గాలి నుంచి వస్త్రాలు చేస్తున్నారు!

గాలి నుంచి వస్త్రాలెలా వస్తాయి? లీలా, నీకాలను అడగండి ఎలా చేయొచ్చో చెబుతారు. వాళ్ల సంస్థ కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి వస్త్రాలు ఉత్పత్తి చేస్తుంది మరి! అదెలా సాధ్యమంటే వీళ్ల గురించి తెలుసుకోవాల్సిందే.

Published : 29 Sep 2023 00:58 IST

గాలి నుంచి వస్త్రాలెలా వస్తాయి? లీలా, నీకాలను అడగండి ఎలా చేయొచ్చో చెబుతారు. వాళ్ల సంస్థ కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి వస్త్రాలు ఉత్పత్తి చేస్తుంది మరి! అదెలా సాధ్యమంటే వీళ్ల గురించి తెలుసుకోవాల్సిందే.

నీకా, లీలా మషోఫ్‌ కవలలు. వీళ్ల కుటుంబం ఇరాన్‌ నుంచి అమెరికాకు వలస వచ్చింది. నాన్నకి సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌ కూడా ఉంది. సహజంగానే డిజైనర్‌ వస్త్రాలంటే ఇష్టపడే వీళ్లిద్దరూ తండ్రికి వ్యాపారంలో సాయం చేసేవారు. కానీ కెరియర్‌కి వచ్చేసరికే.. రిసెర్చ్‌ని ఎంచుకున్నారు. అప్పుడే తాము ఇష్టపడే ఫ్యాషన్‌ రంగంలో ఎంత కాలుష్యం దాగుందో అర్థమైంది వీరికి. ‘ఫ్యాషన్‌, ట్రెండ్‌ పేరుతో వస్త్రాలు తెగ కొనేస్తాం. కానీ వాటివల్ల పర్యావరణానికి కలిగే హాని ఎంతో! వీటి తయారీలో విడుదలయ్యే కార్బన్‌ ఉద్గారాలు నీరు, గాలితోపాటు నేలనీ కాలుష్యం చేస్తున్నాయి. వస్త్రాల తయారీకి అవసరమయ్యే నీటి వాడకమూ ఎక్కువే. రేయాన్‌ వంటి కొన్ని రకాలు తయారవ్వాలంటే ఎన్నో మొక్కలు బలవ్వాలి’ అని గ్రహించారీ పాతికేళ్ల కవలలు. మొక్కలు, పర్యావరణం అంటే ఎంతో ఇష్టపడే నీకా, లీలాలను ఈ సమాచారం చాలా బాధించింది. ఇద్దరూ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌, బయో ఇంజినీరింగ్‌ల్లో పరిశోధకులు. 2021లో ‘రూబీ ల్యాబోరేటరీస్‌’ ప్రారంభించారు. వాళ్ల పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక సాంకేతికతను తయారు చేశారు. ‘మా టెక్నాలజీతో పరిశ్రమల నుంచి విడుదలయ్యే కార్బన్‌ను సేకరించి, కొన్ని రకాల ఎంజైమ్‌లతో చర్యలు జరిపిస్తాం. సెల్యులోజ్‌ గుజ్జుగా మార్చి నూలుని సిద్ధం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉపయోగించే వస్త్రరకాల్లో రేయాన్‌ది మూడోస్థానం. మా విధానంతో మొక్కలూ క్షేమం, నీటి వృథా తగ్గుతుంది. పర్యావరణ హిత వస్త్రాలూ అందుబాటులోకి వస్తాయి. పైగా ఇవి త్వరగా భూమిలో కలిసిపోతాయి’ అంటున్నారీ ద్వయం. తొలిరోజుల్లో ఇద్దరే! ఇప్పుడు 26 మంది శాస్త్రవేత్తలు వీళ్లతో కలిసి పనిచేస్తున్నారు. రూబీకి నీకా సీఈఓ, లీలా సీటీఓగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ప్రముఖ సంస్థలు వీళ్ల సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు వస్త్రాలే! త్వరలో ఆహారం, ప్యాకేజింగ్‌ వంటి రంగాలపైనా దృష్టిపెడతాం అంటున్న ఈ అక్కాచెల్లెళ్లు ఎన్నో పురస్కారాలూ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్