జీ20లో... మన సత్తా

నోరూరించే వంటకాలు పరిచయం చేశారు.. అద్భుతమైన కళా నైపుణ్యాలు ప్రదర్శించారు.. భయం లేదంటూ రక్షణగా నిలబడ్డారు... జీ20 వేదికగా అతిథులకు అసలుసిసలు భారతీయతని పరిచయం చేశారు మనవాళ్లు.

Updated : 13 Sep 2023 07:34 IST

నోరూరించే వంటకాలు పరిచయం చేశారు.. అద్భుతమైన కళా నైపుణ్యాలు ప్రదర్శించారు.. భయం లేదంటూ రక్షణగా నిలబడ్డారు... జీ20 వేదికగా అతిథులకు అసలుసిసలు భారతీయతని పరిచయం చేశారు మనవాళ్లు.

శాకాహార రుచులతో..
- అనహితా దోండీ

జీ20 సదస్సులో దేశ, విదేశీ అతిథులకు మన చెఫ్‌లు 500కుపైగా భారతీయ రుచులను వండి వార్చారు. ఆ వండిన ముగ్గురిలో 31 ఏళ్ల అనహితా ఒకరు. అమ్మకు సాయం చేస్తూ వంటపై ప్రేమను పెంచుకుంది ఈ దిల్లీ అమ్మాయి. కలినరీ ఆర్ట్స్‌లో బీఏ, లండన్‌లో డిప్లొమా చేసింది. తాజ్‌, మారియట్‌ హోటళ్లలో పనిచేసి 23 ఏళ్లకే ‘సోడా బాటిల్‌ ఓపెనర్‌ వాలా’ ప్రారంభించింది. 2016లో ‘మాస్టర్‌ చెఫ్‌’తో గుర్తింపు తెచ్చుకుంది. ఐక్యరాజ్యసమితిలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌కి ప్రతినిధిగా వ్యవహరించింది. సంప్రదాయ పార్శీ వంటకాలని బతికించడంకోసం వాటిపై తరగతులు నిర్వహించి, రెస్టారెంట్‌నీ ప్రారంభించింది. లాక్‌డౌన్‌లో ‘పార్శీ కిచెన్‌ సర్వీస్‌’తో పేరు తెచ్చుకుంది. 2019 ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో నిలిచిన తను ఎన్నో పురస్కారాలూ అందుకుంది. శాకాహార వంటలతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది. ఇదే జీ20లో అవకాశాన్నిచ్చింది. ‘నేను చేసిన స్టార్టర్లు విదేశీయుల మనసు దోచుకోవడం సంతోషంగా ఉంది’ అంటోంది అనహిత.


ప్రపంచదేశాలను ఏకతాటి పైకి తెచ్చి..
- ఈనం గంభీర్‌

ఈనం గంభీర్‌... ఈ పేరు వినగానే ఐరాస వేదికగా తన వాక్పటిమతో అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కి ముచ్చెమటలు పట్టించిన విషయం ఠక్కున గుర్తొస్తుంది. తాజా జీ20 శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌)అధికారిణి పేరు మారు మోగింది. ఈ సదస్సులో కీలకమైన డిక్లరేషన్‌ రూపకల్పనలో పనిచేశారీమె. జీ20 షేర్పా అమితాబ్‌కాంత్‌ నేతృత్వంలో తోటి అధికారి నాగరాజ నాయుడితో కలిసి పనిచేశారు. ఈ దిల్లీ డిక్లరేషన్‌లో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, పర్యావరణంతో పాటు క్లిష్టమైన అంశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను సూచించారు. ఇందుకోసం 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాలు తయారు చేశారట. దిల్లీకి చెందిన ఈనం గంభీర్‌ దిల్లీ యూనివర్సిటీలో గణితంలో పీజీ, జెనీవా విశ్వవిద్యాలయంలో ‘అడ్వాన్స్‌డ్‌ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ’లో ఎంఎస్‌ పూర్తిచేశారు. 2005 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి. ప్రస్తుతం విదేశాంగ శాఖ, జీ20 కూటమికి జాయింట్‌ సెక్రటరీ. ఈనం ఐక్యరాజ్య సమితి 74వ జనరల్‌ అసెంబ్లీ అధ్యక్ష కార్యాలయంలో శాంతి, భద్రతలకు సంబంధించిన అంశాల పైన సీనియర్‌ అడ్వైజర్‌గా ఉన్నారు. మెక్సికో, అర్జెంటీనా వంటి లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవమూ ఉంది.


