ఆసియా క్రీడల్లో.. తొలి సంతకం!

మగరాయుడిలా దుస్తులేసుకొని వీధుల వెంట వెళుతోందని చుట్టుపక్కల వాళ్ల నుంచి ఎగతాళి! ఈ సాహస క్రీడలు మనకు అవసరమా అన్న ఇంట్లోవాళ్ల సలహాలు దాటి క్రీడాకారిణిగా రాణించింది బిల్కిస్‌ మిర్‌.

Updated : 20 Sep 2023 07:11 IST

మగరాయుడిలా దుస్తులేసుకొని వీధుల వెంట వెళుతోందని చుట్టుపక్కల వాళ్ల నుంచి ఎగతాళి! ఈ సాహస క్రీడలు మనకు అవసరమా అన్న ఇంట్లోవాళ్ల సలహాలు దాటి క్రీడాకారిణిగా రాణించింది బిల్కిస్‌ మిర్‌. ఇప్పుడు తను ఏకంగా దేశమే గర్వపడేలా ఆసియా క్రీడలకు జ్యూరీ సభ్యురాలైంది.

బిల్కిస్‌ వాళ్లది శ్రీనగర్‌లోని కన్యార్‌. ఏడేళ్ల వయసులోనే కయాకింగ్‌, కెనోయింగ్‌ల్లోకి అడుగుపెట్టింది. ఇవి జలక్రీడలు.. ఒకరకంగా పడవ పందాలుగా చెప్పొచ్చు. దాల్‌ సరస్సులో సాధన మొదలుపెట్టిన తను జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకుంది. పాతికకుపైగా జాతీయ పతకాలు సాధించింది. తన పేరిట ‘తొలి’ గుర్తింపులెన్నో! కయాకింగ్‌, కెనోయింగ్‌ల్లో ఐసీఎఫ్‌ స్ప్రింట్‌ రేసింగ్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొన్న తొలి భారతీయురాలు. జాతీయ కోచ్‌ అయిన తొలి కశ్మీరీ మహిళ. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కయాకింగ్‌, కెనోయింగ్‌ జట్లకి జాతీయ కోచ్‌ కూడా. అప్పుడే ఆమె పేరు దేశమంతా మారుమోగింది. తర్వాతా ఎన్నో పోటీల్లో బృందాలను నడిపింది. 2020లో ఇండోనేషియాలో జరిగిన ఆసియన్‌ కెనో ఫెడరేషన్‌ క్రీడలకు ఇంటర్నేషనల్‌ టెక్నికల్‌ అఫీషియల్‌గా సేవలు అందించింది. శ్రీనగర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌నీ ప్రారంభించి, అమ్మాయిలకు ఉచిత శిక్షణా ఇస్తోంది. తాజాగా ఈ నెలాఖరులో చైనాలో జరగనున్న క్రీడలకు జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ తను.

‘అథ్లెట్‌గా నాకు దక్కిన గొప్ప గౌరవమిది. 21 ఏళ్ల ప్రయాణానికి సార్థకత లభించినట్లుగా ఉంది’ అంటోన్న 33  ఏళ్ల బిల్కిస్‌ ఎన్నో అడ్డంకులను దాటి ఇక్కడివరకూ చేరుకుంది. ఏడేళ్ల వయసులో స్నేహితురాలితో కలిసి పార్కుకెళ్లి దీనిపై మనసు పారేసుకుంది. తొలిరోజే ప్రయత్నించి, తడిదుస్తులతో ఇంటికి చేరిన తనపై ఇంట్లో చేయి చేసుకున్నారు. తనేమో పట్టించుకోకుండా ధైర్యంగా ఉచిత శిక్షణలో చేరింది. తొలిసారి గెలిచి పతకం, రివార్డుతో వచ్చాక చెప్పింది. అప్పుడూ వద్దన్నా పట్టుబట్టి కొనసాగించింది. దాల్‌ సరస్సులో శిక్షణ తీసుకుంటున్న తనని చూసి చుట్టుపక్కల వాళ్లు ‘ఈ సాహసాలు అబ్బాయిలకు. బిగుతు దుస్తుల్లో ఏంటి నువ్వు సాధించే’దంటూ హేళన చేసేవారు. దీనికి తోడు తరచూ వినబడే ఉగ్రవాద కాల్పుల చప్పుళ్లు. ఎంత పట్టుదలగా ఉన్నా ఏదోఒక దశలో కుంగుబాటు తప్పదు. అది బిల్కిస్‌కి 2009లో భుజానికి గాయం రూపంలో ఎదురైంది. ఇక మానేద్దాం అనుకున్నప్పుడు వాళ్లమ్మ ‘నువ్వులా చేస్తే కశ్మీర్‌ అమ్మాయిలంతా ఓడిపోయినట్టే’ అన్న మాటతో తిరిగి కొనసాగించింది. యూకేకి వెళ్లి ఫిట్‌నెస్‌ కోర్సు చేసింది. తన శ్రమ ఫలించి, అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే కాదు.. దేశమే గర్వపడేలా చేసింది బిల్కిస్‌. ‘నేను అందించిన ఈ స్ఫూర్తితో మరింతమంది కశ్మీరీ అమ్మాయిలు తమ ప్రతిభను బయటపెట్టడానికి ముందడుగు వేస్తే చాలం’టోన్న బిల్కిస్‌ కల నెరవేరాలని కోరుకుందాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్