అమ్మలు దిద్దిన మెరికలు!

అండగా ఉండాల్సిన తండ్రి దూరమైనా... అమ్మ నీడలో పెరిగారు. కూలీనాలీ చేసుకుంటూ వాళ్లిచ్చిన ఆత్మవిశ్వాసంతోనే జాతీయ స్థాయికి ఎదిగారీ అమ్మాయిలు.. ఒకరు పారాలింపిక్స్‌లో రాణించేందుకు సిద్ధమవుతుంటే మరొకరు ఒలింపిక్స్‌లో మెరవాలని కలలుకంటున్నారు.

Updated : 26 Apr 2023 04:20 IST

అండగా ఉండాల్సిన తండ్రి దూరమైనా... అమ్మ నీడలో పెరిగారు. కూలీనాలీ చేసుకుంటూ వాళ్లిచ్చిన ఆత్మవిశ్వాసంతోనే జాతీయ స్థాయికి ఎదిగారీ అమ్మాయిలు.. ఒకరు పారాలింపిక్స్‌లో రాణించేందుకు సిద్ధమవుతుంటే మరొకరు ఒలింపిక్స్‌లో మెరవాలని కలలుకంటున్నారు. వాళ్లే శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల రూపాదేవి.. నంద్యాలకు చెందిన పల్లె చౌడేశ్వరి..


ప్రమాదంలో కాళ్లు కోల్పోయి..

నుకోని ప్రమాదం తన జీవితాన్ని దెబ్బకొట్టినా... బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ తనేంటో నిరూపించుకుంటోంది రూపాదేవి. శ్రీకాకుళం జిల్లా సంతవురిటికి చెందిన యశోద, సత్యనారాయణల రెండో కూతురు రూప. ఆరేళ్ల వయసుకే తండ్రిని కోల్పోయింది. తల్లి వ్యవసాయ కూలి పనులు చేసి చదివించింది. 2019లో.. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా ఒక రోజు మేడపై నుంచి కళ్లు తిరిగి పడిపోయింది రూప. వెన్నెముక దెబ్బతినడంతో రెండు కాళ్లూ చచ్చుపడిపోయి నడవలేని స్థితి. తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల (సీఎంసీ)లో చేరి తన పనులు తాను చేసుకొనేందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంది. సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకుని అమ్మకి ఆర్థికంగా సాయపడాలని బెంగళూరు వెళ్లింది. అక్కడే దివ్యాంగుల కోటాలో ఓపెన్‌ స్టేట్స్‌ పారా బ్యాడ్మింటన్‌ పోటీల సమాచారాన్ని పత్రికలో చూసింది. దాని గురించి ఎలాంటి పరిజ్ఞానం లేకున్నా దరఖాస్తు చేసింది. యూట్యూబ్‌లోనే మెలకువలు నేర్చుకుంది. 2021 డిసెంబరులో తొలి ప్రయత్నంలోనే సత్తా చాటి రజత పతకాన్ని అందుకుంది. ఆనంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ వ్యవస్థాపకుడు ఆనందకుమార్‌ ఆమె ప్రతిభను చూసి మైసూరులో ఆరు నెలల పాటు శిక్షణ అందించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ 2022 ఆగస్టులో, 2023 ఫిబ్రవరిలో వరుసగా రెండు స్వర్ణ పతకాలు సాధించింది. లఖ్‌నవూలో మొన్న మార్చి నెలాఖర్లో నిర్వహించిన జాతీయ స్థాయి పారాబ్యాడ్మింటన్‌ పోటీల్లో సింగిల్స్‌లో స్వర్ణం, డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. ఇలా అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. వచ్చే నెల థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పారాబ్యాడ్మింటన్‌ పోటీల్లోనూ సత్తా చాటుతానని, తనను ప్రోత్సహిస్తోన్న అమ్మ, ఆర్థికంగా అండగా ఉంటోన్న తాతయ్య, శ్రేయోభిలాషులు తనపై పెట్టుకున్న ఆశల్ని నెరవేరుస్తానని కొండంత ఆత్మవిశ్వాసంతో చెబుతోంది రూప.

- మక్కా సూరిబాబు, జి.సిగడాం


పొట్టి దుస్తుల్లో పోటీలకు అవసరమా అన్నారు....

‘పొట్టి దుస్తులు వేసుకోవాలి. పోటీలంటూ ఊరూరా తిరగాలి. ఇంటి పనులు నేర్చుకుని లక్షణంగా ఉంటే మంచి సంబంధాలొస్తాయ’ంటూ చౌడేశ్వరికి ఎంతోమంది ఉచిత సలహాలిచ్చారు. తన పతకాలే వాళ్లకి సమాధానం చెబుతాయనుకుందామె. అన్నట్టుగానే జాతీయస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌లో పతకాల పంట పండిస్తోంది..  
‘మాది నంద్యాల జిల్లా చాబోలు. ఊళ్లో పనుల్లేక పట్టణానికి వచ్చేశాం. నాన్న కృష్ణ, అమ్మ భూలక్ష్మి.. కొదిపాటి పొలం కౌలుకు చేసే వారు. అమ్మనాన్నలకి మేం ముగ్గురం. ఎస్‌వైవీసీపీ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నా. నేను ఏడో తరగతిలో ఉండగా నాన్న గుండెపోటుతో చనిపోయారు. దాంతో మా జీవితాలు తలకిందులయ్యాయి. నాన్న ఆపరేషన్‌ కోసం చేసిన అప్పు తీర్చడానికి అమ్మ కూలీకి వెళ్లేది. ఆ పనులు లేకపోతే ఇళ్లలో పనికి వెళుతుంటుంది. అమ్మ ఒక్కతే కష్టపడుతుంటే చూడలేక వేసవి సెలవుల్లో నేనూ కూలీకి వెళ్తుంటా. స్కూల్లో త్రోబాల్‌ ఆడటం నేర్చుకుని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. కబడ్డీ ఆడగలను. కానీ శిక్షణ తీసుకునేందుకు డబ్బులేక ఆగిపోయా. పట్టణంలోని మహంకాళీ హనుమాన్‌ వ్యాయమశాలలో పవర్‌ లిఫ్టింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వెళ్లా. ఏడాదంతా కష్టపడి మెలకువలను తెలుసుకున్నా. కోచ్‌ చెన్నెంశెట్టి పుల్లయ్య సాయంతో పవర్‌ లిఫ్టింగ్‌పై పట్టు సాధించాను. 2019 వైజాగ్‌ స్టీల్‌ప్లాంటులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజతం సాధించాను. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తర్వాత ఎన్నో రాష్ట్రస్థాయి పతకాలు సాధించా. చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో జాతీయ పోటీల్లో స్వర్ణాలు సాధించా. ఈ ఏడాది విశాఖ స్టీల్‌ప్లాంటులో జాతీయ పోటీల్లో స్వర్ణంతో పాటు స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా పురస్కారమూ దక్కింది’ అనే చౌడేశ్వరి శాకాహారి కావడం విశేషం. ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని గెలిచి మా కోసం అహోరాత్రాలూ కష్టపడుతున్న అమ్మకు బహుమతిగా ఇవ్వడమే తన కల అంటోందీ అమ్మాయి.

- సాధనాల శ్రావణి, కర్నూలు


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్