అమెరికాలో మన కారప్పొడులు!

బ్రెడ్‌ టోస్ట్‌లో పుట్నాల పొడి.. క్రిస్పీరోల్‌కి కొబ్బరి కారం.. సూపులకి వెల్లుల్లి కారం.. ఏంటిదీ.. వేడన్నం, నెయ్యి, కారప్పొడి ఇది కదా అసలు రుచి అంటారా? అలకనంద అలా ఆలోచించలేదు మరి.

Updated : 07 Jun 2023 04:58 IST

బ్రెడ్‌ టోస్ట్‌లో పుట్నాల పొడి.. క్రిస్పీరోల్‌కి కొబ్బరి కారం.. సూపులకి వెల్లుల్లి కారం.. ఏంటిదీ.. వేడన్నం, నెయ్యి, కారప్పొడి ఇది కదా అసలు రుచి అంటారా? అలకనంద అలా ఆలోచించలేదు మరి. మన రకరకాల కారప్పొడుల రుచుల్ని అమెరికాలో అందిస్తూ ‘వాహ్‌’ అనిపించుకుంటోంది. తన పొడుల ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా..

మా స్వస్థలం వరంగల్‌ కానీ హైదరాబాద్‌కి మారాం. 15 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి స్థిరపడ్డాం. నాన్న విశ్వనాథ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఐటీ కన్సల్టెంట్‌. అమ్మ వాసవి. నాన్నది వ్యవసాయ కుటుంబం. ఎప్పుడూ మొక్కలు, పొలాల గురించే ఆలోచిస్తుంటారు. ‘అన్నదాత’ పత్రిక తెప్పించుకొని చదువుతుండేవారు. ఆయనవల్లే నాకూ మొక్కల పెంపకం, పంటలు వంటివాటిపై ఆసక్తి. మా అమ్మ రకరకాల కారప్పొడులను చాలా బాగా చేస్తుంది. డైనింగ్‌ టేబుల్‌ మీదే కాదు.. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళుతుంటా కూడా.

సరదాగా చేస్తే..

కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌ల్లో బ్యాచిలర్స్‌, ఆపై ఎంబీఏ చేశా. ప్రముఖ ఫార్మా సంస్థల్లో హెల్త్‌కేర్‌ టెక్‌ కన్సల్టెంట్‌గా పనిచేశా. 2020లో హైదరాబాద్‌కొచ్చాం. అప్పుడే లాక్‌డౌన్‌. ఇల్లు కదల్లేని పరిస్థితి. అనుకోకుండా దొరికిన ఈ సమయంలో అమ్మ, నేను.. నా చిన్నతనం, అల్లరి, ఇష్టాలు.. ఇలా ఎన్ని చర్చించుకొని ఉంటామో! అప్పుడే తను చేసే కారప్పొడులను నాకూ నేర్పించమని అమ్మని అడిగా. తేలిక అనిపిస్తుంది కానీ దినుసులన్నీ సరిగా పడితేనే రుచి అని తెలిసొచ్చింది. సరదాగా వీటిని అందరికీ రుచి చూపించొచ్చు కదా అని ‘పొడి లైఫ్‌’ ప్రారంభించా. స్నేహితులు, బంధువుల ద్వారా ప్రచారం బాగా లభించింది. హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ సహా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచీ ఆర్డర్లు వచ్చాయి.

సగంపైగా వారే!

ఇంతలో నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. తర్వాత కొన్ని నెలలు కొనసాగించినా పనుల ఒత్తిడి వల్ల మన దేశంలో అమ్మడం ఆపేశా. అయినా అందరి నుంచీ ‘మీ పొడుల్ని బాగా మిస్‌ అవుతున్నాం’ అన్న మెసేజ్‌లొచ్చేవి. నాకూ తెలియని వెలితి. దీంతో 2021లో యూఎస్‌లో ప్రారంభించా. అక్కడి భారతీయులే కాదు.. అమెరికన్లూ మా పొడి రుచులను చూస్తున్నవారే! విదేశాలకీ ఎగుమతి చేస్తున్నాం. టోస్ట్‌, సలాడ్లు, సూపులు.. ఇలా ఎన్నింట్లో ప్రయత్నించొచ్చో చెబుతూ నా ఇన్‌స్టాలో వీడియోలు పోస్ట్‌ చేస్తుంటా. కొన్నవారికి కొత్తరుచులతో ఎలా ఆస్వాదించొచ్చో కార్టూన్లతో కూడిన ఒక రెసిపీ కార్డు పంపిస్తా. దానికోసం పిల్లల పుస్తకాలకు బొమ్మలేసే ‘ఆర్యమా’తో ఒప్పందం చేసుకున్నా. ఇవన్నీ మార్కెట్‌ని పెంచాయి. ఎంతోమంది ‘మేమిలా ప్రయత్నించాం. రుచి కొత్తగా ఉందంటూ’ ఇన్‌స్టాలో వీడియోలు పెట్టేవారు. అవి ఆనందాన్నివ్వడమే కాదు.. ఆదరణనీ తెచ్చిపెట్టాయి. వినియోగదారుల్లో 60 శాతం మంది ఇంగ్లిష్‌ వారే! పొడుల తయారీని అమ్మ.. మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ వంటివన్నీ నేను చూసుకుంటున్నాం. దీనికోసం ఉద్యోగాన్నీ వదిలేశా. కొంతమందికి ఉపాధినీ కల్పించా. మన సంప్రదాయ రుచుల్ని ఇక్కడివారంతా మెచ్చుకుంటోంటే.. వారి వంటకాల్లో భాగం చేసుకుంటోంటే చాలా ఆనందమేస్తుంది. అమ్మ మంచి విద్యార్థినట. కానీ అమ్మాయని పైచదువుల కోసం వేరే ఊరు పంపలేక మాన్పించారు. తనను తాను నిరూపించుకునే అవకాశం దీనిద్వారా కలగడమూ సంతోషంగా అనిపిస్తుంది.


చదువుకునే సమయంలో దేశంలోని ఎన్నో ఎన్‌జీఓలతో కలిసి పనిచేశా. రైతులు, గ్రామీణ మహిళల కోసం ఏదైనా చేయాలనుండేది. దేశంలో ఓ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ పెట్టి, రైతుల వద్ద నేరుగా పంట కొనుగోలు చేయాలి, ఉత్పత్తుల ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలని కల. దానికి ఇంకా సమయం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్