అమ్మ చనిపోతేనే గానీ అర్థం కాలేదు...

నిద్రలేచింది మహిళా లోకం అని 19వ శతాబ్దంలోనే కవితలు, పాటలు రాశారు. అది కేవలం పట్టణాల్లోనేనా? పల్లెటూళ్ల సంగతేంటి.

Updated : 08 Jul 2023 06:04 IST

నిద్రలేచింది మహిళా లోకం అని 19వ శతాబ్దంలోనే కవితలు, పాటలు రాశారు. అది కేవలం పట్టణాల్లోనేనా? పల్లెటూళ్ల సంగతేంటి. వీళ్లు మనుషులు కాదా? అందరిలా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలని ఉండదా? బావిలో కప్పల్లా తామున్నదే ప్రపంచం అని బతికేయడమేనా... ఇవే ప్రశ్నలు సురభిని కలచివేశాయి. గతం గతః. యువతనైనా వీటినుంచి కాపాడాలనుకుంది. మహిళా విద్యను ప్రోత్సహిస్తూ, ‘విరామం వాళ్ల హక్కు’ అంటూ నినాదాలు మొదలుపెట్టింది. దీని వెనుకున్న కారణాలు ఆమె మాటల్లోనే...

గ్రామీణ మహిళలకీ కలలుంటాయి. వాళ్లు వంటింటి కుందేళ్లు కాదు. విరామం వాళ్ల హక్కు. ఇవే నా ఎన్జీఓ, బ్లాగ్స్‌ ద్వారా చెప్పాలి అనుకున్నది. మాది బుందేల్‌ఖండ్‌లోని మాధవపురా. ఉమ్మడి కుటుంబం. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో ఎంటెక్‌, డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌లో మాస్టర్స్‌ చేశాను. మా ఊరిలో విదేశాల్లో చదువుకున్న మొదటి మహిళను నేనే. చదువు పూర్తై తిరిగి వచ్చిన ఇంటా, బయటా మహిళల పద్ధతులు చాలా చికాకు పెట్టేవి. ఇంకా ఏ యుగంలో బతుకుతున్నారు అనుకునేదాన్ని. 10 తర్వాత చదువాపేయడం. 17 రాగానే పెళ్లి. అదేంటని అమ్మను ప్రశ్నిస్తే నీకిక్కడి పద్ధతులు తెలీయవన్నారు. చాలా కోపం వచ్చేది. ఆమె చనిపోతేనే కానీ అర్థం కాలేదు. ఎన్ని ఆశలు, కోరికలను అణుచుకుని బతికిందో. దుఖాఃన్ని దిగమింగుకోడానికి ఆమె స్నేహితురాళ్లని కలిశా. వాళ్లు అమ్మ గురించి చెబుతోంటే తనని నేనేంత తప్పుగా భావించానో తెలిసొచ్చింది. అప్పుడే నిర్ణయించుకున్నా. అమ్మలా ఇంకే మహిళా ఉండకూడదని.

సంఝే సప్నే స్థాపన

హిమాచల్‌ ప్రదేశ్‌లోని నివాస్‌ ప్రాంతంలో ‘సంఝే సప్నే’ను ప్రారంభించాను. కలలను కనండి, మాతో పంచుకోండి. వాటిని సాకారం చేసుకోడానికి అవసరమైన సాయాన్ని మేం అందిస్తాం. ఇదే లక్ష్యంతో ముందడుగు వేశాం. ఇద్దరితో మొదలై 25 మంది దాకా ఆ క్యాంప్‌లో చేరారు. వారందరికి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేలా ప్రోత్సహించాం. వితంతువులు, పది పూర్తై పెళ్లికి సిద్ధమైనవారు దీనిలో చేరడం ప్రారంభించారు. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందం చేసుకుని ఉద్యోగాలూ కల్పిస్తున్నాం.  

పెళ్లైన వారికోసం

పెళ్లీ, పిల్లలే ఆడవాళ్ల జీవితార్థం అన్నట్టు డిజైన్‌ చేసేస్తుంటారు పెద్దవాళ్లు. వాళ్లకీ కోరికలు ఉంటాయని.. విరామం కావాలని, వంటిళ్లే వాళ్ల ప్రపంచం కాదని చెప్పాలనుకున్నా. వాళ్లకోసమే ‘విమెన్‌ ఎట్‌ లీజర్‌’ అవర్‌ ప్రాజెక్ట్‌ను చేస్తున్నా. సంఝే సప్నే తరగతులకు వస్తున్న విద్యార్థులకూ ఇది వివరిస్తున్నాం. వాళ్లకు దొరికే విరామం మానసికంగా, శారీరకంగా ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో చెబుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్