పొదుపుగా.. ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు!

ఒంటరి ప్రయాణాలు ఇప్పుడు అమ్మాయిలకూ మామూలైపోయింది. మనసు మళ్లిందా.. నచ్చిన ప్రదేశాలకు ప్రయాణమైపోతున్నారు. డబ్బుంటే సరే! మరి లేనివాళ్ల సంగతో? ఇదే ఆలోచించారు వీళ్లు కూడా!

Updated : 01 Oct 2023 07:29 IST

ఒంటరి ప్రయాణాలు ఇప్పుడు అమ్మాయిలకూ మామూలైపోయింది. మనసు మళ్లిందా.. నచ్చిన ప్రదేశాలకు ప్రయాణమైపోతున్నారు. డబ్బుంటే సరే! మరి లేనివాళ్ల సంగతో? ఇదే ఆలోచించారు వీళ్లు కూడా! అందుకే తక్కువ ఖర్చులో ఎలా ప్రయాణించొచ్చో చెబుతూ అందరి మనసూ కొల్లగొట్టేస్తున్నారు!

రూపాయి చేతిలోలేకుండా

సరస్వతి అయ్యర్‌

చిన్నతనం నుంచీ సరస్వతి అయ్యర్‌కి ప్రయాణాలంటే ఆసక్తి. ఇంట్లోవాళ్లేమో దానికి దూరం. అలాగని తననేమీ ఆపలేదు. కానీ తెలిసిన వాళ్లనుంచి ‘ఆడపిల్లవి అలా ఒక్కదానివే తిరగడం సురక్షితం కాద’న్న సలహాలొచ్చేవి. ఆ మాటలు ఆమెను ఆపకపోగా కొనసాగించాలన్న కోరికను తనలో కలిగించాయి. 26ఏళ్ల సరస్వతిది మదురై. ముంబయిలో స్థిరపడింది. బీమా సంస్థలో ఉద్యోగం. ఖాళీ దొరికితే దగ్గర్లోని ఏదో ఒక ప్రదేశానికి వెళ్లేది. కొవిడ్‌లో ఆన్‌లైన్‌లో పనిచేస్తూ పర్యటనలు చేసింది. ఇంకేం జేబులు ఖాళీ. అప్పుడే తక్కువ బడ్జెట్‌లో పర్యటనలు చేస్తోన్న ఓ వ్యక్తి గురించి తెలిసి, సంప్రదిస్తే కొన్ని మెలకువలు చెప్పాడు. అలా గతఏడాది మొదలుపెట్టి దేశమంతా చుట్టేసింది. అక్టోబరు నుంచి విదేశాలకూ పర్యటించనుంది. ఎక్కడికైనా కాలినడకన, లిఫ్ట్‌ అడిగే వెళుతుంది. చేతిలో లిఫ్ట్‌ కావాలంటూ బోర్డు, నాలుగు జతల దుస్తులు, పడుకోవడానికి టెంట్‌, మినీ స్టవ్‌ మాత్రమే తీసుకెళుతుంది. ‘తొలిరోజుల్లో అత్యవసర నిధి ఉంచుకునేదాన్ని. ఇప్పుడు రూపాయి కూడా ఉంచుకోను. ఎంతోమంది నా గురించి తెలుసుకొని నిద్రపొమ్మని చోటిస్తారు. తినడానికి ఏదో ఒకటి ఇస్తుంటారు. అలా ఆత్మీయులైన వారెందరో ఉన్నారు. ఈ పర్యటనలో భిన్న సంస్కృతులు, రుచులను తెలుసుకున్నా. ఎందుకీ ఇబ్బంది అంటారంతా. కానీ నచ్చింది చేసి చూడండి.. శ్రమ అనిపించ’దన్న సలహానీ ఇస్తోంది సరస్వతి. తన పర్యటనల వీడియోలను యూట్యూబ్‌లో ‘ట్రావెల్‌ విత్‌ అయ్యర్‌’ పేరుతో పంచుకుంటోంది. దాదాపు లక్షన్నర మంది తనను అనుసరిస్తున్నారు.


