ఆ ఔషధం అందరికీ అందాలని..

నాతో వచ్చేదెవరు? యుద్ధం చేసేదెవరు? స్థిరమైన గొంతుతో ప్రపంచానికి పిలుపునిచ్చింది నందిత. ఒంటరిగా మొదలైన ఆమె ప్రయాణానికి ఎంతోమంది తోడుగా నిలిచారు.

Published : 17 May 2023 00:25 IST

నాతో వచ్చేదెవరు? యుద్ధం చేసేదెవరు? స్థిరమైన గొంతుతో ప్రపంచానికి పిలుపునిచ్చింది నందిత. ఒంటరిగా మొదలైన ఆమె ప్రయాణానికి ఎంతోమంది తోడుగా నిలిచారు. వారందరి పోరాటం ఫలించి నేడు కోట్లమందికి టీబీ మందులు చౌకగా అందేందుకు మార్గం సుగమమైంది...

రోజుకి 15 మాత్రలు. వికారం. శరీరంలో ఎముకలు తప్ప అసలు కండ ఉందా అనేంతగా బరువు తగ్గిపోయింది. జుట్టంతా రాలిపోయి.. అద్దంలో చూసుకుంటే తనని తానే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ముంబయి అమ్మాయి నందితా వెంకటేశన్‌. అప్పటికే నాలుగు సర్జరీలు అయ్యాయి. 24 ఏళ్ల వయసులో తన స్నేహితులంతా కెరియర్‌, సరదాలు అంటూ హుషారుగా ఉంటే తను మాత్రం ఇలా టీబీతో పోరాటం చేస్తోంది. ఆ మాటకొస్తే టీబీ తనకి కొత్తేం కాదు. ఏడేళ్లప్పుడు ఓసారి వచ్చింది. మందులతో నయం అయ్యింది. ఆ తర్వాతే తను శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుని నాట్యకారిణిగా రాణించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో పీజీ చేసి ఎకనమిక్‌ టైమ్స్‌లో జర్నలిస్ట్‌గా చేరిన ఏడాదికే మళ్లీ టీబీ తిరగబెట్టింది. ఈ సారి కాస్త గట్టిగానే వచ్చింది. చికిత్సలో భాగంగా రెండేళ్లపాటు వాడిన మందులకి నందిత వినికిడి శక్తిని కోల్పోయింది. వరుస సర్జరీలతో బాధ. అంత కష్టంలోనూ ఒక నిర్ణయానికి వచ్చింది. ‘నేను బతకాలీ.. టీబీ అంతు చూడాలి’ అని. అనుకున్నట్టుగా ప్రాణాలతో బయటపడింది. చికిత్స సమయంలో ఎన్నో సందేహాలు. డాక్టర్లు తను అడిగిన ప్రతి సందేహాన్ని తీర్చలేకపోయారు. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఫుమెజా టిసిల్లా నందితకి తోడుగా నిలిచింది. తనూ క్షయ వ్యాధిగ్రస్తురాలే. ఈ జబ్బుతో తను ఎదుర్కొన్న అనుభవాలని ఓ బ్లాగ్‌లో వివరంగా రాసేది. ఆమెని కలిసిన తర్వాతే టీబీ గురించి అనేక విషయాలు తెలుసుకుంది నందిత.

మేలు చేయాలని..

ప్రపంచం మొత్తం మీద నమోదయ్యే కేసుల్లో 29 శాతం మనదేశానివే. దక్షిణాఫ్రికా తర్వాతి స్థానంలో ఉంది. తక్కిన మందులతో పోలిస్తే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారుచేసిన బెడాక్విలిన్‌ ఈ జబ్బుకి మంచి మందు. రెండేళ్లుపట్టే చికిత్సా కాలాన్ని ఆరునెలలకే తగ్గించిన గొప్ప ఔషధం. కానీ ఖరీదు ఎక్కువ. ఒక కోర్సుకయ్యే ఖర్చు దాదాపుగా 20,000 వేల రూపాయలు. దాంతో చాలామందికి అందుబాటులో లేకుండా పోయింది. 20 ఏళ్లుగా ఈ ఔషధాన్ని అందించిన జాన్సన్‌ సంస్థ 2019లో పేటెంట్‌ హక్కులని పునరుద్ధరించాలని కోరింది. అదే జరిగితే.. ఎంతోమంది ఈ మందు అందక టీబీతో నరకం అనుభవిస్తారనుకుంది నందిత. అందుకే స్నేహితురాలు టిసిల్లాతో కలిసి డాక్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌ స్వచ్ఛంద సంస్థ సాయంతో ఈ పేటెంట్‌కి వ్యతిరేకంగా ఒక పిటిషన్‌ వేసింది. అది జనరిక్‌ ఔషధంగా మారితే తక్కువ ధరకే పేదలకు అందుతుందని, ప్రజలపై 70 శాతం ఆర్థిక భారం తగ్గుతుందని నిరూపించింది. ఆమె బాధను అర్థం చేసుకున్న పేటెంట్లు, డిజైన్ల అసిస్టెంట్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ లతికా దావరా ఈ పేటెంట్‌ని పునరుద్ధరించాల్సిన అవసరం లేదని చారిత్రాత్మక తీర్పునిచ్చారు. అలా ఈ సంస్థ గుత్తాధిపత్యానికి చెక్‌ పడింది. ‘నా మందుల కోసం నాన్న ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అమ్మ ఉద్యోగం వదులుకుంది. డొనేషన్ల ద్వారా వచ్చిన సొమ్ముతో కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ చేయించుకున్నా. అదే ఆర్థిక స్థోమత లేకపోతే? లుపిన్‌ సంస్థ దీని జెనరిక్‌ వెర్షన్‌ తయారుచేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది తయారీదారులు మార్కెట్లోకి వస్తే ధరలు క్రమంగా తగ్గుతాయి. లక్షలమందికి ప్రయోజనం’.. అనే నందిత ఇప్పటికీ సోషల్‌ మీడియాలో టీబీ వ్యాధిగ్రస్తులు అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ‘నా బాయ్‌ ఫ్రెండ్‌కి నాకు టీబీ ఉన్న విషయం చెప్పొచ్చా, నా లైంగిక జీవితంపై ఇది ప్రభావం చూపిస్తుందా?’ ఇలా ప్రతి ప్రశ్నకీ ఓపిగ్గా జవాబులు చెబుతుంది. అప్పుడు నాకున్న ప్రశ్నలకు ఎవరూ జవాబులు చెప్పలేదు. ఇప్పుడు నేనా పని చేయాలనుకుంటున్నా అనే నందిత ఈ ఏడాది బ్రేవ్‌ఫైట్‌ అవార్డుని అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్