ప్రముఖ పాటమీద చేసిన కవర్‌సాంగ్ వైరలైంది. అలా సినిమాతోపాటు, కాన్సర్ట్‌ల అవకాశాలూ వచ్చాయి. ఈఏడాది కన్నూర్‌లో నిర్వహించిన ఇండీగాగాలో లైవ్ ప్రదర్శననీ ఇచ్చిన ఆర్య.. తమిళ, మలయాళ సినిమాలకు పాటలు పాడింది. ఓ తెలుగు డబ్బింగ్ సినిమాకీ పనిచేసింది. కానీ.. ఈ పాటతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్టూ సినిమాల్లోకి రాకముందే తన కవర్ సాంగ్‌తో అమితాబ్ బచ్చన్, హరిహరన్ వంటి ఎంతోమంది స్టార్లను ఆకర్షించింది. వీళ్లే కాక ఎంతోమంది సంగీత కళాకారులు, దర్శకులు ఆమెను ఇన్‌స్టాలో అనుసరిస్తున్న వారిలో ఉన్నారు.
కంటతడి పెట్టించి..
బలగం సినిమా ‘తోడుగా మా తోడుండి’ పాట విన్న వారెవరికైనా కళ్లు చెమర్చడం ఖాయం. సినిమాలోనే కాదు.. నిజజీవితంలోనూ కొమురమ్మ వృత్తి అదే! బుడగ జంగాల గాయకురాలామె. తెలంగాణలోని దుగ్గొండి ఈమెది. భర్త మొగిలయ్యతో కలిసి తంబూర, దిమ్మెస వాయిస్తూ పాటలు పాడుతుంది. ‘నీకు ఇదే జీవనాధారం అవుతుంది నేర్చుకో..’ అని వాళ్లమ్మ పట్టుబట్టి దిమ్మెస వాయించడం నేర్పారట. అక్షరజ్ఞానం లేదు కానీ జీవితాలను చదివారామె. ఊరూరా తిరుగుతూ వేషాలు కట్టి ప్రదర్శించేవారు. ప్రత్యేక కార్యక్రమాలు, చావులు, దినాలప్పుడు అప్పటికప్పుడు పాటకట్టి పాడతారు. కుటుంబ అనుబంధాలు, విలువలను గుర్తుకు తెచ్చేలా సాగే ఈమె పాట విన్నవాళ్లెవరికైనా కంటతడి పెట్టిస్తుంది. దూరమైన బంధాల్ని పాటతో కలిపిన సందర్భాలూ ఎన్నో. వీళ్ల గురించి ఎవరి ద్వారానో విని దర్శకుడు వేణు అవకాశమిచ్చారు. ఆ చిత్రం చివర్లో భర్తతో కలిసి పాడిన పాట ప్రేక్షకులందరినీ కదిలించింది. ఈమెని ప్రపంచానికీ పరిచయం చేసింది.
14 ఏళ్ల వయసుకే..
జానపద గీతాలకు ఈమధ్య కాలంలో ప్రాధాన్యం బాగా పెరుగుతోంది. దసరా సినిమాలో ‘చమ్కీల అంగీలేసి’ అంటూ సాగే పాటను విని కొత్త జానపద కళాకారిణి తెరమీదకి వచ్చింది అనుకున్నారంతా. తీరా చూస్తే తను దీక్షితా వెంకటేశన్! ఈమె ‘దీ’గా సినీరంగంలో ప్రసిద్ధి. తమిళమ్మాయి. అమ్మ, అమ్మమ్మ సంగీత కళాకారులైనా ఆమె వాళ్ల దగ్గర నేర్చుకున్నదేమీ లేదు. చిన్నతనంలో అమెరికన్ ఆల్బమ్ ‘డెస్టినీస్ చైల్డ్’ విన్నాక సంగీతంపై ఆసక్తి కలిగింది. చదువు పక్కనపెట్టి 14 ఏళ్ల వయసులో నేపథ్య గాయనిగా మారింది. తన ప్రత్యేక గొంతుతో అందరినీ ఆకర్షించిన దీ.. తండ్రి సంతోష్ నారాయణ్‌తోపాటు ఏఆర్ రెహమాన్‌తోనూ కలిసి పనిచేస్తోంది. ప్రైవేటు ఆల్బమ్‌లకీ పాడుతోంది. స్నేహితుడితో కలిసి చేసిన ‘ఎంజాయ్ ఎంజామీ’కి నలభై కోట్ల వీక్షణలున్నాయి. ‘ఓ సక్కనోడా’, ‘రౌడీ బేబీ’ పాటలతో తెలుగులో ఇప్పటికే గుర్తింపు సాధించినా.. పూర్తిగా తెలంగాణ యాసలో సాగే చమ్కీల అంగీలేసి పాటతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.