అమ్మాయిలూ చేయగలరని
ప్రియాంక చందోలా

దేశీగర్ల్‌ ట్రావెలర్‌గా తనకో ప్రత్యేక గుర్తింపు పొందింది ప్రియాంక చందోలా! మధ్యతరగతి వారికోసం బడ్జెట్‌ ట్రావెల్‌ వీడియోలు పెడుతుందీ వ్లాగర్‌. ఆమెది బిహార్‌లోని ఓ మారుమూల గ్రామం. ఆడపిల్లలు గడపదాటి బయటకు వస్తేనే ఆక్షేపించే సంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్య పెరిగింది. అందుకే అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరని నిరూపించాలి అనుకునేది. వైవిధ్యమైన దారిని ఎంచుకుని అందరికీ ఆదర్శంగా నిలబడాలని తపన పడేది. ఇంజినీరింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసింది. ‘కార్పొరేట్‌ సంస్థలు, స్టార్టప్‌ల్లో చాలా ఏళ్లే పనిచేశా. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. ఓసారి యునిసెఫ్‌ నేపాల్‌ ప్రాజెక్టులో భూకంప బాధితుల పక్షాన పనిచేశా. అక్కడి నుంచి తిరిగొచ్చాక కొత్త ప్రదేశాలు చూడాలనీ, ఆయా సంస్కృతులను తెలుసుకోవాలనీ అనిపించింది. సాధారణ మధ్యతరగతి అమ్మాయిని! నాకు సాధ్యమా? ఎంత ఖర్చవుతుందో అంటూ చాన్నాళ్లు లెక్కలేసుకున్నా. కెమెరా ముందుకు రావడానికీ భయపడి ఏడానద్నిర పాటు యూట్యూబ్‌ ఛానెల్‌ తెరవకుండా వాయిదా వేస్తూ వచ్చా. చివరకి నన్ను నేనే నమ్మకపోతే ఎవరు నమ్ముతారనిపించి ఒంటరి ప్రయాణం సాహసమని తెలిసినా ముందుకే వెళ్లా. దేశవిదేశాల్లో తక్కువ బడ్జెట్‌లో పర్యటనలెలా చేయాలో చెబుతున్నా. సాధారణ వ్యయంతో ఆహారం, షాపింగ్‌, బస వంటివి ఎలా చేసుకోవచ్చో ప్రయత్నించి చూపిస్తా. ఇది నాకు సంతోషాన్నివ్వడమే కాదు...మరెంతో మందికి స్ఫూర్తినిస్తోంది’ అంటోంది ప్రియాంక. ఇప్పుడీ ఛానెల్‌కు మూడున్నరలక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.


ఉద్యోగాన్ని వదిలి
ఆకాంక్ష

నాన్న మిలిటరీలో చేసేవారు. దాంతో ఆకాంక్ష మోంగా వివిధ ప్రాంతాల్లో పెరగాల్సొచ్చింది. అలా పర్యటనలపై ఆసక్తి ఏర్పడింది. తనది దిల్లీ. లింక్డిన్‌లో ఉద్యోగం. నచ్చిన ప్రాంతానికి వెళ్లి కొన్ని నెలలుండి, ఆన్‌లైన్‌లో పనిచేసేది. వారాంతాల్లో చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చుట్టి, విశేషాలను యూట్యూబ్‌లో తన ఛానెల్‌లో పంచుకునేది. ఇలా ఇబ్బందిగా ఉందని ఏడాది విరామం తీసుకొని, ఉద్యోగానికి రాజీనామా చేసింది. తను దాచుకున్న మొత్తంతో పర్యటనలు చేస్తోంది. తన ప్రయాణంలో కనిపించే ఖర్చు ప్రయాణ టికెట్లే. ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లాక సత్రాలు, తక్కువ మొత్తం తీసుకునే హోటళ్లలో బస చేస్తుంది. సొంతంగా వంట చేసుకుంటుంది. సైకిల్‌ లేదా స్థానిక బస్సుల్లో ప్రయాణాలు చేస్తుంది. ఎక్కువగా పల్లెలపైనే ఆకాంక్ష దృష్టి. ‘పొడవైన భవంతులు, ఖరీదైన ప్రదేశాలను చూసి అబ్బురపడతాం కానీ.. పల్లెల్లో అసలైన ప్రకృతిని, సంప్రదాయాలనీ చూడొచ్చు. ఆత్మీయతతోకూడిన స్థానిక రుచులనూ ఆస్వాదించొ’చ్చనే ఈ 22 ఏళ్లమ్మాయి ఉత్తర భారతదేశంతోపాటు చైనా, హాంకాంగ్‌, ఇండోనేసియా, బాలీతోపాటు ఎన్నో ప్రాంతాల్లో పర్యటించింది. వివిధ దీవులకూ వెళ్లింది. తనను యూట్యూబ్‌లో 2.8లక్షల మంది అనుసరిస్తున్నారు. ‘ఎవరితోనో పోటీ పెట్టుకొని పరుగు తీయడం కాదు.. ఆగి, మీకు నచ్చింది చేయండి. మీకంటే విజేతలు ప్రపంచంలో ఎవరూ కనిపించ’రంటోంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్