సముద్ర జీవులు అందించిన విజయమిది!

అందమైన సముద్ర జీవులపై ప్రేమ పెంచుకోవడమే కాదు వాటిపై అందరికీ అవగాహన కలిగించాలని బ్లాక్‌వాటర్‌ ఫొటోగ్రఫీని కెరియర్‌గా ఎంచుకుంది 26 ఏళ్ల జాయ్‌లింగ్‌ కాయ్‌. సముద్ర ఫొటోగ్రఫీలో విజేతగా నిలిచిన ఆమె అనుభవాలివి.

Published : 24 Sep 2023 01:55 IST

అందమైన సముద్ర జీవులపై ప్రేమ పెంచుకోవడమే కాదు వాటిపై అందరికీ అవగాహన కలిగించాలని బ్లాక్‌వాటర్‌ ఫొటోగ్రఫీని కెరియర్‌గా ఎంచుకుంది 26 ఏళ్ల జాయ్‌లింగ్‌ కాయ్‌. సముద్ర ఫొటోగ్రఫీలో విజేతగా నిలిచిన ఆమె అనుభవాలివి...

చైనాలోని ఓ చిన్న కుగ్రామం మాది. నాకు చిన్నతనం నుంచీ జలచరాల ఫొటోలు చూసినా.. సముద్రపుటడుగున ఉండే ప్రపంచం గురించి విన్నా కుతూహలం కట్టలు తెంచుకొనేది. కొన్ని సూక్ష్మ జలచరాలు రాత్రుళ్లు నీటి అడుగునుంచి ఉపరితలంపైకి వచ్చి సేదతీరుతాయి. వాటిని పగలు చూడలేం. ఈ విషయాన్ని మా ప్రొఫెసర్‌ చెబుతుంటే వింతగా అనిపించింది. ఈ ప్రక్రియని ‘డయల్‌ వెర్టికల్‌ మైగ్రేషన్‌’ అంటారు. రాత్రి పూట సముద్రపు ఉపరితలానికి 20 మీటర్ల కిందకు వెళ్లగలిగితే, అతిథుల్లా వచ్చే వీటిని చూడొచ్చని అర్థమైంది. కానీ వాటిని చూడాలంటే బయాలజిస్టునయినా అవ్వాలి.. లేదంటే లక్షలు ఖర్చు పెట్టి సబ్‌మెరైన్‌లో ప్రయాణించాలి. నాకూ రెండూ సాధ్యం కావు. అందుకే అండర్‌వాటర్‌ ఫొటోగ్రాఫర్‌నయ్యా.

కష్టమే..

పెద్ద చేపలు, ఆక్టోపస్‌ వంటి వాటిని చూడాలంటే వేలమీటర్ల లోతుకెళ్లాల్సిందే. అలాకాకుండా సముద్రంలో 30 మీటర్ల లోతుకి వెళ్లగలిగితే ఈ చిన్న జూప్లాంక్టన్‌లని చూడొచ్చు. అనుభవజ్ఞులను కలుసుకొని మరిన్ని విషయాలు తెలుసుకున్నా. సముద్రంలోకి వెళ్లడం కోసం ఫిలిప్పీన్స్‌ వెళ్లి స్కూబా డైవింగ్‌ నేర్చుకున్నా. బ్లాక్‌వాటర్‌ ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకొన్నా. సముద్ర నీటిలో చెత్తాచెదారంతో నీళ్లు మురికిగా ఉంటాయి.. వాటి మధ్య నుంచి అందమైన జూప్లాంక్టన్లను గుర్తించడం చాలా కష్టం.

విజేతగా...

నేను తీసే ఫొటోలను ఇన్‌స్టాలో ఉంచేదాన్ని. అవి చూసిన నా అభిమానులు ‘ఓషన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోటీకి అప్లై చేయమని సూచించారు. ఫిలిప్పీన్స్‌లో అగ్నిపర్వతం పేలిన కొన్ని రోజులకు అక్కడ సమీప సముద్రానికెళ్లా. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. లైట్‌ వేసి వెతికితే కర్రముక్కపై చిన్న నాణెంలాంటిదేదో కనిపించింది. దగ్గరగా చూస్తే నేను వెతుకుతున్న పేపర్‌ నాటిలస్‌ అనే జీవి అది. ఆ జీవిని తీసిన ఫొటోనే వేలమంది పాల్గొన్న ఈ ఓషన్‌ ఫొటోగ్రఫీ పోటీల్లో నన్ను విజేతని చేసింది. కానీ కాలుష్యం జీవులని ఎంతగా నాశనం చేస్తుందో అందరూ తెలుసుకోవాలన్నదే నా లక్ష్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్