సహజంగా దొరుకుతున్నప్పుడు కల్తీ ఎందుకు?

చిన్నప్పటి నుంచి ప్రకృతిపై తనకున్న ప్రేమ లక్షల జీతాన్ని వదులుకునేలా చేసింది. ఫ్యాషన్‌ రంగంలో డిజైనర్‌గా దూసుకుపోతున్నా... ఆమె మనసు మాత్రం రంగుల తయారీ వైపే మళ్లింది. అదే మాన్య చేరబుడ్డిని సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మార్చింది.

Published : 20 Jun 2023 06:20 IST

చిన్నప్పటి నుంచి ప్రకృతిపై తనకున్న ప్రేమ లక్షల జీతాన్ని వదులుకునేలా చేసింది. ఫ్యాషన్‌ రంగంలో డిజైనర్‌గా దూసుకుపోతున్నా... ఆమె మనసు మాత్రం రంగుల తయారీ వైపే మళ్లింది. అదే మాన్య చేరబుడ్డిని సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మార్చింది. ‘ట్రీహౌస్‌’ పేరుతో వర్క్‌షాపులు నిర్వహిస్తూ, వేల మంది మనసులు దోచుకుంటోన్న ఈ హైదరాబాదీ తన ప్రయాణాన్ని వసుంధరకు వివరించారిలా.

దుస్తులు, ఆహారం, గోడలకు వేయడానికి ప్రకృతిలో దొరికే సహజ రంగులు ఉండగా, సింథటిక్‌వి ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఇదే ప్రశ్న వర్ణాల తయారీ దిశగా నన్ను నడిపించింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం నుంచి వ్యాపారం, కళల్లో డబుల్‌ డిగ్రీ అందుకున్నాను. నాన్న దయాకర్‌, అమ్మ జయశ్రీ ఇద్దరూ డాక్టర్లు. ఇద్దరు అన్నయ్యలు. అమ్మ ఖాళీ సమయాల్లో మిద్దెతోటను పెంచేది. చిన్నప్పుడు ఎక్కువ సమయం గార్డెన్లోనే గడిపేదాన్ని. వీటిమీద ఆసక్తి కలిగింది అక్కడే. అదే ఇలా వ్యాపారంగా మారుతుందని అనుకోలేదు. అన్నయ్యల పిల్లలకు వేసే దుస్తుల రంగులు కృత్రిమంగా ఉండేవి. వాటితో అలర్జీలూ రావడం గమనించాను. ఈ కల్తీ రంగుల నుంచి వారిని కాపాడాలనుకున్నాను. సహజ పద్ధతుల్లో డై చేయడమెలాగో ఇంటర్నెట్‌లో వెతకడం మొదలు పెట్టా. అప్పటికే సింథటిక్‌ రంగుల నివారణ, పర్యావరణ పరిరక్షణకు చాలా చోట్ల వందల, వేల ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిజైనర్‌ని కదా ఏ వస్త్రం వాడితే పిల్లలకు మెత్తగా, సౌకర్యంగా ఉంటుందో తెలుసు. ఆ అవగాహనతోనే ఇది మొదలుపెట్టాను. ఆకులు, పువ్వులు ఇంట్లో మిగిలిన కాయగూరలు, పండ్లు, పసుపు, మట్టి... ఇలా అన్నిటినీ వీటి తయారీలో ఉపయోగించేదాన్ని.

ఉద్యోగం వదులుకున్నా

కుటుంబ సంస్థ డాక్టర్‌ ‘సి’లో కో ఫౌండర్‌గా ఏడాది పనిచేశాను. తర్వాత బెంగళూరులో డిజైనర్‌ ఉద్యోగానికి పట్టుబట్టి వెళ్లినా.. అదీ మానేశా. ‘మంచి ఉద్యోగం వదులుకుంది.. రంగులు వేసుకోడానికేనా’ అని హేళన చేసేవారు. పట్టించుకోలేదు. మొదట నా కుటుంబంలో కృత్రిమ వర్ణాల వాడకం మానేస్తే చాలు అనుకున్నాను. అదే వృత్తిగా మారి ఇంతమంది ఔత్సాహికులను పరిచయం చేస్తుందని ఎన్నడూ ఊహించలేదు. 

ఇల్లా... దోబీఘాటా

ఇల్లు, బాత్రూమ్‌, మిద్దె ఇవే నా ప్రయోగశాలలు. ఎక్కడ పడితే అక్కడ వస్త్రాలకు రంగులు అద్దడం, ఆరబెట్టడం.. ఇవన్నీ చూసి ‘ఇది ఇల్లా, దోబీఘాటా’ అన్నారు. కానీ నేను తయారు చేసిన వస్త్రాలు వచ్చాక అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే దీన్ని వ్యాపారంగా మలచాలన్న ఆలోచన వచ్చింది. హైదరాబాద్‌ వేదికగా మొదటి ఎగ్జిబిషన్‌. రూ.25వేలు పెట్టుబడి పెడితే లక్షదాకా ఆదాయం వచ్చింది. అలా ఏడునెలల్లో వందల మంది వినియోగదారుల్ని సంపాదించుకున్నా. ఇంతలోనే కరోనా. ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అది నచ్చలేదు. ఆన్‌లైన్‌ వేదికగా తరగతులు చెప్పడం మొదలుపెట్టాను.

ప్రధాన నగరాల్లో ట్రీహౌస్‌

దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో 5500 మందికి సహజ రంగుల తయారీ మీద శిక్షణ ఇచ్చాను. వీరిలో 50 మంది ఈ వ్యాపారం చేస్తున్నారు. దాదాపు 200 వర్క్‌షాపులు చేశాను. ఈ వర్క్‌షాపుల్లో విజ్ఞానంతో పాటూ వినోదం ఉంటుంది. మట్టిని తొక్కుతూ, వాళ్లకి కావాల్సిన పూలూ, ఆకులను వారే సేకరించుకోగలిగే ప్రాంతాన్ని ఎంచుకుంటాం. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఇదో మంచి పద్ధతి. అందుకే పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఆసక్తిగా పాల్గొంటుంటారు. నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తాం. కొన్ని ఎన్జీవోల్లో ఉచితంగానూ వర్క్‌షాపులు నిర్వహించా. సమయం దొరికినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో ఈ పాఠాల వీడియోలు పెడుతుంటా. దీన్నుంచి జీవనోపాధి పొందిన వాళ్లని చూస్తే ఆనందంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్