అది చూసి.. ఉద్యోగమే సులువనుకున్నాం!

చదువు.. ఆపై కెరియర్‌ అంటూ పరుగులు. ఒక స్థాయికి వచ్చామనుకోగానే పలకరించేస్తాయి.. ఆరోగ్య సమస్యలు. ఈ ఐఐటియన్లదీ అదే సమస్య. పరిష్కారం కోసం వెదికితే ఎక్కడ చూసినా రసాయనాలు, జంతువులు, సింథటిక్‌ వాటితో చేసినవే! ప్రకృతిసిద్ధమైన ప్రత్యామ్నాయాలను ప్రయత్నిస్తే అన్న ఆలోచన.. అక్కాచెల్లెళ్లు సుధ, వేద గోగినేనిలను వ్యాపారవేత్తలను చేసింది.

Updated : 23 May 2023 06:52 IST

చదువు.. ఆపై కెరియర్‌ అంటూ పరుగులు. ఒక స్థాయికి వచ్చామనుకోగానే పలకరించేస్తాయి.. ఆరోగ్య సమస్యలు. ఈ ఐఐటియన్లదీ అదే సమస్య. పరిష్కారం కోసం వెదికితే ఎక్కడ చూసినా రసాయనాలు, జంతువులు, సింథటిక్‌ వాటితో చేసినవే! ప్రకృతిసిద్ధమైన ప్రత్యామ్నాయాలను ప్రయత్నిస్తే అన్న ఆలోచన.. అక్కాచెల్లెళ్లు సుధ, వేద గోగినేనిలను వ్యాపారవేత్తలను చేసింది. వాళ్ల ‘ఎర్త్‌ఫుల్‌’ ప్రయాణాన్ని వేద వసుంధరతో పంచుకున్నారిలా..

చాలామంది పనిధ్యాసలో పడి సరిగా తినరు. మారిన జీవనశైలి, యాంత్రికత కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇక శరీరానికి సరైన పోషణేది? ఫలితమే జుట్టురాలటం, రోగనిరోధక శక్తి తగ్గటం, హార్మోన్ల అసమతుల్యతలు సహా అనేక సమస్యలు. అక్క, నేనూ వీటిని ఎదుర్కొన్న వాళ్లమే! మాది విజయవాడ దగ్గర మణికొండ. నాన్న విష్ణువర్ధన్‌ రావు వ్యాపారవేత్త. అమ్మ గీతా సుధ ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ చేసినా మాకోసమని ఇంటికే పరిమితమైంది. నాన్న వ్యాపారరీత్యా భువనేశ్వర్‌, వైజాగ్‌, హైదరాబాద్‌ తిరిగాం. ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి అక్క సాయి సుధ కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌, నేను బయోటెక్నాలజీలో డ్యూయల్‌ డిగ్రీ చేశాం. ఇద్దరం కార్పొరేట్‌ సంస్థల్లో స్థిరపడ్డాం. దాదాపు దశాబ్ద అనుభవం. పిగ్మెంటేషన్‌, నీరసం, నడుము నొప్పి.. ఇలా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. పరిష్కారం కోసం చూస్తే రసాయనాలతో కూడినవి, సింథటిక్‌వీ.. జంతువుల నుంచి చేసేవే కనిపించాయి. ఆ నిరాశే.. మమ్మల్ని వృక్ష ఆధారిత ప్రత్యామ్నాయాల కోసం వెదికేలా చేశాయి.


మహిళలు ఆర్థిక పురోగతి సాధించినప్పుడే ముందుకు సాగగలరు. అంకురాల స్థాపనవైపు మొగ్గు చూపుతున్న అమ్మాయిలెందరో. ఆరోగ్యంపై దృష్టిపెడుతూ ఆశావహ దృక్పథంతో పనిచేస్తే చాలు. ఎవరికైనా విజయం సాధ్యమే అని మా నమ్మకం.


కరివేపాకు.. ఉసిరి పొడి

2021లో ఉద్యోగాలకి రాజీనామా చేసి దాచుకున్న సొమ్ముతో వ్యాపారం మొదలు పెట్టాం. పూర్తిగా వృక్షాధారిత ఉత్పత్తుల తయారీ కష్టమైనా సవాలుగా తీసుకున్నాం. ఏడాదిపాటు పరిశోధనలు, శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులతో చర్చించాం. తర్వాతే ఉత్పత్తి ప్రారంభించాం. ముందు ఇంట్లో వాళ్లు, స్నేహితులు మెచ్చాకే బయటి వాళ్లకి అమ్మాలనుకున్నాం. ఎవరైనా ఉపయోగించేలా జంతు, నిల్వ కారకాలు లేకుండా తయారు చేశాం. ఐరన్‌ కోసం కరివేపాకు, ఉసిరి నుంచి విటమిన్‌ సి, విటమిన్‌ ఎ కోసం మునగాకు వంటివి వాడుతున్నాం. ప్రస్తుతం చర్మం, కేశాలు, జీర్ణవ్యవస్థ, నిద్ర, పీసీఓఎస్‌ సమస్యలకు పొడి, క్యాప్సూల్స్‌ అందిస్తున్నాం. మొదట అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలతో అనుసంధానమైనా సొంత వెబ్‌సైట్‌నీ ఏర్పరచుకున్నాం.

దాన్ని తరిమేయాలనీ

వ్యాపారమంటేనే సవాళ్లు. అవి మాకూ ఎదురయ్యాయి. అప్పుడు ఆర్థికమాంద్యం. దీంతో పెట్టుబడికి ఎవరూ ముందుకు రాలేదు. స్టార్టప్‌.. జీతాలు తక్కువని ఉద్యోగులూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీని బదులు ఉద్యోగమే సులువేమో అనిపించిన సందర్భాలూ లేకపోలేదు. నిద్రలేమితో బాధపడుతోన్న ఒకమ్మాయి.. మా ఉత్పత్తిని వాడి సమస్య తీరిందని ఆనందంగా కృతజ్ఞతలు చెబుతూ మెసేజ్‌ చేసింది. ఎన్నో వాడి విసిగిపోయిందట తను. అలా ఎందరి నుంచో మెసేజ్‌లు వస్తోంటే తెలియని సంతృప్తి. ఇవన్నీ ముందుకు సాగేలా చేశాయి. మా కష్టం ఫలించి ఏంజెల్‌ ఫండింగ్‌ ద్వారా రూ.మూడున్నర కోట్లు పెట్టుబడి దొరికింది. క్రమంగా ఉద్యోగులనూ పెంచుకుంటూ వెళుతున్నాం. ప్రొటీన్‌ పౌడర్‌ తీసుకురావాలి.. క్యాప్సూల్స్‌లానే కాకుండా ఆకర్షించేలా డ్రింక్‌, చిప్స్‌ రూపంలోనూ ఉత్పత్తులను తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దేశంలో పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలన్నదే మా లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల టర్నోవర్‌ సాధించగలమని నమ్మకంతో ఉన్నాం.

- మన్నెం రమాదేవి, హైదరాబాద్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్