ఆసుపత్రి నుంచి ఇంటర్వ్యూ.. కోటి స్కాలర్‌షిప్‌ సాధించా!

అమ్మయ్యాక కెరియర్‌ కలను పక్కన పెట్టాల్సిందే.. చాలామంది వినే మాటే ఇది. కానీ తన విషయంలో అలా అవ్వొద్దు అనుకున్నారు వాడపల్లి అనూష. విదేశాల్లో ఎంబీఏ కల కోసం చాలానే కష్టపడ్డారు. వరుస వైఫల్యాలు.. మరెన్నో అవరోధాలొచ్చినా ఓపిగ్గా దాటారు. ప్రసవమై ఆసుపత్రి నుంచే ఇంటర్వ్యూ పూర్తిచేసుకొని రూ.కోటి స్కాలర్‌షిప్‌తోపాటు ఫెలోషిప్‌నీ సాధించారు.

Published : 24 Jul 2023 00:37 IST

అమ్మయ్యాక కెరియర్‌ కలను పక్కన పెట్టాల్సిందే.. చాలామంది వినే మాటే ఇది. కానీ తన విషయంలో అలా అవ్వొద్దు అనుకున్నారు వాడపల్లి అనూష. విదేశాల్లో ఎంబీఏ కల కోసం చాలానే కష్టపడ్డారు. వరుస వైఫల్యాలు.. మరెన్నో అవరోధాలొచ్చినా ఓపిగ్గా దాటారు. ప్రసవమై ఆసుపత్రి నుంచే ఇంటర్వ్యూ పూర్తిచేసుకొని రూ.కోటి స్కాలర్‌షిప్‌తోపాటు ఫెలోషిప్‌నీ సాధించారు. ఆ ప్రయాణం ఆవిడ మాటల్లోనే..

బాబు ఆలనాపాలనా, ఇంటిపని.. మరోవైపు ఉద్యోగం. వీటన్నింటి మధ్యా విదేశీవిద్యకు సన్నద్ధత నా విషయంలో సాహసమే. అయినా కొనసాగించానంటే సాధించాలన్న తపనే కారణం. మాది విజయవాడ. జేఎన్‌టీయూ కాకినాడలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌  చదివా. చివరి ఏడాది చదువుతుండగానే గేట్‌ రాస్తే.. విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడే మావారు నవీన్‌కుమార్‌ పరిచయం అయ్యారు. 2017లో వివాహమైంది. కోరుకున్న జీవితం, మంచి ఉద్యోగం.. అయినా ఏదో అసంతృప్తి. ఓసారి మా ఆడపడుచుని చూసేందుకు దుబాయ్‌ వెళ్లాం. అక్కడొక అంతర్జాతీయ బిజినెస్‌ స్కూల్‌ను చూశాక చదివితే ఇలాంటి దానిలో చదివాలనిపించింది. ప్రయత్నిద్దామనుకునేంతలో బాబు. వాడిని చూసుకుంటూనే ప్రవేశపరీక్ష- జీమ్యాట్‌కి సిద్ధమయ్యా. ఇంతలో కొవిడ్‌. ఉద్యోగం, బాబు ఆలనాపాలనా, చదువు.. ఒక్కసారే వీలయ్యేది కాదు. అరగంటైనా కేటాయించలేకపోయా. అయినా మొండిగా ప్రయత్నించా.

ప్రసవమైన మూడో రోజే!

