రాయలేకపోయినా ర్యాంకు సాధించింది!

షెరిన్‌ ర్యాంకు 913! అది చూసిన ఇంట్లోవాళ్లు, బంధువులు సంబరాలు చేశారు. సివిల్స్‌ ర్యాంకు.. ఆ మాత్రం ఆనందం ఉంటుంది అనిపిస్తోంది కదూ! అయితే గతం మర్చిపోయిన అమ్మాయి.. మూడేళ్ల క్రితం అక్షరాల దగ్గర్నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి చేరింది.

Published : 25 May 2023 00:10 IST

షెరిన్‌ ర్యాంకు 913! అది చూసిన ఇంట్లోవాళ్లు, బంధువులు సంబరాలు చేశారు. సివిల్స్‌ ర్యాంకు.. ఆ మాత్రం ఆనందం ఉంటుంది అనిపిస్తోంది కదూ! అయితే గతం మర్చిపోయిన అమ్మాయి.. మూడేళ్ల క్రితం అక్షరాల దగ్గర్నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి చేరింది. ఇప్పుడేమనిపిస్తోంది? ఇదేకాదు.. ఎన్నో అవరోధాలను దాటుకొంటూ వచ్చిందీ పాతికేళ్ల అమ్మాయి. తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని మీరూ చదవండి...

ఓరోజు సాయంత్రం.. మిద్దె మీద ఆరేసిన దుస్తులు తీయడానికి వెళ్లింది షెరిన్‌ షహానా. గాలికి కొట్టుకుపోతున్న చున్నీని అందుకోబోయి.. కాలు జారి పైనుంచి కింద పడిపోయింది. వెన్నెముకకు బలమైన గాయమైంది. నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయింది. చేతులూ పూర్తిగా పనిచేయవు. అంతకు రెండేళ్ల ముందే నాన్నను కోల్పోయింది షెరిన్‌. అది ఆమె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. దాన్నుంచి కోలుకుంటోంది అనగా ఈ ప్రమాదం. రెండేళ్లు పూర్తిగా మంచానికే పరిమితం అయ్యింది. కొంత గతాన్ని, అక్షరాలనూ మర్చిపోయింది. మగదిక్కు లేని కుటుంబం.. ఆర్థికంగా కష్టాలు. అయినా కూతుళ్లిద్దరికీ అండగా నిలిచారు షెరిన్‌ వాళ్లమ్మ అమినా. వీళ్లది కేరళలోని వయనాడ్‌. ఖర్చుతో కూడుకున్నదైనా చికిత్స ఇప్పించారు. ప్రత్యేక చక్రాల కుర్చీనీ తెప్పించారు. అమ్మ కష్టాన్ని చూస్తోన్న షెరిన్‌కి ఏదైనా సాధించాలని ఉండేది. తిరిగి చదువు మొదలుపెట్టి.. క్రమంగా కోలుకుంది. చిన్నతనం నుంచీ తనకు సివిల్‌ సర్వీసెస్‌ కల. ‘ఈ పరిస్థితిలో అది సాధించడం అసాధ్యం’ అన్నారంతా. తను మాత్రం సంకల్పం ఉంటే చాలనుకుంది.

మొబైల్‌, ల్యాప్‌టాప్‌ సాయంతో ఆన్‌లైన్‌లో చదవడం మొదలు పెట్టింది. ‘నెట్‌’కి అర్హత సాధించి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో సాధించింది. పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. సివిల్స్‌కీ సొంతంగా సన్నద్ధత ప్రారంభించింది. శిక్షణ తీసుకుందామంటే అమ్మకి భారమవుతుందన్న భయం. ఆ సమయంలోనే స్థానిక సంస్థ అంగవైకల్యం ఉన్నవారికి శిక్షణిస్తోందని తెలిసి ఆన్‌లైన్‌ శిక్షణలో చేరింది. మలయాళంలోనే పరీక్ష రాసి.. 913వ ర్యాంకు సాధించింది. పేపరు మీద పెన్ను పెట్టలేని పరిస్థితి షెరిన్‌ది. అందుకే స్క్రైబ్‌ సాయం తీసుకుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది తను. అమ్మను చికిత్సకు తీసుకెళుతోంటే వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం ఆక్సిడెంట్‌కి గురైంది. భుజానికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ‘నాకే ఎందుకిలా’ అనుకోలేదామె. ‘ప్రాణం ఉంది, అంతకుమించి ఆత్మవిశ్వాసముంది. చాలు ఏదైనా సాధించొ’చ్చని ధైర్యంగా చెబుతోన్న షెరిన్‌ ఆదర్శనీయురాలే కదా మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్