వియ్‌శాట్‌..అమ్మాయిల ఉపగ్రహం!

చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1.. వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టిన ఇస్రో ఈసారి మరో శాటిలైట్‌ పంపడానికి సిద్ధమవుతోంది. ఎప్పట్లానే పంపిస్తోంది. ఇందులో గొప్పేముంది అంటారా? ఉంది...భూఉపరితలంపై అతినీలలోహిత కిరణాల పరిధిని కొలిచే ఈ ఉపగ్రహాన్ని పూర్తిగా మహిళలే తయారుచేశారు.  

Updated : 14 Sep 2023 07:18 IST

చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1.. వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టిన ఇస్రో ఈసారి మరో శాటిలైట్‌ పంపడానికి సిద్ధమవుతోంది. ఎప్పట్లానే పంపిస్తోంది. ఇందులో గొప్పేముంది అంటారా? ఉంది... భూఉపరితలంపై అతినీలలోహిత కిరణాల పరిధిని కొలిచే ఈ ఉపగ్రహాన్ని పూర్తిగా మహిళలే తయారుచేశారు. అందుకే దీనిపేరు విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ (వియ్‌శాట్‌). ఆ విశేషాలేంటో
తెలుసుకుందాం రండి..

త్తర భారతంలో వరదలు ముంచెత్తుతుంటే.. దక్షిణాదిన ఎండలు దంచికొడుతున్నాయి. సరైన వర్షం పడక.. నేల నెర్రెలు చాస్తోంది. అయితే అతివృష్టి.. లేకపోతే అనావృష్టి. ఎందుకిలా? కొన్నేళ్ల క్రితం కేరళని అతలాకుతలం చేసిన వరదలు.. ఇవన్నీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లిజీ అబ్రహంని ఆలోచింపచేశాయి. ఇందుకు పరిష్కారంగా తన విద్యార్థినులతో ఆమె కనిపెట్టిన పరిష్కారమే వియ్‌శాట్‌. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్స్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ ఈమె. ఈ కళాశాలకు అనుబంధంగా అంతరిక్ష ప్రయోగాలని అధ్యయనం చేసే స్పేస్‌ క్లబ్‌ ఒకటి ఉంది. ఈ క్లబ్‌కి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న లిజీ మూడేళ్ల క్రితం తన మనసులోని ఆలోచనల్ని విద్యార్థులతో పంచుకున్నారు. అలా మొదలైంది వియ్‌శాట్‌ ప్రయాణం. 

ఇస్రో సహకారంతో..

ఇస్రో వరుస ప్రయోగాలు చూశాక.. ఉపగ్రహాల తయారీ, వాటిని నింగిలోకి పంపడం ఎంత ఖర్చు, సవాళ్లతో కూడిన విషయమో తెలుస్తూనే ఉంది. అయినాసరే ఈ శాటిలైట్‌ తయారీలో తమదైన ముద్ర వేయాలనుకుందీ మహిళా బృందం.  వివిధ ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన 30మంది అమ్మాయిలు ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించారు. ఇస్రోకి చెందిన ‘ఇన్‌స్పేస్‌’ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వేతర సంస్థలు తయారుచేసే అంతరిక్ష ప్రయోగాలని పర్యవేక్షించి, మార్గదర్శకత్వం ఇస్తుంది ఇన్‌స్పేస్‌ సంస్థ. అలా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో ముందుకు నడిచారు. బృందంలో అందరూ మహిళలే కావడంతో దీనికి విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ (వియ్‌శాట్‌) అని పేరు పెట్టారు. దీని లక్ష్యం భూమి ఉపరితలంపై అతి నీలలోహిత (యూవీ) కిరణాల పరిధిని కొలవడం. ప్రస్తుతం వీరు రూపొందించిన ఉపగ్రహం ఫ్యాబ్రికేషన్‌ దశలో అంటే దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇస్రో ఆధ్వర్యంలో మరికొన్ని కఠిన పరీక్షలు నిర్వహించాక.. దీనిని షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహాన్ని భూమికి 600 కి.మీ. దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. బరువు కిలో వరకూ ఉంటుంది. దీని తయారీ కోసం రూ.30లక్షల వరకూ ఖర్చుపెట్టారు.

వాతావరణం మారుతోంది...

‘గతకొంతకాలంగా కేరళలో విపరీతమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి. వేడిగాలుల.. వరదలు. ఇందుకు కారణాలు అన్వేషించాలనే వియ్‌శాట్‌ తయారీ మొదలుపెట్టాం. శాస్త్రవేత్తల సలహాలతో ముందుకెళ్తున్నాం. దీనికోసం మా కాలేజీలో సొంతంగా గ్రౌండ్‌ స్టేషన్‌ నిర్మించుకున్నాం. తయారీ ఖర్చులని కళాశాలే భరిస్తోంది. ప్రభుత్వం, ఏజెన్సీలు ముందుకొస్తే ఇలాంటి ప్రయోగాలు మరికొన్ని చేయాలని ఉంది. గతేడాది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఆధ్వర్యంలో 750 మంది విద్యార్థినులు రూపొందించిన ‘ఆజాదీశాట్‌’ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. అదే మాకు స్ఫూర్తి అంటోంది’ విద్యార్థి బృందానికి నాయకత్వం వహించిన షెరిల్‌.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్