ఎగిరే పడవను ఆవిష్కరించి..

చిన్నప్పుడు.. ‘నువ్వు గృహిణిగానో, చిన్న ఉద్యోగిగానో మిగిలిపోతావు తప్ప దేనికీ పనికిరావ’న్నారు టీచర్‌. కాస్త పెద్దయ్యాక.. ‘తనకు ఉద్యోగం వస్తే గొప్పే! పెళ్లి చేసేయడం మేలు’ అనుకున్నారు ఇంట్లోవాళ్లు.

Updated : 01 Sep 2023 04:51 IST

చిన్నప్పుడు.. ‘నువ్వు గృహిణిగానో, చిన్న ఉద్యోగిగానో మిగిలిపోతావు తప్ప దేనికీ పనికిరావ’న్నారు టీచర్‌. కాస్త పెద్దయ్యాక.. ‘తనకు ఉద్యోగం వస్తే గొప్పే! పెళ్లి చేసేయడం మేలు’ అనుకున్నారు ఇంట్లోవాళ్లు. మరిప్పుడు? ‘మెరైన్‌ రంగంలో ఓ సంచలన’మని ప్రపంచమంతా పొగుడుతోంది. సాధారణ విద్యార్థినైన సంప్రీతి.. ఫ్లయింగ్‌ బోట్‌ను రూపొందించే స్థాయికి ఎలా ఎదిగింది? తెలియాలంటే ఆమె కథ చదివేయాల్సిందే!

‘ప్రపంచంలోని ప్రతిదీ ఎవరోకరి సృష్టే! అయితే వాళ్లు నీకన్నా నాకన్నా తెలివైనవారు మాత్రం కాదు’.. సంప్రీతి భట్టాచార్యను ప్రేరేపించిన వాక్యమిది. ఈమెది కోల్‌కతా. చదువులో ఎప్పుడూ వెనకే. స్కూల్లో మేథ్స్‌, ఫిజిక్స్‌ల్లో పదే పదే ఫెయిలవుతోంటే విసిగిపోయిన టీచర్‌ ‘గృహిణిగానో, ఏదోక చిన్న ఉద్యోగంలోనో మిగిలిపోతా’వన్నారు. ఇంట్లోవాళ్ల సలహాతో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో చేరింది. అందరూ చదువయ్యాక ఏదోక ఉద్యోగంలో స్థిరపడ్డారు. తనకి మాత్రం ఇంట్లోవాళ్లు పెళ్లి చేద్దామనుకున్నారు. అప్పుడు పై కొటేషన్‌ 20ఏళ్ల సంప్రీతి కంటపడింది. అప్పుడే కంప్యూటర్‌ తన ఇంటికొచ్చింది. స్నేహితుల్లా తనూ విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసింది. 540 ఈమెయిల్స్‌ పెడితే అన్నీ తిరస్కరణలే! చివరి ఈమెయిల్‌ తనకు అవకాశాన్ని మోసుకొచ్చింది. అలా చికాగో ‘ఫెర్మిల్యాబ్‌’లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌ అయ్యింది. అక్కడ సైన్స్‌ తద్వారా చదువుపై ప్రేమను పెంచుకుందామె.

అలా దిశ మారింది..

ఓహియో స్టేట్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీజీ చేస్తున్నప్పుడే నాసాలో ఇంటర్న్‌షిప్‌ అవకాశం వచ్చింది. అక్కడ ఫ్లైట్‌ కంట్రోల్‌ ప్రాజెక్టుకి పనిచేసింది. ఆ అనుభవంతో తన గమ్యం అంతరిక్షమని నిర్ణయించుకుంది సంప్రీతి. దానిపై పట్టు తెచ్చుకోవాలనే పీహెచ్‌డీ చేయాలనుకుంది. ఎంఐటీకి దరఖాస్తు చేసుకుంటే సీటొచ్చింది. అయితే స్పేస్‌లో రాణించాలనుంటున్న తన మార్గం అనుకోకుండా మారింది. ‘2014.. మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానం చైనా సముద్ర జలాల్లో కనిపించకుండా పోయింది. ఎంత గాలించినా దాని జాడ దొరకలేదు. అంగారకుడిపైకి వెళ్లడానికి ఆలోచిస్తున్నాం. భూమిపై 70% నీరే. చాలా రకాలుగా దానిపై ఆధారపడుతున్నాం. దాని లోతుపాతులు తెలుసుకోపోతే ఎలా అనిపించి మెరైన్‌ సంస్థను ప్రారంభించాలనుకున్నా’ అంటుంది సంప్రీతి.

బాల్‌ నుంచి బోట్‌..

2017లో ‘హైడ్రోస్వార్మ్‌’ పేరుతో అండర్‌వాటర్‌ డ్రోన్లను రూపొందించింది. బంతి రూపంలో ఉండే ఈ డ్రోన్‌ సముద్రలోతుల్లోకి వెళ్లి మునిగిన ఓడలు, విమానాల జాడ కనుక్కోవడమే కాదు చమురు లీకేజీలు, రేడియేషన్‌ వంటివీ అంచనా వేయగలదు. దీన్ని ఓ పోటీలో ప్రదర్శించి, బహుమతిని అందుకోవడమే కాదు 2016లో ఫోర్బ్స్‌ జాబితాలోనూ స్థానం సంపాదించింది సంప్రీతి. తర్వాత తోటి పీహెచ్‌డీ వాళ్లతో కలిసి 2020లో ‘నేవియర్‌’ ప్రారంభించింది. ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్లయింగ్‌ బోట్‌ రూపొందించి దాదాపు రూ.99 కోట్ల పెట్టుబడులు అందుకుంది. ‘ఎలక్ట్రిక్‌ వాహనం. దీనికి అమర్చిన వింగ్స్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే పడవను పైకి లేపుతాయి. దీంతో అలల తాకిడి తెలియదు. మామూలు దానికంటే పదిరెట్లు వేగంగా దూసుకెళుతుంది. ఇది అమల్లోకి వస్తే వేగంగా గమ్యాలను చేరడమే కాదు.. ప్రయాణ ఖర్చూ, సమయం కూడా తగ్గుతాయి’ అంటోంది సంప్రీతి. అమెరికా రక్షణ రంగంతోనూ పనిచేస్తోంది. ‘ప్రతి ఒక్కరికీ భయాలు ఉంటాయి. చేయాలి, చేయగలను అనుకొని చూడండి. ఏదోక దారి తప్పక కనిపిస్తుంది. ఒకే జీవితం. ప్రయత్నించకుండా వృథా చేయొద్ద’నే 35ఏళ్ల సంప్రీతి సంస్థను ‘టెస్లా’కు పోటీగా భావిస్తున్నారంతా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్