ఆమె కోసం.. ఓ రిపోర్టర్‌!

టేలర్‌ స్విఫ్ట్‌... పరిచయం అక్కర్లేని పాశ్చాత్య పాప్‌ గాయని. గ్రామీ అవార్డు గ్రహీత. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు. ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇసుకేస్తే రాలనంత జనం. అంతేనా, టేలర్‌ నిర్వహించే సంగీత విభావరి ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా కాసులు కురిపిస్తోందట.

Published : 15 Sep 2023 02:05 IST

టేలర్‌ స్విఫ్ట్‌... పరిచయం అక్కర్లేని పాశ్చాత్య పాప్‌ గాయని. గ్రామీ అవార్డు గ్రహీత. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు. ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇసుకేస్తే రాలనంత జనం. అంతేనా, టేలర్‌ నిర్వహించే సంగీత విభావరి ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా కాసులు కురిపిస్తోందట. ఈ విషయాన్ని ఆ దేశ ఫెడరల్‌ రిజర్వ్‌ ఇచ్చిన ఓ అధికారిక నివేదికే చెబుతోంది. ఆ మధ్య  టేలర్‌ ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేసిన సంగీత విభావరుల వల్ల ఆదాయంలో మార్పులు వచ్చాయనీ ఇందులో ప్రస్తావించింది. ఇది చాలదూ టేలర్‌కి ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవడానికి!  అయితే, తాజాగా యూఎస్‌ టుడేకి చెందిన టేనస్సియన్‌ పత్రిక టేలర్‌ స్విఫ్ట్‌ కార్యక్రమాలను కవర్‌ చేయడానికి ప్రత్యేకంగా ఓ రిపోర్టర్‌ని నియమించు కోవాలనుకుంటోందట. ఆశ్చర్యంగా ఉన్న ఈ ప్రకటన ప్రకారం... ఈ రిపోర్టర్‌ టేలర్‌ని అనుసరిస్తూ ఆవిడకు పెరిగిన ప్రేక్షకాదరణకు కారణాలు, వ్యాపార ప్రపంచంపై తను వేస్తోన్న ముద్ర, టేలర్‌ సంగీతంలోని ప్రత్యేకతలు, వస్తోన్న మార్పులపై కథనాలు ఇవ్వాలి. వాటిని ఆ సంస్థ వివిధ ఫ్లాట్‌ఫామ్‌లపై ప్రదర్శిస్తుంది. ఇలా ‘టేలర్‌ స్విఫ్ట్‌ రిపోర్టర్‌’గా పనిచేయాలనుకునే వారికి వీడియో, ఫొటోగ్రఫీ మెలకువలు తెలిసి ఉండటమే కాదు... సృజనాత్మకంగా రాయగల నైపుణ్యమూ కావాలి. అలానే, కమ్యూనికేషన్‌, జర్నలిజం, మార్కెటింగ్‌ల్లో ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్‌ పట్టా అవసరం. డిజిటల్‌ న్యూస్‌రూమ్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవమూ ఉండాలి. అప్పుడే అభిమాన గాయనితో పాటు పయనించే అవకాశం అందిస్తోందీ ఆ సంస్థ. ఇలా పనిచేసే రిపోర్టర్‌కి భారతీయ కరెన్సీలో గంటకు రూ.1700 నుంచి రూ.4222 వరకూ వేతనంగా చెల్లిస్తారు. టేలర్‌ స్విఫ్ట్‌... ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాల్లో 131 ప్రదర్శనలివ్వాలనే ఆలోచనతో ‘ఎరాస్‌ టూర్‌’ ఏర్పాటు చేసింది. ఇది అత్యధిక వసూళ్లు సాధించిన పర్యటనగా గుర్తింపు పొందడంతోనే ఈ కొత్త కొలువుని సృష్టించారట. బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్