కలమే వారి గళం
గతేడాది సెప్టెంబరులో ఇరాన్ వీధులన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. పోలీసుల కస్టడీలో అమానుషంగా బలైన ఓ అమాయకురాలి చావుకు బదులిమ్మంటూ అందరూ రోడ్డెక్కారు. ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం వందలాదిమంది ప్రాణాలను బలిగా తీసుకుంది. వేలాదిమందిని నిర్భంధించింది.
గతేడాది సెప్టెంబరులో ఇరాన్ వీధులన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. పోలీసుల కస్టడీలో అమానుషంగా బలైన ఓ అమాయకురాలి చావుకు బదులిమ్మంటూ అందరూ రోడ్డెక్కారు. ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం వందలాదిమంది ప్రాణాలను బలిగా తీసుకుంది. వేలాదిమందిని నిర్భంధించింది. తమ కలంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్న మహిళా జర్నలిస్టులు నర్గీస్ మహమ్మదీ, ఇలాహే మహమ్మదీ, నిలోఫర్ హమేదిలకు అక్కడి చట్టం జీవితఖైదు విధించింది. అయినా ధైర్యసాహసాలను వీడక, నిజం కోసం పోరాడుతున్న వీరిని ‘యునెస్కో ప్రెస్ ప్రైజ్’ అవార్డు వరించింది.
హిజాబ్ సరిగ్గా ధరించడంలో ప్రభుత్వనియమాలను ఉల్లంఘించిందని గతేడాది సెప్టెంబరు 16న 22 ఏళ్ల మహ్సా ఆమిని అరెస్టు అయి, చనిపోయింది. ఈమె మృతి అనుమానాస్పదమనే వార్త గుప్పుమంది. పోలీస్ కస్టడీలో తీవ్ర గాయాలైన ఆమిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే వార్త బయటకొచ్చింది. ప్రజలు ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఆమిని మృతికి సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ఈ సమాచారం ప్రజలకు చేరడం వెనుక మహిళా జర్నలిస్టులు నర్గీస్ మహమ్మదీ, ఇలాహే మహమ్మదీ, నిలోఫర్ హమేది ఉన్నారు. తమ కలం గళం ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. దీంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 529 మంది చనిపోయారు. 19,700మంది నిర్బంధానికి గురయ్యారు. 100 మందికి పైగా జర్నలిస్టులు ప్రాణాలొదిలారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోరాటానికి ప్రపంచ నలుమూలల నుంచి మద్దతు వచ్చింది. పత్రికాముఖంగా, తమవంతు కృషి చేసిన ఈ ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నించి, చివరకు జైలుకు పంపింది.
వెలుగులోకి..
మహ్సా ఆమిని మృతిపై అనుమానాలను మొట్టమొదటగా వెలుగులోకి తీసుకురావడంలో 35 ఏళ్ల ఇలాహే మహమ్మదీ, 30 ఏళ్ల నిలూఫర్ హమేది కృషి ఎంతో. ఇలాహే ఆ తర్వాత లింగసమానత్వంపై రాసిన పలురకాల కథనాలు ప్రజలను ఆలోచించేలా చేేేశాయి. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ కక్ష సాధింపుచర్యలెన్నో మాపై జరిగాయి. ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రపంచానికి తెలియజేయాలనేది మా ప్రయత్నం. మా ఆశయాన్ని బలహీనపరచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కష్టాలు, ఇబ్బందులెన్నెదురైనా మా పోరాటాన్ని ఆపలేదు. జర్నలిస్టులుగా న్యాయం కోసం పోరాడాం. ఇందుకు మాకు విధించిన ఈ జైలు శిక్షను కూడా లెక్కచేయం. ఇప్పుడు కూడా ప్రజాశ్రేయస్సే మా ఆశయమం’టున్న ఇలాహే మహమ్మదీ, నీలోఫర్ హమేదిలకు సామాజిక సంస్కరణవాదులైన జర్నలిస్టులుగా పేరుంది. గతేడాది సెప్టెంబరు నుంచి ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఎంపిక చేసిన ఈ ఏడాది అందరినీ ప్రభావితం చేసిన 100మంది ప్రముఖుల్లో స్థానాన్ని దక్కించుకున్నారు.
జైల్లోనూ...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిందంటూ.. 51 ఏళ్ల నర్గీస్ మహమ్మద్‌కు అక్కడి న్యాయస్థానం 16 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఎవిన్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ఈమెకు స్థానికంగా దేశంలో ప్రజల తరపున పోరాడే ప్రముఖ జర్నలిస్టుగా పేరుంది. డిఫెండర్స్ ఆప్ హ్యూమన్‌రైట్స్ సెంటర్‌కు ఈమె ఉపాధ్యక్షురాలు కూడా. ‘జైలులో ఉన్నా నా కలం ఆగలేదు. నాలుగు గోడల మధ్య నన్ను ఒంటరిగా ఉంచినా నేను భయపడలేదు. నా గదిలో కనిపించే చీమతోనూ గంటలతరబడి మాట్లాడగలను. జర్నలిస్టుగా నా బాధ్యతలను నిర్వర్తించాలనే తోటి ఖైదీల కష్టనష్టాలను తెలుసుకొన్నా. ఆ ఇంటర్వ్యూలను నా ‘వైట్ టార్చర్’ రచనలో పొందుపరిచానంటు’న్న నర్గీస్ ధైర్యసాహసాలకు ‘రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్’ వంటి పురస్కారాలెన్నో లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.