ఇళ్లకు.. పచ్చదనం అద్దుతోంది!

ఆమె అందమైన భవనాలు నిర్మించే ఆర్కిటెక్ట్‌. కానీ తన పని పర్యావరణ హితంగా ఉండాలని భావించింది. అందుకే ప్రకృతికి హానిచేయని పద్ధతుల్లో భవనాలు నిర్మించడమే కాదు అటువంటి కట్టడాలను ప్రచారం చేస్తోంది. తనే బెంగళూరుకు చెందిన మేధ ప్రియ. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

Published : 24 Apr 2023 00:29 IST

ఆమె అందమైన భవనాలు నిర్మించే ఆర్కిటెక్ట్‌. కానీ తన పని పర్యావరణ హితంగా ఉండాలని భావించింది. అందుకే ప్రకృతికి హానిచేయని పద్ధతుల్లో భవనాలు నిర్మించడమే కాదు అటువంటి కట్టడాలను ప్రచారం చేస్తోంది. తనే బెంగళూరుకు చెందిన మేధ ప్రియ. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

‘2013లో బంగ్లాదేశ్‌లో ‘రానా ప్లాజా’ అనే ఎనిమిది అంతస్థుల భవనం కూలి వెయ్యి మందికి పైగా మరణించారు. చాలామంది గాయపడ్డారు. భవన నిర్మాణంలో ఉపయోగించిన సరకు నాణ్యమైనది కాకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన నన్నెంతో కలచివేసింది. అప్పుడే నా ఇంటర్మీడియట్‌ అయిపోయింది. నిర్మాణదారుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యమే కారణమని తెలుసుకున్నా. దాంతో ప్రజలు ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించడానికి వీలయ్యే మంచి ఆవాసాలను నిర్మించాలని నిర్ణయించుకున్నా’ అంటారు మేధ.

కాప్‌ ప్రతినిధిగా...

ఆ ఘటన ఆమెను ఆర్కిటెక్ట్‌ అయ్యేలా చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో మాస్టర్స్‌ చేస్తోంది. ప్రకృతికి, మనుషులకు మధ్య సంబంధం మరింత పెరగాలంటుంది మేధ. ఆ ఉద్దేశంతోనే పర్యావరణహిత నిర్మాణాలపై అవగాహన కలిగిస్తోంది. ‘నిర్మాణాలు జరిగేప్పుడు కాలుష్యానికి దారితీస్తాయి. పర్యావరణంపైనా ప్రతికూల ప్రభావం ఎక్కువ. ఎంచుకునే గాజు వస్తువుల నుంచి గోడలు, టైల్స్‌ వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాలుష్యాన్ని తగ్గించొచ్చు. ఒక ఇంటికి అవసరమయ్యే విద్యుత్తును సోలార్‌ లేదా ఇతర పర్యావరణ హిత మార్గాల ద్వారా సృష్టించుకోవచ్చు. అందులో వాడుకునే నీళ్లను కూడా రీసైకిల్‌ చేసి మళ్లీ వినియోగించుకోవచ్చు. కానీ ఇవన్నీ అంత తేలిక కాదు.. అలాగని అసాధ్యమూ కాదు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలను కూడా కొన్ని మార్పులు చేసి పర్యావరణహితంగా మార్చవచ్చు’ అనే మేధ.. తను రూపొందించే భవనాలకు ఈ పద్ధతులను అనుసరించడమే కాదు.. తోటి ఆర్కిటెక్ట్‌లకూ అవగాహన కల్పిస్తున్నారు.

‘విమెన్‌ క్లైమెట్‌ ఛాంపియన్‌షిప్‌’ లో భాగంగా ఉన్న ఈమె కాప్‌-26లో దేశ ప్రతినిధుల్లో ఒకరిగా వ్యవహరించారు. ఏబీసీ అనే ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి.. పాఠశాలలు, కాలేజీలలో సుస్థిర జీవనానికి సంబంధించిన వర్క్‌షాపులను నిర్వహిస్తున్నారు. ‘విద్య చాలా శక్తిమంతమైనదని నమ్ముతాన్నేను. విద్యార్థులు, యువత సుస్థిర జీవన విధానాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం’ అంటారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్