2021.. మొదటి ప్రయత్నంలోనే జీమ్యాట్‌ 700 స్కోర్‌ చేశా. దాంతో దేశంలో టాప్‌ ఐఐఎంల్లో సీటొస్తుంది. కానీ నా లక్ష్యం వేరు. మళ్లీ రాశా. రెండుసార్లూ స్కోరు తగ్గుతూ పోయింది. అప్పుడే చేరకుండా తప్పు చేశానా అన్న అపరాధ భావన. వదిలేద్దామా అనీ ఆలోచించా. మావారి ప్రోత్సాహంతో చివరిసారి ప్రయత్నిద్దామనుకున్నా. అయితే అప్పటికే నేను మళ్లీ గర్భవతిని. అయినా పట్టుదలగా కొనసాగించా. నెలలు దగ్గరపడ్డాయి. దీనికితోడు అనారోగ్య సమస్యలు. తెల్లవారుజామున 4గం.కు లేచి చదివేదాన్ని. బాబు లేచాక వాడి పనులు, స్కూలుకి పంపడం, తిరిగి చదువు.. ఇదే నా దినచర్య. పరీక్ష 2022 అక్టోబరు 20న. నవంబరులో ప్రసవ తేదీ. ఇంతలో అక్టోబరు 5న కరోనా బారినపడ్డా. నాతోపాటు ఇంట్లోవాళ్లు కూడా. పరీక్ష సమీపిస్తోంది. బాబుకు ఊపిరితిత్తుల సమస్యలొచ్చాయి. ఆయన ఆసుపత్రిలో వాడి దగ్గరుంటే నేనొక్కదాన్నే 30కి.మీ. కారు నడుపుకొంటూ వెళ్లి పరీక్ష రాసొచ్చా. ఈసారి 800కి 770 సాధించా. తెలియని వాళ్ల నుంచీ మెసేజ్‌లు, కాల్స్‌ రూపంలో ప్రశంసలొచ్చాయి. నా ఆనందానికి అవధుల్లేవు. నచ్చిన విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నా. ఇంతలో నవంబరు 11న పాప పుట్టింది. నేనేమో వార్డులో, పాప ఎన్‌ఐసీయూలో ఉన్నాం. మూడ్రోజులకే ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. నీరసం, ఒళ్లంతా నొప్పులను భరిస్తూ ఆసుపత్రిలోనే దాన్నీ పూర్తిచేశా.

అయిదింటి నుంచి పిలుపు

అమెరికాలోని టాప్‌ బిజినెస్‌ స్కూళ్లు.. టక్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, కార్నెల్‌ జాన్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, మిచిగన్‌ రాస్‌ వర్సిటీ, కెనాన్‌ ఫ్లాగర్‌, మెకాంబస్‌ వర్సిటీల నుంచి పిలుపొచ్చింది. ఆ కబురు విన్నాక అప్పటిదాకా పడ్డ శ్రమకి ఫలితం దక్కిందనిపించింది. వాటిల్లో ప్రపంచంలోనే ఆరోస్థానంలో ఉన్న టక్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో చేరనున్నా. రూ.కోటి ఉపకారవేతనంతోపాటు ప్రతిష్ఠాత్మక ఫోర్టే ఫెలోషిప్‌నకూ ఎంపికయ్యా. ఫోర్టే వ్యాపారరంగంలో మహిళలు రాణించడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుంది. దానిలో ఫెలోగా ఎంపికవ్వడం గర్వంగా ఉంది. ఎంబీఏ పూర్తయ్యాక బిజినెస్‌ కన్సల్టెంట్‌గా చేయాలి, ఆ అనుభవంతో మహిళా సాధికారతకు ముఖ్యంగా అమ్మల కెరియర్‌కు సాయపడే స్టార్టప్‌ని ప్రారంభించాలన్నది కల. పెళ్లి, పిల్లలు మహిళల కలలకు అడ్డుగా భావించేవారే ఎక్కువ. పిల్లలు మన ఆశయాల సాధనకు ఎప్పుడూ అడ్డుకారు. వాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి అనుకోండి.. ముందుకు వెళ్లాలన్న పట్టుదల దానంతటదే వచ్చేస్తుంది. వైఫల్యాలు ఎదురైనా కుంగిపోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. ఎంతోకష్టమైన ఇంటి పని, పిల్లలను ఒంటి చేత్తో చూసుకునే మనకు మిగిలినవి చాలా సులభంగా తోస్తాయి.

- సురేష్‌ రావివలస, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్