మన ఆరోగ్యం.. వాళ్ల కోరిక!

ఆరోగ్యకరమైన జీవితం.. ఇదేగా ఎవరైనా కోరుకునేది? అయితే.. పోషకాహారం, జీవనశైలిపై దృష్టిపెట్టండి చాలు అంటున్నారు వీళ్లు.

Published : 04 Oct 2023 01:36 IST

ఆరోగ్యకరమైన జీవితం.. ఇదేగా ఎవరైనా కోరుకునేది? అయితే.. పోషకాహారం, జీవనశైలిపై దృష్టిపెట్టండి చాలు అంటున్నారు వీళ్లు. వీటిపై అవగాహన పెంచడానికి తనీష తన లా కెరియర్‌నే పక్కన పెట్టేస్తే.. అవని కెలొరీల గురించి చెప్పే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇంతకీ వీళ్లెవరంటే..


లా వదిలి..: తనీష

కోర్టులో జడ్జి ముందు నల్లకోటు వేసుకొని వాదించడం తనీష బవా చిన్ననాటి కల. ఈమెది దిల్లీ. లా చదవడానికి లండన్‌ వెళ్లింది. అమ్మానాన్న తోడు లేరు. తనేమో కెరియర్‌ పరుగులో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. పీసీఓఎస్‌ సహా ఎన్నో అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ‘బరువు పెరిగా. ముఖమంతా మొటిమలు, రాలే జుట్టు.. ఇంకా ఎన్నో సమస్యలు. ఇవి మనసుపైనా ప్రభావం చూపాయి. మందులు వేసుకొని ఊరుకోవడం కాదు.. మూలకారణం తెలుసుకోవాలనుకున్నా. నా సమస్యకు అస్తవ్యస్తమైన జీవనశైలే కారణమని గ్రహించా. ఆరోగ్యకరమైన ఆహారం, ఫిట్‌నెస్‌ల గురించి తెలుసుకొని పాటించా. కొద్దిరోజుల్లోనే నా ఆరోగ్యం కుదుటపడింది’ అనే తనీష.. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతోమంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం చూసింది. దీనికితోడు కరోనా. ఆన్‌లైన్‌ సలహాలు, స్నేహితులు చెప్పే చిట్కాల్ని గుడ్డిగా పాటిస్తుండటం చూసి ఆశ్చర్యపోయింది. ‘ఆరోగ్యం పేరుతో చేసే పిచ్చి ప్రయత్నాలు.. చిన్న సమస్యకీ మందులపై ఆధారపడటం.. దీర్ఘకాలంలో రోగాలను ఆహ్వానించినట్టే అనిపించింది. అప్పుడే న్యూట్రిషనిస్ట్‌ అవ్వాలనుకున్నా. అమెరికాలో సర్టిఫైడ్‌ న్యూట్రిషన్‌ కోచ్‌, న్యూట్రిషన్‌ సైన్సెస్‌లో పీజీ కోర్సులు చేశా. న్యాయవాద వృత్తిని వదిలి 2021లో ముంబయిలో ‘టాన్‌ 365’ ప్రారంభించా’నంటుంది తనీష. క్లయింట్ల పనివేళలు, జీవనశైలి వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని, దాని ఆధారంగా డైట్‌ ప్లాన్‌, సరిచేసుకోవాల్సిన అలవాట్లను సూచిస్తుంది. కార్పొరేట్‌ సంస్థలతోపాటు అతియాశెట్టి సహా ఎందరో బాలీవుడ్‌ ప్రముఖులు ఈమెను అనుసరిస్తున్నారు. తన వెబ్‌సైట్‌లోనూ ఆహారానికి సంబంధించిన సమాచారం ఉంచుతుంది. ఉత్పత్తులనూ తయారుచేసి అమ్ముతోంది. పాడ్‌కాస్ట్‌లూ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పురస్కారాలూ అందుకుంది. ‘తొలిరోజుల్లో.. న్యాయవాదిగా పేరు, సంపాదన అనవసరంగా వదులుకున్నావ్‌ అన్నారంతా. ఇప్పుడు పెద్దవాళ్లతో కలిసి పని చేస్తున్నావ్‌ అంటున్నారు. నేనెప్పుడూ చేసేది ఏదైనా ఆనందాన్నివ్వాలనే ఆలోచిస్తా. ఇప్పుడు నేనా సంతోషాన్ని అనుభవించడంతోపాటు నలుగురికీ పంచుతున్నా. ఇంతకు మించి ఏం కావాల’ంటోంది తనీష బవా.


సైట్‌లో కెలొరీలు..: అవని

కుటుంబంలో మధుమేహంతో ముగ్గురు మరణించడం అవని మథానీని ఆలోచనలో పడేసింది. ప్రపంచవ్యాప్తంగా దీని బాధితులు కోట్లలో ఉన్నారని తెలిశాక వారికేదైనా సాయం చేయాలనుకుంది. ‘అప్పటికి నాకు 14 ఏళ్లే! కానీ దాని గురించి తెలుసుకోవాలన్న తపనతో పరిశోధన మొదలుపెట్టా. టైప్‌-1 మధుమేహం వంశపారంపర్యం. దాన్ని కట్టడి చేయడం కష్టం. కానీ టైప్‌-2 అలాకాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా జాగ్రత్త పడొచ్చని గ్రహించా’నంటుంది అవని. తనది ముంబయి. ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ తర్వాత కాలిఫోర్నియా వెళ్లింది. మామయ్య, బామ్మ, తాత ముగ్గురూ టైప్‌-2 మధుమేహానికి బలవ్వడంతో ఆహారపుటలవాట్లు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలియజేస్తూ 2017లో ‘ద హెల్తీ బీట్‌’ పేరిట వెబ్‌సైట్‌ ప్రారంభించింది. ‘దీనిలో మన ఇడ్లీ, దోశ, బిర్యానీ నుంచి కూరగాయలు, మాంసాహారం వరకు ప్రతి దాంట్లో ఎన్ని కెలొరీలుంటాయో లెక్క పెట్టడం మొదలుపెట్టా. అందే పోషకాల విలువలనూ జత చేస్తున్నా. ఒక వ్యక్తి తన ఎత్తుకు తగ్గట్టుగా ఎంత బరువుండాలి.. రోజులో ఎన్ని కెలొరీలు అవసరమో కూడా చెబుతా. వీటి కోసం న్యూట్రిషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, సౌత్‌ ఆసియన్‌ హార్ట్‌ సెంటర్‌, డయాబెటిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర సంస్థల నిపుణుల సలహాలను తీసుకుంటున్నా. వేల రకాల ఆహార వివరాలుంచా. ఎవరికి వారు అవగాహన పెంచుకునేలా చెక్‌ యువర్‌ హెల్త్‌, కెలొరీ కౌంటర్‌, బిల్డ్‌ యువర్‌ మీల్‌, న్యూట్రిషన్‌ నాలెడ్జ్‌ అంటూ ప్రత్యేకతలనూ జోడించా. ఆంగ్లం, హిందీ భాషల్లో ఈ సమాచారాన్ని ఉంచా. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, మా కుటుంబంలోలా ఎవరూ మధుమేహానికి బలవ్వొద్దు’ అనే అవని న్యూట్రిషన్‌పై అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్