ఆమె మరణం నా కెరియర్‌ని మార్చింది...

ఆడపిల్లనంటూ నాన్న కట్టుబాట్లు... ఆంక్షలను ధిక్కరించి అమ్మమ్మ మహిళోద్ధరణ కోసం చేసిన సాహసాలు... నిష్తాను ఆలోచింపజేశాయి. లింగ వివక్ష జర్నలిస్టుని కానివ్వకుండా అడ్డుపడినా... దాన్ని అదుపు చేయడానికి, సాధికారత సాధించడానికి తనదైన ప్రయత్నాలెన్నో చేశారామె.

Updated : 23 May 2023 04:39 IST

ఆడపిల్లనంటూ నాన్న కట్టుబాట్లు... ఆంక్షలను ధిక్కరించి అమ్మమ్మ మహిళోద్ధరణ కోసం చేసిన సాహసాలు... నిష్తాను ఆలోచింపజేశాయి. లింగ వివక్ష జర్నలిస్టుని కానివ్వకుండా అడ్డుపడినా... దాన్ని అదుపు చేయడానికి, సాధికారత సాధించడానికి తనదైన ప్రయత్నాలెన్నో చేశారామె. అవే ఆమెను ఐక్యరాజ్య సమితి తరపున ఒక దేశంలో మహిళా కార్యాలయానికి అధిపతిని చేశాయి. ఆ పదవిలో ఉన్న పిన్న వయస్కురాలు తనే! అదెలాగో తెలుసుకుందామా...

‘నాకు చిన్నప్పుడు స్త్రీవాదం, సమానత్వ సూత్రాలనెవరూ బోధించలేదు.. తెలియకుండానే ఆంక్షల మధ్య పెరిగినా...అది వివక్ష అని అర్థం చేసుకునే వయసు కాదు...దాన్ని కాలక్రమంలో తెలుసుకోగలిగా. వాటికి అడ్డుకట్ట వేయగలిగినప్పుడే... మహిళలు స్వేచ్ఛగా ఎదగగలరు’ అంటారు నిష్తా సత్యం. దిల్లీలో స్థిరపడిన సంప్రదాయ తమిళ కుటుంబం ఆమెది. చిన్నప్పుడు అందరు పిల్లలూ ఆదివారం చిత్రలహరి, చాచా చౌధురి చూస్తూ కాలం గడిపేవారు. నిష్తా మాత్రం నున్నగా తలకు నూనె రాసుకుని... బస్సెక్కి నాన్న సభ్యత్వం తీసుకున్న బ్రిటిష్‌-అమెరికన్‌ గ్రంథాలయాలకు వెళ్లేది. ఆడపిల్ల అనే ఆంక్షలూ, ఆచారాల మధ్య పెరిగిన ఆమె ‘స్కూలు వయసులో అప్రకటిత, అలిఖిత వివక్షను చవిచూశా’ అంటారామె. ‘స్కూలు వయసులో ఓ సారి ‘తూ చీజ్‌ బడీహై మస్త్‌ మస్త్‌’ అని పాడుతూ ఉంటే నాన్న నన్ను మోకాళ్ల మీద మూడుగంటలు నిలబెట్టారు’... అసలు నేనేం తప్పు చేశానో అర్థం కాలేదు. ఇంత పెద్ద శిక్ష నాకెందుకు విధించారని ఎంత ఆలోచించినా తట్టలేదు. ఆ కట్టుబాట్లు మొదట నన్ను కట్టడి చేసినా... వాటి నుంచి బయటపడి ఉన్నతస్థాయిలో నిలబడే స్థైర్యాన్నిచ్చాయి. ఇందుకు మా అమ్మమ్మ బృహదా వెంకట్రామన్‌ కూడా ఓ స్ఫూర్తి. కుష్ఠువ్యాధి నిర్మూలన, వితంతు వివాహల గురించి మాట్లాడాలంటే భయపడే కాలంలోనే... ఆవిడ వాటికోసం పోరాడారు. అదంతా తెలిసి నేను జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’ అంటారామె. అయితే ఆ రోజుల్లో వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో ఓ మహిళా జర్నలిస్టుని దుండగులు కాల్చి చంపిన సంఘటన నిష్తా ఆశలపై నీళ్లు చల్లింది. ఆడపిల్ల కాబట్టే అలా జరిగిందని భయపడ్డ తన తల్లిదండ్రులు తనకి ఏ మాత్రం ఇష్టం లేని ఆర్థికశాస్త్రం చదివించారు. తర్వాత్తర్వాత కూడా పనిచేసే చోట, సమాజంలోనూ ఇలాంటి సంఘటనలెన్నో గమనించారామె. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌, యూకేలోని నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో మాస్టర్స్‌ చేశారామె.

దక్షిణాసియా మహిళల సాధికారత కోసం...

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణం నుంచి ఆడపిల్లల ట్రౌజర్లకు ప్యాకెట్‌లు ఇవ్వకపోవడం వరకూ.... ఎన్నో విషయాలను గుర్తించారు. మరోపక్క ఈ తరహా అంశాలపై తన పోరాటం సాగిస్తూనే... కేపీఎంజీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రముఖ సంస్థలో ఆర్థికవేత్తగా పనిచేశారు. తర్వాత యూఎన్‌ రెసిడెంట్‌ కోఆర్డినేటర్‌కి ప్రైవేట్‌ సెక్టార్‌ అడ్వైజర్‌గా నియమితు రాలయ్యారు. ‘తైమూర్‌ లెస్టే’ దేశంలోని యూఎన్‌ ఉమెన్‌ కార్యాలయానికి ఇప్పుడు నిష్తా అధిపతి. లింగ సమానత్వాన్ని, మహిళా సాధికారతనూ సాధించడానికి 2021 సెప్టెంబర్‌లో ఈ పదవిలో నియమితురాలయ్యారు. అంతకుముందు ఇక్కడ డిప్యూటీ కంట్రీ రిప్రజెంటివ్‌గానూ పనిచేశారు. 193 దేశాల్లో యూఎన్‌ మహిళల కోసం నిర్వహిస్తోన్న కార్యాలయానికి బాధ్యత వహించిన అతి చిన్న వయస్కురాలు. తర్వాత దక్షిణాసియాలో మహిళా సాధికారత, భవిష్యత్తు అవకాశాలను మెరుగుపరచడానికి వివిధ కార్యక్రమాలెన్నో చేపడుతున్నారు. ఆమె సుదీర్ఘ కెరియర్‌లో ఇండియా, భూటాన్‌, మాల్దీవులు, శ్రీలంక... వంటి దేశాల్లో యూఎన్‌ మహిళా కార్యాలయాల నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టారు. చిన్నప్పుడు నాకు ఎదురైన ఎన్నో ప్రశ్నలకు తర్వాత కాలమే సమాధానం చెప్పింది. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదనే నా తాపత్రయం’ అని చెబుతారు నిష్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్