మెరికల్లాంటి రక్షణ దళం..

అతిథులంతా వివిధ దేశాల నాయకులు, ప్రముఖులు. ప్రమాదం ఎటు నుంచైనా రావొచ్చు. కట్టుదిట్టమైన భద్రత తప్పనిసరి. షార్ప్‌షూటింగ్‌లో శిక్షణ తీసుకున్న 19 మంది స్వాట్‌ మహిళా కమాండోలు ఈ బాధ్యతలో భాగమయ్యారు. అతిథుల ప్రాణాలకు హాని కలిగిస్తే క్షణాల్లో ప్రత్యర్థిని మట్టుపెట్టడం వీరి విధి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు ఫోర్స్‌ నుంచి నెలరోజుల పాటు కఠిన శిక్షణనీ అందుకున్నారు.


అనువాదంతో మెప్పించారు..

దిల్లీలోని చాందినీచౌక్‌.. దేశంలోనే పేరున్న పెద్ద మార్కెట్‌ ఇది. మసాలా దినుసుల నుంచి చీరలు, నగల వరకూ అన్నీ దొరుకుతాయి. విదేశీ అతిథుల కోసం దీన్నీ సిద్ధం చేశారు. ఇక్కడ అమ్మకం దారులంతా చిరు వ్యాపారులే! మరి వారికి విదేశీ భాషలు తెలియదు కదా? అందుకని ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రతినిధులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున వంద మంది అనువాదకులని ఏర్పాటు చేశారు. వీరంతా ఇంగ్లిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ భాషల్లో నిష్ణాతులైన ఫ్యాషన్‌ డిజైనర్లు, మేకప్‌ ఆర్టిస్టులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాపారవేత్తలు. వీరంతా అతిథులు, అమ్మకందారులకు మధ్య మధ్యవర్తులుగా
వ్యవహరించారు.


చిరుధాన్యాలతో ముగ్గులు వేసి..

ఈ సదస్సులో.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నిర్మలా భాస్కర్‌ తాను స్వయంగా పండించిన రాగులతో లడ్డూలు చేసి వాటి పోషక విలువలను వివరించి అందరి ప్రశంసలనూ అందుకున్నారు. ఆమె ఒక్కరే కాదు ‘అగ్రి గల్లీ’ పేరుతో దేశవ్యాప్తంగా ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్న మహిళా రైతులు.. వందలకొద్దీ దేశీ విత్తనాలను ప్రదర్శించి పచ్చదనానికి ప్రతినిధులుగా నిలిచారు. వీళ్లలో 50 రకాలకుపైగా చిరుధాన్యాల విత్తనాలని దాచిపెట్టిన లహరీబాయి నేతల దృష్టినెక్కువగా ఆకర్షించారు. ఇక అగ్రిగల్లీలోకి స్వాగతం పలుకుతూ చిరుధాన్యాలతో వేసిన ముగ్గులు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.


కళలే కథలు చెబుతాయని...

జీ20 శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన అతిథులకు భారతీయ కళల్నీ, కళాకృతుల్నీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ‘ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’లోని భారత్‌ మండపంలో క్రాఫ్ట్స్‌ బజార్‌ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక్కడ.. పాటియాలాకు చెందిన లజ్వంతి రంగు రంగుల ఫుల్కారీ ఎంబ్రాయిడరీ దుస్తులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కళలో ప్రతిభను ప్రదర్శించినందుకే 2021లో పద్మశ్రీ అవార్డునీ అందుకున్నారామె. ఆధునిక కాలానికి తగినట్టుగా ఈ కళని మార్చి...వేల మందికి శిక్షణిచ్చారు.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్